సాక్షి, కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ ఎంతకీ అభ్యర్థులను తేల్చడం లేదు. మూడో జాబితా ఎప్పుడు వెలువడుతుందన్న విషయమై స్పష్టత రావడం లేదు. దీంతో శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. కాంగ్రెస్ తొలి జాబితాలో జిల్లాకు సంబంధించిన ఒక్క నియోజకవర్గానికీ అభ్యర్థిని ప్రకటించలేదు. రెండో జాబితాలో ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గానికే చోటు దక్కింది. ఇంకా మూడు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేందుకు సమయం దగ్గర పడుతున్నా అభ్యర్థుల ఎంపిక అంశం కొలిక్కి రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా షబ్బీర్ అలీకి బదులు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పేరు తెరమీదకు వచ్చినా.. స్పష్టత లేదు. పోలింగ్‌కు నెల రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంకా అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారోనని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.
బాన్సువాడ టికెట్టు కోసం పలువురు నేతలు ప్రయత్నాలు చేశారు. అనూహ్యంగా ఏనుగు రవీందర్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇక్కడ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపుతామని ప్రకటించిన అధిష్టానం.. ఏనుగు రవీందర్‌రెడ్డి అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. రెండో జాబితాలోనే ఆయన పేరు ఉంటుందని భావించినా చివరి నిమిషంలో పక్కన పెట్టారని సమాచారం. కాగా బాన్సువాడనుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయనకు పార్టీ అధిష్టానం సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తేగానీ ప్రచారం మొదలుపెట్టే పరిస్థితి కనిపించడం లేదు.
జుక్కల్ టికెట్టు విషయంలోనూ సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గంగారాం, తోట లక్ష్మీకాంతరావ్‌ల మధ్య టికెట్ ఫైట్ నడుస్తోంది. లక్ష్మీకాంతరావ్‌కు టికెట్టు ఖరారైందన్న ప్రచారంతో గంగారాం తిరుగుబాటు జెండా ఎగురవేయడానికి సిద్ధమయ్యారు. భవిష్యత్ కార్యాచరణ కోసం ఆదివారం పెద్దకొడప్‌గల్‌లో అనుచరులతో సమావేశమవ్వాల్సి ఉండగా.. ఏం జరిగిందో కానీ ఆయన సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. ఇలా మూడు నియోజకవర్గాలలోనూ అభ్యర్థుల విషయంలో స్పష్టత రాకపోవడంతో పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని శ్రేణులు కోరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment