సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బాల్కొండ, ఆర్మూర్‌లలో పరిస్థితి ఒకలా ఉండగా, జిల్లా కేంద్రాలైన నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి సెగ్మెంట్లలో షబ్బీర్ అలీ పెత్తనం పట్ల పలువురు మొదటి, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు గుస్సా అవుతున్నారు. షబ్బీర్ పేరు చెప్పుకుని కొందరు నాయకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేశారు. దీంతో నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగిన షబ్బీర్ అలీ ఓటమి చెందారు. ఓడినవారే నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే షబ్బీర్ నిజామాబాద్ అర్బన్ ఇన్‌చార్జిగా ఉంటూనే తన సొంత నియోజకవర్గమైన కామారెడ్డిలోనూ పెత్తనం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో షబ్బీర్‌కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ ర్యాంకు పదవి వచ్చింది.
నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి దక్కించుకోలేకపోయిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. మహేశ్ గౌడ్ పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. మరోవైపు బీసీ కోటాలో కేబినెట్ రేసులోనూ ఉన్నారు. మహేశ్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గట్టి ప్రాబల్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో షబ్బీర్ కామారెడ్డిలో పెత్తనం చేస్తూనే నిజామాబాద్ అర్బన్‌లో హవా నడిపిస్తుండటం పట్ల ఇక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌లో ఉండి పనిచేసిన పలువురు రౌడీషీటర్లను సైతం షబ్బీర్ కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారంటూ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కామారెడ్డిలోనూ పలువురు అవకాశవాదులను పార్టీలోకి చేర్చుకుని మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమకు అన్యాయం చేస్తున్నారని కార్యకర్తలు, నాయకులు వాపోతున్నారు. మరోవైపు షబ్బీర్ తమ్ముడు, మేనల్లుడు, ఇతర బంధువులు ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారంటూ పలువురు సీనియర్ కార్యకర్తలు పీసీసీ నాయకత్వానికి ఫిర్యాదులు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment