బీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్, టీడీపీ నుంచి వలస నాయకులే ఎక్కువగా ఉన్నారు. పార్టీలో ఉన్నప్పటికీ తమకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని ఆవేదన చెందుతున్నారు. తమకు ప్రాధాన్యత ఇవ్వని పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు. సన్నిహితుల వద్ద తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఆయా నియోజకవర్గాలు, మండలాల్లో అధికారం కొద్దిమంది నాయకుల చేతుల్లోనే కేంద్రీకృతం అయిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులైతే తమకు ఏమాత్రం న్యాయం జరగడం లేదని బాహాటంగానే అంటున్నారు.
బీఆర్‌ఎస్‌లో ఉన్న పలువురు నాయకులు, సీనియర్ కార్యకర్తలు మాత్రం పార్టీ మళ్లీ గెలవాలనే ఆకాంక్షను మనస్ఫూర్తిగా వ్యక్తం చేయకపోతుండడం విశేషంగా చెప్పుకోవచ్చు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : శాసనసభ ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో అన్ని వర్గాల్లో రాజకీయ చర్చలే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న అన్ని మండలాలు, మున్సిపల్ డివిజన్ల పరిధిలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల మధ్య రానున్న ఎన్నికల ఫలితాల విషయమై ఎడతెగని విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులు, శ్రేణులు మాత్రం ఎలాగైనా వచ్చేసారి తాము గెలవాలనే లక్ష్యంతో బహిరంగంగా మాట్లాడుతున్నారు. అయితే బీఆర్‌ఎస్‌లో ఉన్న పలువురు నాయకులు, సీనియర్ కార్యకర్తలు మాత్రం మళ్లీ గెలవాలనే ఆకాంక్షను మనస్ఫూర్తిగా వ్యక్తం చేయకపోతుండడం విశేషంగా చెప్పుకోవచ్చు.
బీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్, టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. వీళ్లంతా సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండి క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైన వారు కావడం గమనార్హం. ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నప్పటికీ తమకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని ఆవేదన చెందుతున్నారు. తమకు అత్యంత నమ్మకమైన వారి వద్ద సదరు నాయకులు బీఆర్‌ఎస్ మళ్లీ గెలిస్తే తమకు ఏమాత్రం ప్రాధాన్యత దక్కదని, అందుకే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నట్లు చెబుతుండడం విశేషం. అంటే ఇక్కడ మనిషి ఒకచోట, ఆలోచన ఒకచోట అన్నమాదిరిగా..
బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటుండడం గమనార్హం. కాంగ్రెస్, టీడీపీల్లో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో స్థానికంగా వెలుగు వెలుగుతూ అందరికీ అందుబాటులో ఉన్నామని, మళ్లీ అలాంటి పరిస్థితి రావాలంటే తాము ఉన్న బీఆర్‌ఎస్ గెలవకూడదని కోరుకుంటుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. తమకు ప్రాధాన్యత దక్కనప్పుడు ఇందులో ఉండి ఏం లాభమని అంటున్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఆయా నియోజకవర్గాలు, మండలాల్లో అధికారం కొద్దిమంది నాయకుల చేతుల్లోనే కేంద్రీకృతం అయిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైరవీలు, భూదందాలు సహా తదితర వ్యవహారాల్లో ఆయా మండలాల్లో ఒకరిద్దరు నాయకులదే హవా నడుస్తోందని అనేకమంది నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.
ఇక స్థానిక ప్రజాప్రతినిధులు అయితే తమకు ఏమాత్రం న్యాయం జరగడంలేదని బాహాటంగానే అంటున్నారు. జిల్లాలో పలువురు సర్పంచులు బిల్లులు రావడంలేదని ఆత్మహత్యాయత్నాలకు సైతం పాల్పడిన ఘటనలు ఉన్నాయి. జిల్లాలో కల్లెడ సర్పంచ్ లావణ్య ప్రసాద్‌గౌడ్ దంపతులపై కేసులు పెట్టిన వైనంపై స్థానిక ప్రజాప్రతినిధులు గుస్సాగా ఉన్నారు. ఇక జిల్లాలో వివిధ మండలాల్లో బీఆర్‌ఎస్‌లో వర్గాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు కొన్ని వర్గాలను ప్రోత్సహించి తమ విషయంలో పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేలు వివిధ అంశాల్లో నటిస్తున్నారని, తాము కూడా నటించాల్పి వస్తోందని పలువురు బీఆర్‌ఎస్ నాయకులు సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారని సమాచారం. మరోవైపు తమను గాలికి వదిలేసిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకుల్లో కొందరికి అన్నిరకాలుగా సహకరిస్తూ కోవర్టు వ్యవహారాలు నడపడం పట్ల బీఆర్‌ఎస్‌లో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్‌లో ఆది నుంచి ఉన్న ఉద్యమకారులు మాత్రం తమ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉందని చెబుతున్నారు.
రైతు రుణమాఫీ విషయంలో ఈసారి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పలువురు బీఆర్‌ఎస్ నాయకులే అంటుండడం గమనార్హం. ఇందులో భాగంగా పలువురు రుణాలను సైతం ఎక్కువ మొత్తంగా తీసుకుంటుండడం విశేషం. కాంగ్రెస్ వస్తే రుణమాఫీ వస్తుందని రైతులతో పాటు సదరు బీఆర్‌ఎస్ నాయకులు సైతం విశ్వసిస్తుండడం ఆలోచింపజేస్తోంది. మరోవైపు ధరణి సమస్యల విషయంలోనూ కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. డబుల్ ఇళ్ల విషయమై నిలదీయాలని ప్రజలను ప్రోత్సహిస్తుండడంతో పాటు, టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ విషయమై ఆలోచించాలని యువతకు చెబుతున్నారు. మొత్తంమీద గతంలో కాంగ్రెస్, టీడీపీల్లో సుదీర్ఘకాలం పాటు పనిచేసి ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ గెలవాలంటూ వివిధ చర్చల్లో ఆకాంక్షలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment