ahemmad babu
-
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ అహ్మద్ బాబు తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) భన్వర్‌లాల్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌లో ఏర్పాట్లపై కలెక్టర్ ఆయనకు వివరించారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి ఎనిమిది మంది, జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 107 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8గంటల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. పోస్టల్ బాలెట్ ఓట్లు, ఈవీఎంల ఓట్ల లెక్కింపునకు ప్రతి టేబుల్‌కు ఒక సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, సూక్ష్మ పరిశీలకులు ఉంటారని అన్నారు. ఓట్ల లెక్కింపుపై అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. అసెంబ్లీకి 15,028, పార్లమెంటుకు 11,228 పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకున్నారని, ముందుగా వీటిని లెక్కిస్తామని అన్నారు. ఫలితాలు ప్రజలకు తెలిసే విధంగా గురుకుల కళాశాలలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి గూగుల్ డాక్స్ ఆన్లైన్ విధానం ద్వారా జిల్లా ఫలితాలు రాష్ట్రంలోనే ముందుగా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. లెక్కింపు రౌండ్ల వారీగా ప్రజలు వీక్షించేందుకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి స్క్రీన్ ద్వారా ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సంజయ్ కుమార్ సక్సేనా, ఓంప్రకాశ్ ఫాటక్, రాకేశ్‌కుమార్, ఎంజె టక్కర్, ప్రమోద్‌కుమార్ ఉపాధ్యాయ్, చిత్తరంజన్సింగ్, శివకాంత్ ద్వివేది, పంకజ్ జోషి పరిశీలిస్తారని తెలిపారు. లెక్కింపు కేంద్రాల వద్ద 2,100 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ పాల్గొన్నారు. -
నేడే ‘సార్వత్రిక’ నోటిఫికేషన్
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల జాతరకు బుధవారం నగారా మోగనుంది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 5న షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారమే బుధవారం అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం జిల్లాలోని రెండు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాలకు నా మినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 9 వరకు అంటే ఎనిమిది రోజులపాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. ఏప్రిల్ 10న పరిశీలన, 12న ఉపసంహరణ, 30న పోలింగ్ నిర్వహిస్తారు. వచ్చే నెల మే 16న ఫలి తాలు ప్రకటిస్తారు. కాగా, రెండు రోజుల క్రితమే మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికలు పార్టీలకు ప్రధానం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుం డడంతో జిల్లా రాజకీయం ఒక్కసారి వేడెక్కుతోంది. రిటర్నింగ్ అధికారుల నియామకం సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం ఉదయం విడుదల కానుంది. ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఎన్నికల నోటిఫికేషన్ కలెక్టర్ అహ్మద్ బాబు విడుదల చేయనుండగా, మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో ఆయా రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అనంతరం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాగా, ఇప్పటికే సబ్ కలెక్టర్‌తోపాటు ఆయా ఆర్డీవోలను నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. అసెంబ్లీ నియోజకవర్గం నామినేషన్లు ఆయా రిటర్నింగ్ అధికారులు నియోజకవర్గ స్థాయిలో స్వీకరించనున్నారు. ఎంపీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థుల నుంచి కలెక్టర్ నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకు నామినేషన్ల స్వీకరణకు కలెక్టరేట్లో ప్రత్యేక విభాగం ఏర్పాటు కానుంది. ఇందుకోసం అధికారులు ఆయా నియోజకవర్గాలవారీగా సర్వం సిద్ధం చేశారు. పార్టీలకు ప్రతిష్టాత్మకం జిల్లాలో పది అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్, సిర్పూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో 19,18,267 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 9.60 లక్షల మంది పురుషులు ఉండగా, 9.57 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నెల 30న జరగబోయే సార్వత్రిక ఎన్నికలు పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ఇక ఎన్నికల జాతర ఊపందుకోనుంది. ఎన్నికల నిర్వహణకు కొన్ని రోజులుగా కసరత్తు చేసిన జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పోలింగ్ ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 2,256 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 2,500 ట్రిపుల్ ఐటీ విద్యార్థులను వినియోగించనున్నారు. నోటిఫికేషన్ విడుదల కానుండడంతో ఆయా పోలింగ్ కేంద్రాలకు గోదాము నుంచి ఈవీఎంలు తీసుకెళ్లనున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. -
ఒత్తిడికి లోనుకావద్దు..
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల విధుల్లో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఎన్నికల నియమావళి మేరకు విధులు నిర్వర్తించాలని కలెక్టర్ అహ్మద్ బాబు సూచించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సెక్టోరల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30 రోజుల్లోనే మున్సిపల్, జిల్లా, మండల పరిషత్, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అవిర్భావం జరగనుందని, ఎన్నికలు, పరీక్షలు, కొత్త రాష్ట్రం ఏర్పాటు ఒకేసారి రావడంతో పనిఒత్తిడి పెరుగుతుందని అన్నారు. ఇలాంటి పనులు భవిష్యత్తులో కూడా రాకపోవచ్చని చెప్పారు. అంకితభావంతో పని చేయాలన్నారు ఈ దఫా సెక్టోరల్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారం కల్పిస్తున్నామని, అందరూ ఎంపీడీవోల వద్ద శుక్రవారం రిపోర్టు చేయాలని సూచించారు. అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, విధులపై వివరించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, తాగునీరు, ర్యాంపులు, ఓటింగ్ కంపార్ట్మెంట్, విద్యుత్, మరుగుదొడ్లు, ఇంటర్నెట్ సౌకర్యం పరిశీలించాలన్నారు. చట్టపరమైన చర్యలు చేపట్టే అంశాలపై తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పాకెట్ డైరీలో నేరానికి సంబంధించిన వివరాలు, సెక్షన్ రూల్, ఆ నేరానికి శిక్ష వంటి అంశాలను ప్రచురించినట్లు తెలిపారు. ఈవీఎంల వినియో గం, ఓటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. సమస్యలు, ఫిర్యాదులు ఉంటే కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. రూ.1.70 కోట్ల నగదు పట్టివేత ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఇప్పటివరకు 1.70 కోట్ల నగదు పట్టుకున్నామని, 3 వేలకుపైగా కేసులు నమోదు చేశామని కలెక్టర్ వివరించా రు. డబ్బు రవాణా, చీప్ లిక్కర్, బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. అనంతరం జేసీ లక్ష్మీకాంతం మాట్లాడుతూ.. జిల్లాకు మరో పది మంది పరిశీలకులు వస్తున్నట్లు తెలిపారు. నలుగురు వ్యయ పరిశీ లకులుగా, ఆరుగురు సాధారణ పరిశీలకులుగా ఉంటారని తెలిపారు. ప్రతి సెక్టోరల్ అధికారి పరిధిలో పోలింగ్ కేంద్రాలు ఉంటాయని పేర్కొన్నారు. వాటి పరిధిలో చేపట్టాల్సిన ప నులపై వివరించారు. అనధికార వాహనాల వినియోగం, కులమతాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు, ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయడం, ఉద్యోగ ని ర్వహణకు భంగం కలిగించడం, అభ్యర్థి సామగ్రి ముద్రణ, ప్రచురణకర్త పేరు ముద్రించకపోవడం, మరణాయుధాలు కలిగి ఉండడం, ఓటర్లను తరలించడం వంటివి వివరించారు. సెక్టోరల్ అధికారులు ఆయా సెక్టర్‌కు సంబంధించి మ్యాపులు, పోలింగ్ కేంద్రాలు, మధ్య దూరం మ్యాప్‌లో ఉన్నాయన్నారు. లిక్క ర్ దుకాణాల్లో గతేడాది అమ్మకాల వివరాలు సేకరించాలన్నారు. ఓటింగ్‌కు ముందు పోలింగ్ కేంద్రంలో మాక్ పో లింగ్ నిర్వహించాలన్నారు. రిపోర్టింగ్ సిస్టమ్ అంశాలపై నివేదిక సమర్పించాలన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో అనితాగ్రేస్, సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు. -
పనుల పంపకాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎంపీలు పనుల పంపకాల్లో బిజీబిజీ అయ్యారు. కేడర్‌ను కాపాడుకునేందుకు వారికి కాంట్రాక్టు పనులు కట్టబెడుతున్నారు. నాలుగున్నరేళ్లపాటు ఆచితూచి అరకొరగా పనులు ప్రతిపాదించిన పార్లమెం ట్ సభ్యులు ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడటంతో ఆగమేఘాలపై ఎంపీ లాడ్స్ నిధులను వెచ్చిస్తున్నారు. గ్రామస్థాయి నాయకులతోపాటు, ద్వితీయ శ్రేణి నేతలకు పనులను కేటాయిస్తున్నారు. ఎన్నికల్లో గట్టెక్కేందుకు అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నారు. మరో పక్షం రోజుల్లో ‘కోడ్’ అమలులోకి రానుంది. దీంతో కొత్తగా పనులకు మంజూరు లభించే అవకాశాలు లేవు. దీంతో జిల్లాకు చెందిన ఎంపీలు రాథోడ్ రమేష్, జి.వివేక్ ఒక్కసారిగా పనులు ప్రతిపాదించడంతో ఎంపీడీవోలు తలలు పట్టుకుంటున్నారు. 40 పనులకు రాథోడ్ రమేష్ తాజా ప్రతిపాదనలు తెలంగాణ ఏర్పాటు విషయంలో చంద్రబాబు సమన్యాయం, రెండు కళ్ల సిద్ధాంతంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు చాలా మంది పార్టీకి దూరమయ్యారు. మిగిలిన కాస్త కేడర్‌ను కాపాడుకునే పనిలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు తలమునకలయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి ఇటీవల రూ.69.25 లక్షలు అంచనా వ్యయం కలిగిన 40 అభివృద్ధి పనులు అప్పగించారు. ఈ మేరకు ఆయన పంపిన ప్రతిపాదనలకు ఈనెల 7న కలెక్టర్ అహ్మద్‌బాబు ఆమోదముద్ర వేశారు. ప్రొసిడింగ్ నెం.ఐ/10/ఎంపీ లాడ్స్ లోక్‌సభ కింద రూ.69.25 లక్షల పనులకు 60 శాతం నిధులు రూ.41.55 లక్షలు ఆయా మండలాల ఎంపీడీవోలకు విడుదల చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఊట్నూర్, జన్నారం, ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, తలమడుగు, కడెం, దిలావర్పూర్, గుడిహత్నూర్, లక్ష్మణచాంద మండలాల పరిధిలోని గ్రామాల్లో చిన్నచిన్న కాంట్రాక్టు పనులను నేతలకు, కార్యకర్తలకు అప్పగించనున్నారు. సీసీ రోడ్లు, మట్టి రోడ్లు, తాగునీటి పథకాలకు బోర్వెల్లు, కమ్యూనిటీ హాళ్లు, కల్వర్టుల నిర్మాణం వంటి పనులు తాజా ప్రతిపాదనల్లో ఉన్నాయి. రూ.కోటి పనులకు వివేక్ పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ కూడా తాజాగా రూ.1.01 కోట్ల విలువ చేసే 62 పనులకు ప్రతిపాదనలు పంపారు. తాజాగా శుక్రవారం వీటికి పరిపాలన అనుమతి లభించింది. పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే లక్సెట్టిపేట, దండేపల్లి, చెన్నూరు, జైపూర్, మందమర్రి మండలాల పరిధిలో రూ.82 లక్షల అంచనా వ్యయం కలిగిన 43 అభివృద్ధి పనులకు, రూ.28.91 లక్షలు అంచనా వ్యయం కలిగిన మరో 19 పనులు మంజూరయ్యాయి. ఇందులో దాదాపు అన్ని పనులు రూ.లక్ష, రూ.2 లక్షల లోపు అంచనా వ్యయం కలిగిన పనులే ఉండటం గమనార్హం. -
ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం
ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ప్రజాస్వామ్యం దేశంలో ఓటు హక్కు ఎంతో కీలకమైందని, ప్రతీ ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకొని మంచి ప్రజా నాయకులను ఎన్నుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని జిల్లా కలెక్టర్ అహ్మద్‌బాబు అన్నారు. జాతీయ ఓటర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో ప్రపంచంలోనే భారతదేశం మొట్టమొదటిదని తెలిపారు. జిల్లాలో రెండు నెల లుగా జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సం ఘాలు, మీడియా ప్రతినిధుల కృషితో 2 లక్షల పదివేల మంది నూతన ఓటర్లను నమోదు చేసినట్లు వివరించారు. గతంలో 16 లక్షల ఓటర్లు ఉండగా.. ఆ సంఖ్య ప్రస్తుతం 19 లక్షలకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ నమోదు కాకుండా మిగిలిపోయిన వారు కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలలని సూచించారు. ఓటు విలువ ఎనలేనిది : ఎస్పీ జిల్లా ఎస్పీ గజరావ్‌భూపాల్ మాట్లాడుతూ, ఓటు హక్కు ఎంతో గొప్ప ఆయుధమని, దాని విలువ ఎనలేనిదని అన్నారు. కొంతమంది దాని విలువ తెలియక వినియోగించుకోవడం లేదని, ప్రతి ఒక్కరు తప్పక ఓటు వేయాలని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఎన్నికల ప్రభావా న్ని నిలబెడతామని, కుల, మతం, భాష, వర్గాలకు ప్రభావితం కాకుండా ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. వృద్ధ మహిళా ఓటర్లు అయిన లక్ష్మీబాయి(96), సుభద్ర(85)లను జిల్లా కలెక్టర్, ఎస్పీ సన్మానించారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా పది నియోజకవర్గాల్లో ఉపన్యాసాలు, డ్రాయింగ్, పెయింటింగ్, క్విజ్ పోటీలు నిర్వహించి జిల్లాస్థాయిలో గెలుపొందిన వారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో గెలుపొందిన వారిని హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. డీఆర్వో ఎస్ఎస్ రాజ్, డబ్ల్యూఎస్‌డీ పనసారెడ్డి, డీఎస్పీ లతామాధురి, ఏఎస్పీ సృజన, ఆర్డీఓ ఎన్. సుధాకర్‌రెడ్డి, ఎన్సీసీ బెటాలియన్ కమాండెంట్, ఇతర అధికారులు, యువజన సంఘాలు, విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. ఓటు విలువను తెలుసుకో అంటూ... ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ఓటు విలువను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలంటూ యువజన సంఘాలు, విద్యార్థులు, 32 ఆంధ్రప్రదేశ్ బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్లు శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అహ్మద్‌బాబు, ఎస్పీ గజరావ్‌భూపాల్ జెండా ఊపి ప్రారంభించారు. డైట్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా జెడ్పీ కార్యాలయం వరకు చేరుకుంది. ఓటర్లుగా నమోదుకండి.. ఓటరు గుర్తింపుకార్డు పొందండి.. ఓటు విలువను తెలుసుకోండి అనే నినాదాలతో ర్యాలీ కొనసాగించారు. కలెక్టర్‌చౌక్‌లో మానవహారంగా ఏర్పడి విద్యార్థులు, ఇతర అధికారులతో జిల్లా కలెక్టర్, ఎస్పీ ఓటు హక్కు ప్రాముఖ్యతపై నినాదాలు చేయించారు. ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, తహశీల్దార్ సిడాం దత్తు, ఎన్నికల పర్యవేక్షకులు ప్రభాకర్‌స్వామి, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
పీహెచ్సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
