సాక్షి, కామారెడ్డి: సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గులాబీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు శనివారం కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రత్యర్థులపై చేసిన విమర్శలకు వారి నుంచి అదే స్థాయిలో ప్రతిస్పందన వచ్చింది. సీఎం కేసీఆర్‌ను ఓడించి కామారెడ్డి ప్రజలు కొత్త చరిత్ర రాస్తారని పేర్కొంటున్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థిగా సీఎం పేరును ప్రకటించగా.. కాంగ్రెస్‌నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, బీజేపీ అభ్యర్థిగా జెడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి నిలవడం దాదాపు ఖాయమైంది. ముగ్గురూ బలమైన నేతలే కావడంతో అందరి దృష్టి కామరెడ్డిపైనే కేంద్రీకృతమైంది.
గజ్వేల్ అభివృద్ధి నమూనాగా కామారెడ్డిని ప్రగతి పథంలో నడిపిస్తామని అధికార పార్టీ నేతలు చెబుతుండగా.. అక్కడ అభివృద్ధి ఏమోగానీ వేలాది కుటుంబాలను రోడ్డున పడేశారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చూపిస్తానంటూ బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి చలో గజ్వేల్ కార్యక్రమానికి పిలుపునివ్వగా.. కార్యక్రమానికి ఒకరోజు ముందే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. బీజేపీ శ్రేణులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి చలో గజ్వేల్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
బీజేపీ రాష్ట్రస్థాయి నేతలు రంగంలోకి దిగడంతో పోలీసులు ఆయనను విడుదల చేశారు. అదే రోజు రాత్రి బీజేపీ నేతలు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి, అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్‌అలీ ఇటీవల వాహనాల్లో గజ్వేల్‌కు తరలివెళ్లారు. అక్కడ జరిగిన అభివృద్ధి ఏమిటన్న దానిపై అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఇలా కేసీఆర్ ప్రత్యర్థులిద్దరూ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇద్దరు నేతలు నిత్యం జనంలో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు.
ఎదురుదాడి..
మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై అటు షబ్బీర్ అలీ, ఇటు వెంకటరమణారెడ్డి ఎదురుదాడికి దిగారు. పార్టీ కార్యక్రమాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. అవినీతిలో కూరుకుపోయిన వాళ్లు అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
కమీషన్లపై కక్కుర్తితో డబుల్ బెడ్‌రూం ఇళ్లను నాసిరకంగా నిర్మించారని ఆరోపించారు. దళితబంధు పథకంలో అధికార పార్టీ నేతలు రూ. మూడు లక్షల చొప్పున కమీషన్లు దండుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కలిసి పోటీ చేశాయని, అయితే పొత్తు ధర్మాన్ని విస్మరించి టీఆర్‌ఎస్ నాయకుడికి బీఫామ్ ఇచ్చి తనను ఓడించే కుట్ర చేశారని ఆరోపించారు.
మంత్రి విమర్శలపై బీజేపీ నేత వెంకటరమణారెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ను ఓడించి తీరుతానన్నారు. సీఎం గజ్వేల్‌ను పూర్తిగా వదిలేసి కామారెడ్డిలో మాత్రమే పోటీ చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌ను ఓడించకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. బీఆర్‌ఎస్ సభా వేదికపై ఉద్యమకారుడొక్కరూ లేరన్నారు.
మంత్రి కేటీఆర్‌కు తన పేరు ఉచ్చరించడం కూడా రాలేదని, ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించి జీవితంలో మరిచిపోలేని దెబ్బకొడతానని పేర్కొన్నారు. ఇలా కేటీఆర్ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎదురు దాడికి దిగడంతో కామారెడ్డిలో రాజకీయ వేడి పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశాలున్నాయి.
కేటీఆర్ విమర్శలు..
కామారెడ్డి నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్.. ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా షబ్బీర్ అలీ పోటీ చేయ గా, మిత్ర ధర్మంతో మద్దతు ఇచ్చి గెలిపించా మని పేర్కొన్నారు. అలాంటి షబ్బీర్ అలీ సీఎం కేసీఆర్ మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ఎన్నికల్లో డిపాజిట్టు కూడా రాకుండా ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అలాగే బీజేపీ నేత వెంకటరమణారెడ్డిపైనా ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పేరు ప్రకటించగానే పోటీ నుంచి తప్పుకుని ఇంట్లో పండుకుంటానన్నాడన్నారు. కేసీఆర్ మీద పోటీ చేయడమంటే పోచమ్మ ముందు పొట్టేలును కట్టేసినట్టేనని పేర్కొన్నారు. రెండు పార్టీలకు డిపాజిట్టు కూడా రాకుండా దిమ్మ తిరిగే దెబ్బకొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment