సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/సాక్షి, కామారెడ్డి/ జగిత్యాల/రాయికల్: తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే తక్షణమే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని... ముఖ్యమంత్రి పీఠాన్ని బీసీకే కట్టబెడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హామీ ఇచ్చారు. సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్, కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్ట ణం, జుక్కల్ నియోజకవర్గంలోని మేనూర్‌లో నిర్వహించిన సభలతోపాటు జగిత్యాల రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇప్పటికే తెరిపించామన్న నడ్డా... తెలంగాణకు పసుపు బోర్డు ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు.
ధరణి రద్దు చేసి మీభూమి పోర్టల్ తెస్తాం
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతి, కుంభకోణాలకు మారుపేర్లని, ప్రజల సంపదను దోచు కుంటున్న ఆ రెండు పార్టీలకు చరమగీతం పాడాలని ప్రజలకు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షసుల సమితి అని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ బడాబాబులకు మాత్రమే ఉపయోగపడిందని, డబుల్ బెడ్రూం పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయట్లేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా అందడంలేదని మండిపడ్డారు. ధరణి పోర్టల్ కారణంగా అవినీతి పెరిగిపోయిందని... బీజేపీని గెలిపిస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని, లోపాలను సరిదిద్ది మీ భూమి పోర్టల్ తీసుకొస్తామని నడ్డా చెప్పారు.
కాంగ్రెస్ వస్తే అవినీతి రాజ్యమే...
గతంలో కేంద్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నింగి, నేల, నీరు అనే తేడా లేకుండా అన్నింటిలోనూ అవినీతికి పాల్పడిందని... అలాంటి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అవినీతి రాజ్యమేలుతుందని జేపీ నడ్డా ఆరోపించారు. బీజేపీ మాత్రమే అవినీతిరహిత పాలన అందిస్తుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని... అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని నడ్డా హామీ ఇచ్చారు. మోదీ అంటేనే అభివృద్ధి అన్నారు. రోడ్లు, రైల్వే అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ అభివృద్ధికి సైతం బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే బీబీ నగర్‌లో ఎయిమ్స్ కడుతున్నామని... అధికారంలోకి వస్తే రైతులకు ఎరువుల సబ్సిడీ, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బీఆర్‌ఎస్ అవినీతిపై విచారణ చేపట్టి బాధ్యులను జైలుకు పంపిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment