సాక్షి, కామారెడ్డి: వీఐపీలు బరిలో నిలిచిన కామారెడ్డి నియోజకవర్గంలో భూమి చుట్టూ ఓట్ల రాజకీయం నడుస్తోంది. బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే భూములను గుంజుకుంటారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు, నేతలు ఆరోపణలు చేస్తుండగా.. అవి మతిలేని మాటలంటూ అధికార పక్షం తిప్పికొడుతోంది. దీంతో నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇదే అంశం మీద జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
కామారెడ్డి నియోజకవర్గం తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డగా కీర్తికెక్కింది. ఇక్కడ జరిగినన్ని ఉద్యమాలు మరెక్కడా జరగలేదు. హైవేల దిగ్భందనం నుంచి రైల్‌రోకోలు, ఆత్మబలిదానాల దాకా కామారెడ్డి నియోజకవర్గం ఉద్యమాలకు కేరాఫ్‌గా ఉండింది. కామారెడ్డి బీఆర్‌ఎస్‌కు పెట్టనికోటగా నిలిచింది. స్వరాష్ట్ర కల సాకారమైన తర్వాత 2014, 2018 ఎన్నికల్లో గులాబీ జెండానే రెపరెపలాడింది. స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీకి చెందినవారే ఎక్కువగా విజయం సాధించారు. ఇతర పార్టీల్లో చేరిన వారు కూడా అభివృద్ధి పేరుతో గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే నియోజకవర్గంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలతో ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. దాన్ని సరిదిద్దుకుని విజయతీరాలకు చేరడానికి గులాబీ పార్టీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు.
వివాదానికి ఆజ్యం పోసిన మాస్టర్ ప్లాన్ ...
కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి రూపొందించిన కొత్త మాస్టర్ ప్లాన్ నియోజకవర్గంలోని ప్రజల్లో ప్రకంపనలు సృష్టించింది. కొందరికి లాభం జరిగేలా ప్లాన్ రూపొందించారని, దాని మూలంగా ఐదారు గ్రామాలకు చెందిన వందలాది మంది రోడ్డున పడతారని ఆందోళన చెందిన రైతులు పోరుబాట పట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం వంద ఫీట్ల రోడ్లు తీయడం, వందలాది ఎకరాల భూములను గ్రీన్‌జోన్, ఇండస్ట్రియల్ జోన్‌లలో చేర్చడంతో రైతులు ఆందోళనకు గురై రోడ్డెక్కారు. బీజేపీ నాయకుడు, ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి రైతుల పక్షాన ఉద్యమానికి నాయకత్వం వహించారు.
కామారెడ్డి పట్టణంలో జరిగిన ఆందోళనలు సంచలనం సృష్టించాయి. సర్కారు తీరును నిరసిస్తూ బాధిత రైతులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి విధ్వంసానికి కూడా దారితీసింది. ఓ రైతు ఆత్మహత్య సంఘటన రైతుల్లో మరింత ఆగ్రహానికి కారణమైంది. మున్సిపల్ పాలకవర్గంపై ఒత్తిడి పెరగడంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కొత్త మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తూ తీర్మానించి ప్రభుత్వానికి పంపించారు. కామారెడ్డిలో మొదలైన గొడవ జగిత్యాల, నిర్మల్ మున్సిపాలిటీలకూ విస్తరించింది. రైతులు కోర్టుకెక్కడం, రాష్ట్ర వ్యాప్త సమస్యగా తయారవడంతో ప్రభుత్వం స్పందించి, మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
ఆకాశాన్నంటిన భూముల ధరలు
కామారెడ్డి నియోజకవర్గంలో జాతీయ రహదారి, రైల్వే లైన్ వంటివి ఉండడం, దానికి తోడు హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. మారుమూల గ్రామానికి వెళ్లినా రూ. 30 లక్షలు పెడితే కూడా ఎకరం భూమి దొరకడం లేదు. ప్రధాన రోడ్ల వెంట అయితే ఎకరం భూమి ధర రూ.కోట్లకు చేరింది. ఇంతటి విలువైన భూములను బీఆర్‌ఎస్ నేతలు గుంజుకుంటారంటూ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇక్కడి ప్రజల్లో ఒకరకమైన ఆందోళన నెలకొంది. భూములను కాపాడేందుకే ప్రభుత్వం ధరణి తీసుకువచ్చిందని, ఎవరి భూమి ఎటూ పోదని మంత్రి కేటీఆర్ ఆయా సభల్లో జనానికి వివరించే ప్రయత్నం చేశారు.
తిప్పికొడుతున్న కేటీఆర్...
ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఒక్కో సమస్యకు పరిష్కారం చూపుతూ దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన నాయకుడిపై కాంగ్రెస్, బీజేపీ నేతలు మతిలేని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. భూములను కాపాడేందుకే ధరణి తీసుకువచ్చారని, భూ యజమాని తన వేలిముద్ర వేస్తేనే భూమి ఇతరుల చేతుల్లోకి వెళ్తుందని వివరిస్తున్నారు. కేసీఆర్‌కు భూములను గుంజుకునే అవసరం కూడా లేదని, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొంటున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు, అధికార పక్షం వివరణలతో నియోజకవర్గంలో అందరి దృష్టి భూమి పైనే కేంద్రీకృతమైంది. అంతటా ఇదే అంశంపై చర్చలు నడుస్తున్నాయి.
కేసీఆర్ కుటుంబం టార్గెట్‌గా..
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు మరోసారి భూముల సమస్యను తెరపైకి తీసుకువచ్చారు. ఇక్కడి భూముల కోసమే కేసీఆర్ పోటీ చేస్తున్నారంటూ పీసీసీ అధ్యక్షుడు, కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి ఆరోపణలు గుప్పిస్తున్నారు. కామారెడ్డి చుట్టుపక్కల భూములను లాక్కుంటారని, దాన్ని అడ్డుకునేందుకే తాను ఇక్కడ పోటీ చేస్తున్నానని ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి కూడా చాలాకాలంగా కామారెడ్డి భూములకు ప్రమాదం పొంచి ఉందని ఆరోపిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ముప్పు పోలేదని, ఎన్నికల తర్వాత తిరిగి ముందుకు వస్తుందని పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో అసైన్డ్ భూములు ఉన్నాయని, బీఆర్‌ఎస్ నేతలు వాటిపై కన్నేశారని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment