ఫ్యాక్టరీని సందర్శిస్తున్న శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి తదితరులు
బోధన్: నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి, నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నా రు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో ఫ్యాక్టరీలను తెరిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఫ్యాక్టరీ సందర్శనకు వచ్చామని పేర్కొన్నారు. శనివారం బోధన్‌లోని ఫ్యాక్టరీని కమిటీ సభ్యులు సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన ఫ్యాక్టరీ ఆవరణలో చెరుకు రైతులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు, కార్మికుల శ్రేయస్సు కోసం ఫ్యాక్టరీని తెరిపించి లాభాల బాటలో నడిపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. రైతులకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే వ్యవసాయ, పారిశ్రామికరంగ నిపుణులతో చర్చిస్తున్నామని వివరించారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు, పెట్టుబడి సాయం, వడ్డీ లేని రుణాలు వర్తింపజేసేలా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఫ్యాక్టరీలను ప్రభుత్వమా లేక సహకార విధానంలోనా లేక ప్రైవేటు రంగంలోనా ఎలా నడపాలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకొనేందుకు ఆలోచించకపోతే నిజాం షుగర్స్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులా అవుతుందని వ్యాఖ్యానించారు.
మార్పు చేసి చూపుతాం..
ప్రజలు ఆకాంక్షించిన మార్పును చేసి చూపుతామని శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ నెల 27న రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ఏఐసీసీ నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. హైదరాబాద్ శివారులో జిల్లాలు, ముఖ్య పట్టణాలను కలుపుతూ రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మించేందుకు ముందుకు వెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, నిజాం షుగర్స్ ఎండీ డాక్టర్ మక్సూద్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment