కామారెడ్డిలో బీఆర్‌ఎస్ అద్దెకు తీసుకున్న ఫంక్షన్ హాల్
కామారెడ్డి: సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంపై బీఆర్‌ఎస్ నాయకత్వం ఫోకస్ పెట్టింది. కార్యక్రమాలను వేగవంతం చేసింది. వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున పోలింగ్ బూత్‌కు పది మంది బాధ్యులను నియమిస్తున్నారు. ఈ పదిమంది కమిటీలో కొరు ఇన్‌చార్జీగా ఉంటారు. నియోజకవర్గంలో మొత్తం 266 బూత్‌లకు కమిటీలను వేసి, ఇన్‌చార్జీలను నియమించనున్నారు.
వారంతా పార్టీ నిర్దేశించే కార్యక్రమాలను అమలు చేస్తారు. పార్టీ కార్యకలాపాల కోసం జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న శుభం ఫంక్షన్ హాల్‌ను అద్దెకు తీసుకున్నారు. ఎన్నికలు పూర్తయ్యేదాకా అన్నీ అక్కడి నుంచే నడిపించనున్నారు. అలాగే మీడియాకు సమాచారం ఇవ్వడానికి విద్యానగర్‌లోని ఓ అపార్టుమెంటులో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు పార్టీ ముఖ్య నేతలు వచ్చినపుడు ఉండడానికి వీలుగా పలు ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు.
రెండు మూడు రోజుల్లో అద్దె ఇళ్లను ఎంపిక చేసి అందులో మకాం పెడతారు. మంత్రి కేటీఆర్ దిశానిర్దేశంతో ప్రచార పనులు వేగవంతమయ్యాయి. సీఎంవో నుంచి ఎమ్మెల్సీ షేరి సుభాష్‌రెడ్డి రెగ్యులర్‌గా వచ్చిపోతున్నారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ముఖ్య నేతలను సమన్వయం చేస్తూ కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు.
ముఖ్య నేతలతో సమావేశం నిర్వహణకు..
నియోజకవర్గంలో ఒక్కో మండలం/పట్టణం నుంచి ఇరవై మంది చొప్పున వంద మందితో ప్రగతి భవన్‌లో సమావేశం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తారని, అవసరమైతే సీఎం కేసీఆర్ కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశాన్ని శుక్రవారమే నిర్వహించాల్సి ఉండగా.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి తల్లి మరణంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
ప్రత్యర్థి పార్టీల నేతలపై దృష్టి
కాంగ్రెస్, బీజేపీలలో క్రియాశీలకంగా ఉన్న నేతలపై బీఆర్‌ఎస్ నేతలు దృష్టి సారించారు. వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్‌కు ఇటీవల కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పారు. మండలాలవారీగా నాయకుల జాబితాలను రూపొందించి వారిని ఏదోరకంగా కారెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
క్షేత్ర స్థాయిలో..
కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ గ్రౌండ్ వర్క్ ఇప్పటికే మొదలైంది. బూత్‌కు పది మందితో కమిటీని ఏర్పాటు చేసి, జాబితాను కంప్యూటరీకరిస్తారు. వారికి ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా సమాచారాన్ని చేరవేస్తారు. అలాగే సోషల్ మీడియాల టీంలను ఇప్పటికే అలర్ట్ చేశారు. ప్రభుత్వ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో గత పాలకుల విధానాలతో జరిగిన ఇబ్బందులను వివరిస్తూ, ప్రస్తుతం జరిగిన మేలును కళ్లకు కట్టేలా రూపొందించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
కామారెడ్డి క్యాంపెయిన్ ఇన్‌చార్జీగా కేటీఆర్
ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి పోరులో ముందున్న బీఆర్‌ఎస్.. తాజాగా పలు నియోజకవర్గాలకు ప్రచార ఇన్‌చార్జీలను ప్రకటించింది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గం బాధ్యతను ముగ్గురికి అప్పగించింది.
మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్‌కు ఇచ్చారు. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలకు ఇంకా ఎవరినీ నియమించలేదు. ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ అర్బన్‌తోపాటు బోధన్ నియోజకవర్గాల ప్రచార బాధ్యతలు అప్పగించారు. క్యాంపెయిన్ ఇన్‌చార్జీల నాయకత్వంలో ఆయా నియోజకవర్గాలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment