రిమ్స్‌లో మృత్యు ఘోష
రిమ్స్ క్యాంపస్: కొండంత ఆశతో జిల్లా నలుమూలల నుంచి రిమ్స్‌కు వస్తున్న పేద రోగులు అక్కడి దారుణ పరిస్థితులు చూసి భయపడి పారిపోతున్నారు. తెగించి ఆస్పత్రిలో చేరిన వారు మృత్యువాత పడుతున్నారు. ప్రసవాలు చేస్తే ఇన్‌ఫెక్షన్ వస్తుందన్న ఉద్దేశంతో చివరకు వైద్యులు కూడా డెలివరీ కేసులు చేపట్టేందుకు ముందుకు రావటం లేదు. ఐదు రోజుల వ్యవధిలోనే మెడికల్ వార్డులో 15 మంది మృతి చెందడం వీరందరి ఆందోళనలో అర్థముందని ధ్రువీకరిస్తోంది. ఇంత దారుణ దుస్థితికి కారణమేంటి?..
ఇదీ నేపథ్యం
శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు పాత, కొత్త కాంట్రాక్టర్లిద్దరూ కలిపి ఐదు నెలల వేతనాలు బకాయి ఉన్నారు. వీటి కోసం పలుమార్లు ధర్నాలు చేసినా స్పందన లేకపోవటంతో ఈ నెల 9వ తేదీన కార్మికులు సమ్మెకు దిగారు. అప్పట్లో రిమ్స్ డెరైక్టర్, కొత్త కాంట్రాక్టర్ కలసి ఈ నెల 15వ తేదీన బకాయి పడ్డ వేతనాలు చెల్లిస్తామని హామీ ఇవ్వటంతో.. 10వ తేదీ మధ్యాహ్నం సమ్మె విరమించారు. అయితే ఆ తేదీన వేతనాలు చెల్లించకపోవటంతో కార్మికులు మళ్లీ సమ్మె చేపట్టారు. దీంతో పారిశుధ్ద్య నిర్వహణ పూర్తిగా స్తంభించింది. ఓపీ నుంచి ఆపరేషన్ థియేటర్ వరకు ప్రతి చోటా చెత్త పోగులు, వ్యర్థాలు పేరుకుపోయాయి. ఫలితంగా ఆస్పత్రి అంతా దుర్వాసనతో నిండిపోయి కనీసం ఐదు నిమిషాలైనా ఉండలేని పరిస్థితి నెలకొంది. అసలే రోగులకు నిలయం. పైగా దుర్వాసన, పారిశుద్ధ్యలోపంతో పరిస్థితి క్షీణించింది. పరిశుభ్ర వాతావరణం ఉంటేనే రోగాలు త్వరగా నయమవుతాయని తెలిసినా.. అపరిశుభ్ర వాతావరణంలోనే రోగులకు చికిత్సలు చేయాల్సిన దుస్థితి దాపురించింది.
వరుస మరణాలు
పారిశుద్ధ్యం క్షీణించడంతో ఇన్‌ఫెక్షన్లు సోకుతున్నాయి. అసలే వ్యాధులతో బాధపడుతున్న వారిని వాంతులు వంటి కొత్త రుగ్మతలు సోకి ప్రాణాలను కబళిస్తున్నాయి. మెడికల్ విభాగానికి చెందిన స్త్రీ, పురుషుల వార్డుల్లో ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల్లో 15 మంది మృత్యువాత పడ్డారు. పరిస్థితి అత్యంత దారుణంగా ఉందనడానికి ఇదే నిదర్శనం. సాధారణంగా మెడికల్ విభాగానికి వచ్చే కేసుల్లో మరీ సీరియస్‌గా ఉన్న ఒకరో ఇద్దరో మరణించడం సాధారణం. ఇంత ఎక్కువ సంఖ్యలో ఇంతకుముందెప్పుడూ మరణాలు సంభవించలేదని వైద్యవర్గాలు చెబుతున్నాయి.
ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు
రిమ్స్‌లో నెలకొన్న దయనీయ పరిస్థితి చూసి రోగులు జడుసుకుంటున్నారు. ప్రసూతి వార్డు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దాంతో సోమవారం రాత్రి ఏకంగా నలుగురు గర్భిణులు రిమ్స్ నుంచి బయటపడి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రసవాలు చేయలేమని వైద్యులు కూడా చేతులెత్తేశారు. ప్రసవాలు చేస్తే తల్లీబిడ్డలకు ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదముందని రిమ్స్ డెరైక్టర్‌కు తెల్చి చెప్పేశారు. పరిస్ధితి ఇంత దారుణంగా ఉన్న జిల్లా అధికార యంత్రంగం రిమ్స్ సమస్యపై కనీసం కన్నేతైన చూడకపోవటం దారుణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కార్మికుల సమస్యలను పరిష్కరించి వారి సమ్మెను విరమించకపోతే రిమ్స్‌లో రోజు రోజుకి మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.