నాయుడు ప్రకాశ్ , అరుణతార
సాక్షి, కామారెడ్డి: అభ్యర్థుల ఎంపిక విషయంలో నాన్చుతూ వచ్చిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎట్టకేలకు జిల్లాలోని మిగిలిన రెండు స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసింది. జుక్కల్ టికెట్టును అరుణతారకు కేటాయించిన బీజేపీ.. బాన్సువాడ స్థానంలో నాయుడు ప్రకాశ్ పోటీచేస్తారని ప్రకటించింది. జిల్లాలోని అన్నిస్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ.. తొలిజాబితాలోనే కామారెడ్డి అభ్యర్థిని ప్రకటించింది. జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేరును ప్రకటించిన పార్టీ.. మూడో జాబితాలో ఎల్లారెడ్డి స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డిని బరిలో నిలిపింది. తాజాగా ఆదివారం ఐదో జాబితాలో మిగిలిన రెండు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన జుక్కల్‌లో అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే అరుణతారను అభ్యర్థిగా ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ టికెట్టు కోసం చివరి క్షణం వరకు ప్రయత్నించిన అరుణతార.. అవకాశం దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వెనువెంటనే ఆదివారం ఆమెను అభ్యర్థిగా ప్రకటిస్తూ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించింది. కాగా జుక్కల్ టికెట్టు కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూసిన నాయుడు ప్రకాశ్‌ను బాన్సువాడ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో జిల్లాలో బీజేపీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ముగిసింది. కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి, ఎల్లారెడ్డిలో బాణాల లక్ష్మారెడ్డిలు ఇదివరకే నామినేషన్లు దాఖలు చేశారు. అరుణతార, నాయుడు ప్రకాశ్‌లు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
ప్రచారానికి తరలిరానున్న అగ్రనేతలు
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించడానికి బీజేపీ అగ్రనేతలు రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, స్వామి పరిపూర్ణానంద పర్యటనల షెడ్యూల్ ఖరారైంది. మరికొందరు కేంద్ర మంత్రుల పర్యటనలు ఉండే అవకాశం ఉంది. జిల్లాలో ప్రచారానికి బీజేపీ నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని, కేంద్రమంత్రులు కూడా రానున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment