Nizam Sugars Factory
-
నిజాం షుగర్స్ పునఃప్రారంభానికి కట్టుబడి ఉన్నాం
బోధన్: నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి, నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నా రు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో ఫ్యాక్టరీలను తెరిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఫ్యాక్టరీ సందర్శనకు వచ్చామని పేర్కొన్నారు. శనివారం బోధన్‌లోని ఫ్యాక్టరీని కమిటీ సభ్యులు సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన ఫ్యాక్టరీ ఆవరణలో చెరుకు రైతులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు, కార్మికుల శ్రేయస్సు కోసం ఫ్యాక్టరీని తెరిపించి లాభాల బాటలో నడిపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. రైతులకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే వ్యవసాయ, పారిశ్రామికరంగ నిపుణులతో చర్చిస్తున్నామని వివరించారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు, పెట్టుబడి సాయం, వడ్డీ లేని రుణాలు వర్తింపజేసేలా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఫ్యాక్టరీలను ప్రభుత్వమా లేక సహకార విధానంలోనా లేక ప్రైవేటు రంగంలోనా ఎలా నడపాలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకొనేందుకు ఆలోచించకపోతే నిజాం షుగర్స్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులా అవుతుందని వ్యాఖ్యానించారు. మార్పు చేసి చూపుతాం.. ప్రజలు ఆకాంక్షించిన మార్పును చేసి చూపుతామని శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ నెల 27న రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ఏఐసీసీ నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. హైదరాబాద్ శివారులో జిల్లాలు, ముఖ్య పట్టణాలను కలుపుతూ రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మించేందుకు ముందుకు వెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, నిజాం షుగర్స్ ఎండీ డాక్టర్ మక్సూద్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు. -
గెలిపిస్తే ‘నిజాం షుగర్స్’ తెరిపిస్తాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/సాక్షి, కామారెడ్డి/ జగిత్యాల/రాయికల్: తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే తక్షణమే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని... ముఖ్యమంత్రి పీఠాన్ని బీసీకే కట్టబెడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హామీ ఇచ్చారు. సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్, కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్ట ణం, జుక్కల్ నియోజకవర్గంలోని మేనూర్‌లో నిర్వహించిన సభలతోపాటు జగిత్యాల రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇప్పటికే తెరిపించామన్న నడ్డా... తెలంగాణకు పసుపు బోర్డు ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. ధరణి రద్దు చేసి మీభూమి పోర్టల్ తెస్తాం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతి, కుంభకోణాలకు మారుపేర్లని, ప్రజల సంపదను దోచు కుంటున్న ఆ రెండు పార్టీలకు చరమగీతం పాడాలని ప్రజలకు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షసుల సమితి అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ బడాబాబులకు మాత్రమే ఉపయోగపడిందని, డబుల్ బెడ్రూం పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయట్లేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా అందడంలేదని మండిపడ్డారు. ధరణి పోర్టల్ కారణంగా అవినీతి పెరిగిపోయిందని... బీజేపీని గెలిపిస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని, లోపాలను సరిదిద్ది మీ భూమి పోర్టల్ తీసుకొస్తామని నడ్డా చెప్పారు. కాంగ్రెస్ వస్తే అవినీతి రాజ్యమే... గతంలో కేంద్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నింగి, నేల, నీరు అనే తేడా లేకుండా అన్నింటిలోనూ అవినీతికి పాల్పడిందని... అలాంటి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అవినీతి రాజ్యమేలుతుందని జేపీ నడ్డా ఆరోపించారు. బీజేపీ మాత్రమే అవినీతిరహిత పాలన అందిస్తుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని... అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని నడ్డా హామీ ఇచ్చారు. మోదీ అంటేనే అభివృద్ధి అన్నారు. రోడ్లు, రైల్వే అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ అభివృద్ధికి సైతం బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే బీబీ నగర్లో ఎయిమ్స్ కడుతున్నామని... అధికారంలోకి వస్తే రైతులకు ఎరువుల సబ్సిడీ, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ అవినీతిపై విచారణ చేపట్టి బాధ్యులను జైలుకు పంపిస్తామన్నారు. -
నిజాం షుగర్స్‌కు మంచిరోజులు!
సాక్షి, హైదరాబాద్: దివాలా అంచున ఉన్న సిర్పూర్ పేపర్ మిల్స్‌ను ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) విషయంలో అదే తరహాలో నిర్ణయం తీసుకుంది. ఎన్డీఎస్ఎల్ విషయంలో ఓ అడుగు ముం దుకేసి ఆ సంస్థను పునరుద్ధరించాలని నిశ్చయించింది. ఇందుకు నిజాం షుగర్స్‌కున్న అప్పులు తీర్చే విషయంలో రుణ పరిష్కార ప్రణాళిక సమర్పణకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిచ్చింది. రుణదాతల కమిటీ (సీవోసీ) పరిశీలన కోసం రుణ పరి ష్కార ప్రణాళికను దివాలా పరిష్కార నిపుణుడికి (ఆర్పీ) సమర్పించా లని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్డీఎస్ఎల్ కార్పొరేట్ దివాలా ప్రక్రియ గడువును కూడా మరో 78 రోజుల పాటు పెంచింది. ఎన్సీఎల్టీ జ్యుడీషియల్ సభ్యు లు బిక్కి రవీంద్రబాబు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వ రుణ పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీ ఆమోదం తెలిపితే నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వం సొంతమైనట్లే. నష్టాల నేపథ్యంలో నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో 2017లో దివాళా ప్రక్రియ కోసం పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రణాళిక (సీఐఆర్‌పీ) ప్రారంభించాలని ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చింది. ఆర్.రామకృష్ణ గుప్తాను ఆర్పీగా నియమించింది. ఇందులో భాగం గా ఆంధ్రా, సిండికేట్, యూకో, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులతో రుణదాతల కమిటీ ఏర్పాటైంది. లిక్విడేషన్‌కు సిఫారసు.. ఆర్పీ తర్వాత ప్రక్రియలో భాగంగా రుణ పరిష్కార ప్రణాళిక సమర్పణకు ప్రకటన జారీ అయింది. దీనికి స్పందిస్తూ ముంబైకి చెందిన ఫోనెక్స్ ఏఆర్సీ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరుకు చెందిన హిందుస్తాన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లు ఆసక్తి వ్యక్తం చేశాయి. వీరికి చక్కెర తయారీ రం గంలో అనుభవం లేకపోవడంతో రుణదాతల కమిటీ ఈ కంపెనీల వైపు మొగ్గు చూపలేదు. ఆ తర్వాత అహ్మదాబాద్‌కు చెందిన పాల్కో రీసైకిల్ ఇండస్ట్రీస్, ముంబైకి చెందిన మైసీఎఫ్‌ఓ, నాగ్‌పూర్‌కి చెందిన జైనో కాపిటల్ సర్వీసెస్‌లు నిజాం షుగర్స్‌కు సంబంధించిన వివరాలను కోరగా, ఆర్పీ ఆ కంపెనీలకు అందచేశారు. ఆ కంపెనీలు రుణ పరిష్కార ప్రణాళికలను సమర్పించలేదు. దీంతో ఇక చేసేదేమీ లేక రుణదాతల కమిటీ నిజాం షుగర్స్ లిక్విడేషన్ (ఆస్తుల అమ్మకం)కు సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత చివరి ప్రయత్నంగా తెలంగాణ పరిశ్రమల శాఖకు రామకృష్ణగుప్తా లేఖ రాశారు. 2015లో జారీ అయిన జీవో 28ని అమలు చేసి నిజాం షుగర్స్ పునరుద్ధరణకు సహకరించాలని ఆ లేఖలో కోరారు. ఆర్పీ లేఖతో స్పందించిన సర్కారు.. ఆర్పీ రాసిన లేఖ నేపథ్యంలో రెవెన్యూ శాఖ.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. నిజాం షుగర్స్ పునరుద్ధరణకు రుణ పరిష్కార ప్రణాళిక సమర్పణకు నిర్ణయం తీసుకుంది. ఈమేర ఎన్సీఎల్టీ ముందు దరఖాస్తు దాఖలు చేయాలని రామకృష్ణ గుప్తాను కోరింది. దీంతో ఆయన ఎన్సీఎల్టీ ముందు దరఖాస్తు దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రుణపరిష్కార ప్రణాళిక సమర్పణకు అనుమతివ్వాలని కోరారు. ఇదే సమయంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఓ దరఖాస్తు దాఖలు చేసి తమను ప్రతివాదిగా చేర్చుకోవాలని, అలాగే రుణ పరిష్కార ప్రణాళిక సమర్పణకు 12 వారాల గడువు కావాలని కోరారు. ఈ రెండు దరఖాస్తులపై ఎన్సీఎల్టీ జ్యుడీషియల్ సభ్యులు రవీంద్రబాబు విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేశారు. గడువుతోపాటు ప్రతివాదిగా చేర్చుకోవాలన్న దరఖాస్తును తోసిపుచ్చారు. ఆర్పీ రామకృష్ణ గుప్తా దాఖలు చేసిన దరఖాస్తును అనుమతించారు. రుణ ప్రణాళిక సమర్పణకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతినిస్తున్నట్లు రవీంద్రబాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అం దరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రుణ పరిష్కార ప్రణాళిక సమర్పణకు 78 రోజుల గడువును పెంచుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తన ప్రణాళికను దివాలా పరిష్కార నిపుణుడికి సమర్పించాలని, ఆయన దానిని తగిన నిర్ణయం నిమిత్తం రుణదాతల కమిటీ ముందు ఉంచాలని స్పష్టం చేశారు. -
నిజాంషుగర్స్ ఆంధ్రవాళ్ల చేతిలో ఎందుకు?
బోధన్ టౌన్ : తెలంగాణ పాలనలో ఆంధ్ర వాళ్ల చేతిలో నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని ఎందుకు ఉండనిచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఆంధ్రలో బంధువులు ఉన్నారా? లేక ఆయన రక్తం ఆంధ్రాలో ఉందా అని అన్నారు. నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని, ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ కుటంబ సభ్యులు ఇచ్చి న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షం లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం పట్టణంలోని నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీలో పర్యటించి సామాగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన అనంతరం ఫ్యాక్టరీని ప్రైవేట్ యా జమాన్యం చేతిలో నుంచి లాక్కొని ప్రభుత్వం స్వా ధీనం చేసుకుంటుదని సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో బోధన్‌లో జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అలాగే రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత అధికారం వచ్చిన వంద రోజుల్లో ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని అక్కడి కార్మికులకు హామీ ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు గడుస్తున్నా వారు ఇప్పటి వరకు ఫ్యాక్టరీ ఊసే ఎత్తక పోవడం సిగ్గు చేటన్నారు.