నిజాం షుగర్స్‌కు మంచిరోజులు! | Good days for Nizam Sugars | Sakshi
Sakshi News home page

నిజాం షుగర్స్‌కు మంచిరోజులు!

Published Tue, Sep 4 2018 1:56 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

Good days for Nizam Sugars - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దివాలా అంచున ఉన్న సిర్పూర్‌ పేపర్‌ మిల్స్‌ను ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు నిజాం డెక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌డీఎస్‌ఎల్‌) విషయంలో అదే తరహాలో నిర్ణయం తీసుకుంది. ఎన్‌డీఎస్‌ఎల్‌ విషయంలో ఓ అడుగు ముం దుకేసి ఆ సంస్థను పునరుద్ధరించాలని నిశ్చయించింది. ఇందుకు నిజాం షుగర్స్‌కున్న అప్పులు తీర్చే విషయంలో రుణ పరిష్కార ప్రణాళిక సమర్పణకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిచ్చింది. రుణదాతల కమిటీ (సీవోసీ) పరిశీలన కోసం రుణ పరి ష్కార ప్రణాళికను దివాలా పరిష్కార నిపుణుడికి (ఆర్పీ) సమర్పించా లని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్‌డీఎస్‌ఎల్‌ కార్పొరేట్‌ దివాలా ప్రక్రియ గడువును కూడా మరో 78 రోజుల పాటు పెంచింది.  ఎన్‌సీఎల్‌టీ జ్యుడీషియల్‌ సభ్యు లు బిక్కి రవీంద్రబాబు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వ రుణ పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీ ఆమోదం తెలిపితే నిజాం డెక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ రాష్ట్ర ప్రభుత్వం సొంతమైనట్లే. నష్టాల నేపథ్యంలో నిజాం డెక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకులు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో 2017లో దివాళా ప్రక్రియ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ అనంతరం కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రణాళిక (సీఐఆర్పీ) ప్రారంభించాలని ట్రిబ్యునల్‌ ఆదేశాలిచ్చింది. ఆర్‌.రామకృష్ణ గుప్తాను ఆర్పీగా నియమించింది. ఇందులో భాగం గా ఆంధ్రా, సిండికేట్, యూకో, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులతో రుణదాతల కమిటీ ఏర్పాటైంది. 

లిక్విడేషన్‌కు సిఫారసు.. 
ఆర్పీ తర్వాత ప్రక్రియలో భాగంగా రుణ పరిష్కార ప్రణాళిక సమర్పణకు ప్రకటన జారీ అయింది. దీనికి స్పందిస్తూ ముంబైకి చెందిన ఫోనెక్స్‌ ఏఆర్‌సీ ప్రైవేట్‌ లిమిటెడ్, బెంగళూరుకు చెందిన హిందుస్తాన్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లు ఆసక్తి వ్యక్తం చేశాయి. వీరికి చక్కెర తయారీ రం గంలో అనుభవం లేకపోవడంతో రుణదాతల కమిటీ ఈ కంపెనీల వైపు మొగ్గు చూపలేదు. ఆ తర్వాత అహ్మదాబాద్‌కు చెందిన పాల్కో రీసైకిల్‌ ఇండస్ట్రీస్, ముంబైకి చెందిన మైసీఎఫ్‌ఓ, నాగ్‌పూర్‌కి చెందిన జైనో కాపిటల్‌ సర్వీసెస్‌లు నిజాం షుగర్స్‌కు సంబంధించిన వివరాలను కోరగా, ఆర్పీ ఆ కంపెనీలకు అందచేశారు. ఆ కంపెనీలు రుణ పరిష్కార ప్రణాళికలను సమర్పించలేదు. దీంతో ఇక చేసేదేమీ లేక రుణదాతల కమిటీ నిజాం షుగర్స్‌ లిక్విడేషన్‌ (ఆస్తుల అమ్మకం)కు సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత చివరి ప్రయత్నంగా తెలంగాణ పరిశ్రమల శాఖకు రామకృష్ణగుప్తా లేఖ రాశారు. 2015లో జారీ అయిన జీవో 28ని అమలు చేసి నిజాం షుగర్స్‌ పునరుద్ధరణకు సహకరించాలని ఆ లేఖలో కోరారు. 

ఆర్పీ లేఖతో స్పందించిన సర్కారు.. 
ఆర్పీ రాసిన లేఖ నేపథ్యంలో రెవెన్యూ శాఖ.. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. నిజాం షుగర్స్‌ పునరుద్ధరణకు రుణ పరిష్కార ప్రణాళిక సమర్పణకు నిర్ణయం తీసుకుంది. ఈమేర ఎన్‌సీఎల్‌టీ ముందు దరఖాస్తు దాఖలు చేయాలని రామకృష్ణ గుప్తాను కోరింది. దీంతో ఆయన ఎన్‌సీఎల్‌టీ ముందు దరఖాస్తు దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రుణపరిష్కార ప్రణాళిక సమర్పణకు అనుమతివ్వాలని కోరారు. ఇదే సమయంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఓ దరఖాస్తు దాఖలు చేసి  తమను ప్రతివాదిగా చేర్చుకోవాలని, అలాగే రుణ పరిష్కార ప్రణాళిక సమర్పణకు 12 వారాల గడువు కావాలని కోరారు. ఈ రెండు దరఖాస్తులపై ఎన్‌సీఎల్‌టీ జ్యుడీషియల్‌ సభ్యులు రవీంద్రబాబు విచారణ జరిపి  ఉత్తర్వులు జారీ చేశారు.  గడువుతోపాటు ప్రతివాదిగా చేర్చుకోవాలన్న దరఖాస్తును తోసిపుచ్చారు. ఆర్పీ రామకృష్ణ గుప్తా దాఖలు చేసిన దరఖాస్తును అనుమతించారు. రుణ ప్రణాళిక సమర్పణకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతినిస్తున్నట్లు రవీంద్రబాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అం దరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రుణ పరిష్కార ప్రణాళిక సమర్పణకు 78 రోజుల గడువును పెంచుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తన ప్రణాళికను దివాలా పరిష్కార నిపుణుడికి సమర్పించాలని, ఆయన దానిని తగిన నిర్ణయం నిమిత్తం రుణదాతల కమిటీ ముందు ఉంచాలని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement