ప్రమాణస్వీకారం చేస్తున్న ఇందుప్రియ
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్: కాంగ్రెస్ సభ్యు లు బల్దియా చైర్‌పర్సన్ నిట్టు జాహ్నవిపై గతనెల 30వ తేదీన అవిశ్వాసం ప్రవేశపెట్టగా.. కొందరు బీఆర్‌ఎస్ సభ్యులు మద్దతు ఇవ్వడంతో అవిశ్వాసం నెగ్గింది. దీంతో నూతన చైర్‌పర్సన్ ఎన్నిక కోసం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా చైర్‌పర్సన్ పీఠాన్ని కై వసం చేసుకోవడానికి బీఆర్‌ఎస్, బీజేపీ ప్రయత్నాలు చేయడం, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు పదవిని ఆశించడంతో బల్దియా రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. కాంగ్రెస్ సభ్యులు క్యాంప్‌నకు వెళ్లారు.
సీల్డ్ కవర్‌లో అభ్యర్థి పేరు..
కామారెడ్డి బల్దియాలో 49 వార్డులున్నాయి. ఎమ్మె ల్యే వెంకటరమణారెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు కలిగి ఉన్నారు. చైర్‌పర్సన్ ఎన్నిక కోసం 26 మంది సభ్యుల కోరం అవసరం. కాగా సోమవారం ఆర్డీవో రఘునాథ్ ఆధ్వర్యంలో చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. కాంగ్రెస్ క్యాంపులో ఉన్న 28 మంది కౌన్సిలర్లు ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక బస్సులో నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌లు సమావేశానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌నుంచి ఇద్దరు పదవిని ఆశించడంతో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం సీల్డ్ కవర్‌లో అభ్యర్థి పేరు ను పంపింది.
సీల్డ్ కవర్‌లో వైస్ చైర్‌పర్సన్ ఇందుప్రియ పేరుండడంతో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. 48వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ అన్వర్ అహ్మద్, 38వ వార్డు కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్‌లు ఆమె పేరును ప్రతిపాదించగా.. సభ్యులంతా చేతి లెత్తి ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఇందుప్రియ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆర్డీవో ప్రకటించారు. ఎన్నిక పత్రాన్ని అందించి, ప్రమాణ స్వీకారం చేయించారు.
అవాక్కయిన పదో వార్డు కౌన్సిలర్..
ఇందుప్రియతో పాటు పదో వార్డు కౌన్సిలర్ ఉర్దొండ వనిత చైర్‌పర్సన్ పదవిని ఆశించారు. అధ్యక్ష పీఠాన్ని కై వసం చేసుకునేందుకు ఇరువురు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఈక్రమంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని క్యాంపులో ఇరువర్గాల మధ్య గొడవ కూడా జరిగినట్లు తెలిసింది. దీంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇరు వర్గాలను సముదాయించినట్లు సమాచారం. ఇందుప్రియను ఎంపిక చేసి సీల్డ్ కవర్‌లో ఆమె పేరును పంపించింది. చివరి క్షణంలో ఇందుప్రియ పేరు ప్రకటించడంతో వనితతో పాటు ఆమె వర్గం కౌన్సిలర్లు అవాక్కయ్యారు. ఎన్నిక ప్రక్రియ ముగిసిన అనంతరం వనితతో పాటు ఒక్కరొక్కరుగా 12 మంది కౌన్సిలర్లు అక్కడి నుంచి నిరాశతో వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment