ఉద్దండులను ఓడించి.. ఉన్నత స్థితికి! | - | Sakshi
Sakshi News home page

ఉద్దండులను ఓడించి.. ఉన్నత స్థితికి!

Published Mon, Jan 15 2024 12:58 AM | Last Updated on Mon, Jan 15 2024 12:56 PM

- - Sakshi

సాక్షి, కామారెడ్డి: ఇద్దరు ఉద్దండులను ఓడించి రాష్ట్రంలోనే కాదు యావత్‌ దేశం దృష్టిని ఆకర్శించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి బీజేపీ నాయకత్వం మంచి ప్రాధాన్యతనిస్తోంది. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటికీ ఆయన ఓడించింది మామూలు వ్యక్తులను కాదు. అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్‌, ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డిలు ఇద్దరినీ ఓడించి జెయింట్‌ కిల్లర్‌గా పేరుగడించారు. వాక్చాతుర్యం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న కాటిపల్లి వెంకటరమణారెడ్డిని పార్టీ కోసం విస్తృతంగా వాడుకునే ప్రయత్నం చేస్తోంది.

అందులో భాగంగా జహీరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ఇన్‌చార్జీగా నియమించింది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, శ్రేణులను సమన్వయం చేయడం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన ముఖ్యభూమిక పోశిస్తున్నారు. కాటిపల్లిని ఎన్నికల ఇన్‌చార్జీగా నియమించడంతో టిక్కెట్‌ ఆశిస్తున్న వారంతా ఆయన చుట్టూ తిరుగుతున్నారు. పార్టీ ఇచ్చిన బాధ్యతలను భుజాన వేసుకుని పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఆయా ప్రాంతాల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికలకు సమాయత్తం చేశారు.

జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కామారెడ్డి జిల్లాకు చెందిన కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు, సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌, ఆందోల్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికలను బీజేపీ నాయకత్వం ఈ సారి సవాల్‌గా తీసుకుంటోంది. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా జహీరాబాద్‌పై ఫోకస్‌ చేస్తోంది. ఇక్కడ టిక్కెట్‌ కోసం తీవ్ర పోటీ నెలకొంది. పది మందికిపైగా నాయకులు టిక్కెట్‌ ఆశిస్తున్నారు.

అలాగే అయోధ్యలో రామమందిర ప్రారంభో త్సవం ఈ నెలలోనే ఉన్న నేపథ్యంలో పూజిత అక్షింతలను ఊరూరికీ, ఇంటింటికీ చేర్చడానికి ఏర్పాటు చేసిన అయోధ్య శ్రీరామ తీర్థ ట్రస్ట్‌ రాష్ట్ర కన్వీనర్‌గానూ వెంకటరమణారెడ్డిని నియమించారు. దీంతో ఆయన ఇరవై రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ఇన్‌చార్జీగా, ఇటు అయో ధ్య తీర్థట్రస్ట్‌ రాష్ట్ర కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కాటిపల్లి మరోవైపు స్థానిక ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో కార్యక్రమాలకు హాజరవుతు న్నారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జిల్లా అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై రివ్యూ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో అండర్‌–17 జాతీయ కబడ్డీ పోటీల నిర్వహణ విషయంలో నిర్వహణ కమిటీకి అండగా నిలిచా రు. పోటీల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించారు.

అసెంబ్లీ ఫ్లోర్‌ లీడర్‌గా చాన్స్‌..?
బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా వెంకటరమణారెడ్డిని నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే ఇద్దరు ఉద్దండులను ఓడించిన వెంకటరమణారెడ్డినే శాసనసభ పక్ష నేతగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల బీజేపీ జాతీయ నాయకులు శాసనసభ పక్ష నేత ఎంపికపై చర్చించినపుడు వెంకటరమణారెడ్డి పేరు ప్రస్తావించినట్లు సమాచారం.

జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో పాటు ఐదారేళ్లుగా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై అనేక పోరా టాలకు నాయకత్వం వహించిన నేపథ్యంలో ఆయనకున్న అనుభవం శాసనసభలో పనిచేస్తుందన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా వెంకట రమణారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారడంతో ఆయనకు పార్టీ నాయకత్వం కీలకమైన బాధ్యతలు అప్పగిస్తుందని భావిస్తున్నారు.

ఇవి చదవండి: కాపులపై టీడీపీ కపట ప్రేమ..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement