సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల సమయంలో సొంత మేనిఫెస్టో ప్రకటించడంతోపాటు, ఇద్దరు ఉద్ధండులను ఓడించి చరిత్ర సృష్టించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం ముందుగా తన ఇంటిని కూల్చేందుకు ముందుకొచ్చారు. కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి అడ్లూర్ రోడ్డు వరకు విస్తరణకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి.
ఇదే రోడ్డులో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇల్లుతోపాటు మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ఇల్లు కూడా ఉంది. ట్రాఫిక్ పెరగడంతోపాటు, పలుచోట్ల ఆక్రమణలతో ఈ రోడ్డు ఇరుకుగా మారింది. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణ కోసం స్వచ్ఛందంగా తన ఇంటిని కూల్చేందుకు ఎమ్మెల్యే కేవీఆర్ సిద్ధమయ్యారు. శనివారం ఇంటి కూల్చివేత పనులు ప్రారంభించాలని నిర్ణయించారు.
తన ఇంటితోనే రోడ్డు వెడల్పు పనులు జరిగేలా ప్రణాళిక రూపొందించిన ఆయన.. పదిరోజుల క్రితమే ఇంటిని ఖాళీ చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మారారు. వెయ్యి గజాలకుపైగా స్థలాన్ని మున్సిపల్ అధికారులు అప్పగించారు. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు బల్దియా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే ఇంటిని కూల్చివేశాక రోడ్డు వెడల్పు పనులు ఏ మేరకు ముందుకు సాగుతాయో అన్న విషయమై పట్టణంలో చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment