కెరమెరి, న్యూస్‌లైన్ : ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమమే రచ్చబండ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. శనివారం కెరమెరి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రచ్చబండకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వరకే పార్టీలు కానీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలు శాశ్వతంగా ఉంటాయని అన్నారు. ప్రజలు ఆ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వివిధ రకాల కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.923 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రాష్ట్రంలో 25లక్షల మంది విద్యార్థులకు ఉచిత విద్య, స్కాలర్‌షిప్‌లు అందించామని తెలిపారు. పలు మండలాల తాగునీటి కోసం రూ.78లక్షలతో చేపట్టిన పథకాలను త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. కలెక్టర్ అహ్మద్ బాబు చురుగ్గా పనిచేస్తున్నారంటూ ప్రశంసల జల్లు కురిపించారు. అనార్‌పల్లి రోడ్డు మరమ్మతుకు రూ.50లక్షలు మంజూరయ్యాయని చెప్పారు.
రచ్చబండలో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి సత్వర న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించబోతోందని అన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల విద్యుత్ బకాయిలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. సబ్‌ప్లాన్‌లో భాగంగా మండలంలోని గ్రామ పంచాయతీలకు రూ.5లక్షల చొప్పున రోడ్డు పనులకు మంజూరైనట్లు తెలిపారు. పరందోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంలో అవినీతిపరులు జైలుపాలైనప్పటికీ అర్హులకు గృహాలు అందలేదన్నారు.
ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని అన్నారు. కెరమెరి నుంచి నార్నూర్ వరకు రోడ్డు పనులు చేపట్టాలని కరంజివాడ సర్పంచు రాథోడ్ శంకర్ కోరారు. ధ్వంసమైన రోడ్డు ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను సభలో చూపించారు. అర్హులకు బంగారుతల్లి, పింఛన్, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్డీవో రామచంద్రయ్య, ఏపీడీ జాదవ్ గణేశ్, తహశీల్దార్ రవిచంద్రారెడ్డి, ఎంపీడీవో శశికల, ఎంఈవో మల్లయ్య, నాయకులు మునీర్‌అహ్మద్ బాపురావు, సర్పంచులు రాథోడ్ శంకర్, జలపతిరావు, లింబారవు, సుంగుబాయి, పరమేశ్వర్, భీంరావు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే రచ్చబండ
Published Sun, Nov 24 2013 6:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
Advertisement
Advertisement