సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 4న తుది ఓటరు జాబితాను వెలువరించింది. అందులో పలు ఆసక్తికర అంశాలున్నాయి. జిల్లా ఎన్నికల సంఘం పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 6,61,163 మంది ఉండగా.. పురుషులు 3,21,104 మంది, సీ్త్రలు 3,40,022 మంది, ఇతరులు 37 మంది ఓటర్లుగా నమోదయ్యారు.
యువ ఓటర్లలో యువతుల సంఖ్య తక్కువే..
జిల్లా ఓటర్లలో పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్య 18,918 మంది ఎక్కువగా ఉన్నారు. అయితే రెండు మూడు దశాబ్దాలుగా ఆడపిల్లలపై పెరిగిన వివక్షతో గర్భంలోనే చిదిమేస్తుండడంతో ఆడపిల్లల సంఖ్య తగ్గుతోంది. దాని ప్రభావం ప్రస్తుతం కనిపిస్తోంది. 18 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు ఉన్న నవ ఓటర్లు మూడు నియోజకవర్గాల్లో కలిపి 20,380 మంది ఉండగా.. ఇందులో మగవారు 12,039 మంది, ఆడవారు 8,339 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు.
అంటే ఓటర్లలో యువకులకన్నా 3,700 మంది యువతులు తక్కువగా ఉన్నారు. అలాగే 20 నుంచి 29 ఏళ్లలోపు ఓటర్లలో కూడా ఆడవాళ్లు తక్కువగా కనిపిస్తున్నారు. 71,353 మంది పురుష ఓటర్లు ఉంటే..66,090 మంది మహిళా ఓటర్లు, 20 మంది ఇతరులు ఉన్నారు. అంటే మగవారికన్నా ఆడవారు 5,263 మంది తక్కువగా ఉండడం గమనార్హం. 30 ఏళ్లు పైబడిన జాబితాలో మాత్రం మహిళా ఓటర్లే ఎక్కువగా నమోదయ్యారు.
వందేళ్లు దాటినవారు..
నూరేళ్లు పిల్లాపాపలతో కలిసి సుఖ సంతోషాలతో జీవించు అంటూ పెద్దవాళ్లు ఆశీర్వదిస్తుంటారు. అయితే వందేళ్లు దాటి జీవించిన వాళ్లు చాలా తక్కువగా కనిపిస్తారు. జిల్లాలో శతాధిక వృద్ధులు 312 మంది ఉన్నారు. ఇందులోనూ 120 ఏళ్లు దాటినవారే 251 మంది ఉండడం గమనార్హం. జిల్లాలో 100 ఏళ్లు దాటినవారిలో 312 మందికి ఓటు హక్కు ఉంది. 100 నుంచి 109 ఏళ్ల మధ్య వయసువారిలో 61 మంది ఓటర్లున్నారు.
ఇందులో 19 మంది మగవారు, 42 మంది సీ్త్రలు.. 110 నుంచి 119 ఏళ్ల మధ్యలో ఒక్క ఓటరూ లేరు. 120 ఏళ్లు దాటినవారు జిల్లాలో 251 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇందులో 115 మంది పురుషులు, 135 మంది సీ్త్రలు కాగా ఒకరు ట్రాన్స్‌జెండర్.. 120 ఏళ్లు దాటినవారిలో కామారెడ్డి నియోజకవర్గంలోనే 234 మంది ఉన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 16 మంది, జుక్కల్ నియోజక వర్గంలో ఒకరు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment