సాక్షి, ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో అధికార బీఆర్‌ఎస్‌కు షాకిస్తూ బీజేపీ విజయం సాధించగా, బోథ్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలుపుకుంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఓటమి పాలైన ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు చేపట్టాయి. పోలింగ్ కేంద్రాల వారీగా పోలైన ఓట్ల జాబితా ముందేసుకుని తాము ఎక్కడ ఫెయిల్ అయ్యామనే దానిపై నాయకులు పోస్టుమార్టం షురూ చేశారు. ఓట్లను రాబట్టుకోవడంలో అంచనాలు ఎక్కడ తప్పాయో దానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
బూత్‌ల వారీగా ఓట్లపై అంతర్మథనం!
ఆదిలాబాద్‌లో ఓటమి పాలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బోథ్ నియోజకవర్గంలో పరాజయం చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు, నాయకులు ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం చేస్తున్నాయి. పోలింగ్ కేంద్రాల వారీగా వచ్చిన ఓట్లను పరిశీలిస్తున్నారు. ఫలానా గ్రామంలో తమకు మెజార్టీ వస్తుందని భావించిన నాయకులకు ఓటర్లు షాకిస్తూ ఇతర పార్టీలకు అండగా నిలువడంపై ఆలోచనలో పడ్డారు. ఆయా చోట్ల తమకు ఓట్లు ఎందుకు తగ్గాయి, ప్రత్యర్థి పార్టీకి ఏ విధంగా పెరిగాయనే దానిపై సమాచారం సేకరిస్తున్నారు.
అయితే ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు క్షేత్రస్థాయిలో సక్రమంగా పనిచేయకపోవడం, పోల్‌మేనేజ్‌మెంట్‌లో వైఫల్యంతోనే తాము గెలుపునకు దూరమవ్వాల్సి వస్తోందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఆయా పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులన్న చోట కూడా పార్టీ ఓట్లపరంగా వెనుకబడి పోవడటానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మండలాల్లోనూ ఇదే ప్రక్రియ కొనసాగుతుండడం చూస్తుంటే ఓటరు నాడీని అందుకోవడంలో ఆయా పార్టీలు అంతగా సఫలీకృతం కానట్లుగా స్పష్టమవుతోంది.
ఓటరు పల్స్ పట్టడంలో విఫలం..
ఆదిలాబాద్ నియోజకవర్గంలో నాలుగు గ్రామీణ, ఆదిలాబాద్ అర్బన్‌తో కలిపి ఐదు మండలాలున్నాయి. అలాగే బోథ్ నియోజకవర్గంలో తొమ్మిది మండలాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలో బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రధాన పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఓటర్లు సైతం ఆయా పార్టీలన్నింటికీ జై కొట్టారు. బీజేపీ తరఫున ఆదిలాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి అమిత్‌షా, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రచారానికి రాగా, కాంగ్రెస్ తరఫున పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్, బోథ్‌లో జరిగిన బహిరంగ సభలకు హాజరయ్యారు.
బీఆర్‌ఎస్ తరఫున మంత్రి హరీశ్‌రావు ఆదిలాబాద్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరుకాగా, సీఎం కేసీఆర్ ఆదిలాబాద్, ఇచ్చోడలో జరిగిన బహిరంగ సభలకు హాజరయ్యారు. ఈ సభలన్నింటికీ జనం ఆయా పార్టీల నాయకులు ఆశించినదానికంటే ఎక్కువగానే వచ్చారు. ర్యాలీలకు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆ స్థాయిలో ఓట్లను రాబట్టుకోలేకపోయామనే అభిప్రాయాన్ని నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
ఇవి చదవండి: 6 గ్యారెంటీల అమలుపై అనుమానాలు...?
Comments
Please login to add a commentAdd a comment