నిర్మల్(మామడ), న్యూస్‌లైన్ : మామడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ అహ్మద్ బాబు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి రికార్డులు పరిశీలించారు. సీనియర్ అసిస్టెంట్ నిసార్ అహ్మద్ రిజిష్టర్‌లో సంతకం చేసి ఆస్పత్రిలో లేకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించారు. నిర్మల్ ఎస్టీవో కార్యాలయానికి వెళ్తున్నాడని చెప్పడంతో కలెక్టర్ అక్కడికి ఫోన్ చేశారు. అక్కడికి రాలేదని చెప్పడంతో సీనియర్ అసిస్టెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటెండర్ ముత్తన్న సెలవు పత్రం లేకుండా విధులకు గైర్హాజరు కావడంపై మండిపడ్డారు. మహిళా ఆరోగ్య పర్యవేక్షకురాలు అరుంధతి శుక్రవారమూ కూడా రిజిష్టర్‌లో సంతకం చేసి ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. నిర్వహణ తీరుపై అసంతృప్తి ఆరోగ్య కేంద్రం నిర్వహణ తీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రసూతి కేసులు ఎందుకు నమోదు కావడం లేదని ప్రశ్నించారు. పనితీరు మెరుపడాలని వైద్యులు సందీప్, శంభులకు సూచించారు. అనంతరం మండల పరిషత్ కా ర్యాలయంలో అధికారులతో సమావేశమయ్యా రు. ఉపాధి హామీ కార్యాలయం తనిఖీ చేసి కూలీలు, జాబ్‌కార్డుల వివరాలపై ఏపీవో జయదేవ్‌ను అడిగి తెలుసుకున్నారు. తహశీల్దార్ కార్యాలయ రికార్డులు పరిశీలించారు. మ్యూటేషన్లు తక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకాధికారి కుమారస్వామి, తహశీ ల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో పాల్గొన్నారు. -
అనుమతి తప్పనిసరి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అటవీ ప్రాంతాల్లో చేపట్టే పనులకు ఆ శాఖ అనుమతి తప్పనిసరిగా పొందాలని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇంజినీరింగ్ శా ఖల ద్వారా చేపడుతున్న పనుల ఫొటోలు వెంట తీసుకురావాలని చెప్పినా ఎందుకు తేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో సర్వేయర్ల కొరత ఉందని, ఇతర జిల్లాల నుంచి డెప్యుటేషన్‌పై పనిచేసేందుకు ఎ వరూ ముందుకు రావడం లేదని తెలిపారు. జేసీ, అదనపు జేసీ పోస్టులు ఖాళీగా ఉండడంతో భూ సేకరణ ఫైళ్ల పరిష్కారానికి ఆటంకం కలుగుతోందని చెప్పా రు. కమ్యూనిటీ సర్వేయర్ల ద్వారా పనులు చేపట్టాలని సూచించారు. ఆరు విడతలుగా చేపట్టిన భూ పంపిణీలో కొందరు లబ్ధిదారులకు భూములు చూపలేదని, ఆయూ భూములను ఆర్డీవోలు పరిశీలించాలని ఆదేశించారు. భూ సేకరణకు ప్రైవేట్ భూములు సేకరిస్తే నిధులు ముందుగానే సమకూర్చాలన్నారు. సమావేశంలో డీఆర్వో ఎస్ఎస్.రాజు, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, రామచంద్రారావు, చక్రధర్, ల్యాండ్ సర్వే ఏడీ ఇనేశ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఆర్ అండ్ ఆర్‌పై సమీక్ష.. రీ హ్యాబిటేషన్, రీ సెటిల్మెంట్పై కలెక్టర్ అహ్మద్ బాబు మంగళవారం తన కార్యాలయంలో సమీక్ష స మావేశం నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముం పునకు గురైన బాధితులకు నష్టపరిహారం పంపిణీ తీరును అడిగి తెలుసుకున్నారు. మంచిర్యాల మం డలం గుడిపేట, రాపల్లి, నంనూర్ ముంపు బాధితులకు పరిహారం పంపిణీపై ఆరా తీశారు. గుడిపేట, రాపల్లి బాధితులకు పరిహారం చెల్లించామని, నంనూర్ బాధితుల్లో కొందరికి చెల్లించాల్సి ఉందని అధికారులు బదులిచ్చారు. గుడిపేట బాధితులకు పునరావాస చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మిగి లిన బాధితులందరికీ త్వరగా పరిహారం అందించి పునరావాసం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, డీఆర్వో ఎస్ఎస్.రాజు, ఆర్డీవోలు చక్రధర్, సుధాకర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ ఉమామహేశ్వర్రావు, అటవీశాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నూతన గ్రీవెన్స్ హాల్ పరిశీలన కలెక్టరేట్ సమావేశ మందిరం పక్కన కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫిర్యాదుల విభాగం హాల్‌ను కలెక్టర్ అహ్మద్‌బాబు పరిశీలించారు. సౌకర్యాలను పరిశీలించారు. హాల్లో తొమ్మిది కౌంటర్లు ఏర్పాటు చేసే వీలు ఉందని అధికారులు తెలిపారు. ఆయన వెంట డీఆర్వో ఎస్ఎస్.రాజు, సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, చక్రధర్ ఉన్నారు. -
‘ఆన్లైన్’ ద్వారా అర్జీల స్వీకరణ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రజా సమస్యల పరిష్కారం.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన నిరుపేదలకు అందేవిధంగా కలెక్టర్ అహ్మద్‌బాబు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో తీసుకునే అర్జీలకు పరిష్కారం చూపడానికి మార్పులు తీసుకొచ్చారు. ఆరు నెలలు శ్రమించి గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్(జీఎంఎస్)ను రూపొందించారు. ఈ పద్ధతిని జనవరి 1 నుంచి అంటే బుధవారం నుంచి అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా కలెక్టరేట్లో శాఖలవారీగా 12 కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించనున్నారు. ఈ ఫిర్యాదులను వెబ్సైట్లో పొందుపరుస్తారు. 30 రోజుల్లో సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. మండల స్థాయిలోనూ ఇదే విధమైన సిస్టమ్‌ను అమలు చేయనున్నారు. ఇంతకాలం పరిష్కారానికి నోచుకోని ప్రజావాణి దరఖాస్తులు ఇప్పుడు వెబ్‌సైట్‌తో పరిష్కారమవుతాయని కలెక్టర్ భావిస్తున్నారు. నూతన విధానం ఇలా.. జీఎంఎస్‌పై కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించారు. అర్జీదారు నేరుగా కలెక్టరేట్‌లోగాని, మండల కేంద్రంలోగాని వివరాలు నమోదు చేసుకోవాలి. పేరు, చిరునామా, ఏ సమస్య, రేషన్ కార్డు, ఆధార్ నంబరు, ఫోన్ నంబర్‌ను తప్పని సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సమస్యలకు రేషన్, ఆధార్, ఇతర వాటిని స్కాన్‌చేసి అప్లోడ్ చేస్తారు. ఈ వివరాలను కంప్యూటర్లో నమోదు చేస్తారు. నమోదు చేసినవెంటనే సంబంధిత అధికారికి, అర్జీదారునికి ఫోన్ ద్వారా సమాచారం వెళ్తుంది. దీని కోసం ఒక ఎస్ఎంఎస్కు 13 పైసల చొప్పున(వెయ్యి ఎస్ఎంఎస్లకు రూ.130) ఖర్చు చేస్తున్నారు. చెప్పిన వివరాలు దరఖాస్తు రూపంలో వచ్చే కాపీని అర్జీదారుడికి అందజేస్తారు. సరైన సమయంలో సంబంధిత అధికారి సమస్యను పరిష్కరించని యెడల, ఆర్డీవోకు, ఆయన స్పందించకపోతే జేసీకి, జేసీ స్పందించకపోతే కలెక్టర్ వద్దకు సమస్య వెళ్లే విధంగా రూపొందించారు. ఈ పద్ధతిని కలెక్టర్ మానిటరింగ్ చేస్తున్నారు. అమలుకు ఆటంకాలు గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్(జీఎంఎస్)ను బుధవారం నుంచి అమలుకానుంది. మొదటగా కలెక్టరేట్, ఐటీడీఏ, సబ్ కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాలవారీగా అమలు చేయాలని అధికారులు భావించారు. అనంతరం మున్సిపల్, మండలాల్లో అమలు చేయనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ శాఖలు, సెక్షన్లవారీగా వివరాలు, సబ్జెక్టు, సబ్‌సబ్జెక్టు, కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు పేరు, హోదా, సెల్ నంబరు కంప్యూటర్లో పొందుపర్చాలి. ఆయా శాఖల అధికారులు ఈ వివరాలను జీఎంఎస్‌లో అప్లోడ్ చేసే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ వివరాలను కంప్యూటర్లో అప్లోడ్ చేస్తేనే సమస్య పరిష్కరించే సదరు అధికారికి గ్రీవెన్స్‌కు వచ్చిన సమస్య సమాచారం వెళ్తుంది. ప్రధానంగా సుమరు 85 ప్రభుత్వ శాఖల వివరాలను నమోదు చేయల్సి ఉంది. ప్రస్తుతం మాస్టర్ ఎంట్రీ, సీట్ ఎంట్రీ, ఎంప్లాయి డాటా, సెక్షన్ల వారీగా సబ్జెక్టు వివరాలు కంప్యూటర్లో పొందుపరుస్తున్నారు. -
రంగంలోకి విజిలెన్స్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : యథేచ్ఛగా సాగిన మావల చెరువు భూ ముల ఆక్రమణల వెనుక ఆసలు సూత్రధారుల గుట్టు త్వరలోనే తేలనుంది. కలెక్టరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో.. జాతీయ రహదారి పక్కన ఉన్న అత్యంత విలువైన భూమిని కాజేసిన వైనంపై రెవెన్యూ అధికారుల విచారణ ఇంకా సాగుతోంది. మావల చెరువును కబ్జా చేసి కొత్తగా నిర్మిస్తున్న ఫంక్షన్‌హాల్‌తోపాటు.. ఏళ్ల కిందట నిర్మించి న మరో పంక్షన్‌హాల్ నిర్మాణం అసలు సూత్రధారులను పట్టుకునే పనిలో రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు పడటం చర్చనీయాంశం అవుతోంది. మావల చెరువు ఆక్రమణలపై ‘సాక్షి’లో వెలువడిన వరుస కథనాల నేపథ్యంలో కలెక్టర్ అహ్మద్ బాబు ఆర్డీవో సుధాకర్‌రెడ్డిని విచారణకు ఆదేశించిన విష యం విదితమే. 1.30 ఎకరాల పట్టాపై ఓ బ్యాంకు అధికారి.. ఆ భూమిని ఆనుకుని ఉన్న చెరువు శిఖా న్ని ఆక్రమించి నాలుగెకరాలకు విస్తరించి ఫంక్షన్‌హాల్ నిర్మించిన వైనాన్ని రెవెన్యూ అ ధికారులు బట్టబయలు చే శారు. అంతేగాకుండా చిల్కూరు ల క్ష్మీ గార్డెన్స్‌లో స్థలాన్ని సైతం గుర్తించారు. అయి తే చెరువు శిఖం ఆక్రమణల కు సూత్రధారిగా వ్యవహరిం చిన ఓ పంచాయతీ మాజీ కార్యదర్శి పాత్రపైనా తాజాగా విజిలెన్స్ ఆరా తీస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. హాట్ టాపిక్‌గా చెరువు ఆక్రమణ ప్రభుత్వ, అసైన్డ్ భూములే కాదు.. చెరువు శిఖాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కబ్జాదారులకు వరంగా మారాయి. యథేచ్ఛగా సాగుతున్న భూభాగోతాల వెనుక రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన మాజీ అధికారు లు, ఉద్యోగులే ఉండటం ఆందోళన కలిగిస్తోం ది. కొత్తగా వచ్చిన కలెక్టర్ ఐదు మాసాలుగా జిల్లా వ్యాప్తంగా అక్రమాలు, ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తుండటంతో అక్రమార్కు ల గుట్టురట్టవుతోంది. సుమారు రూ.10 కోట్ల విలువ చేసే మావల చెరువు శిఖం ఆక్రమణలు, అక్రమ కట్టడాలకు గురి కాగా, గతంలో నిర్మించిన చిల్కూరి లక్ష్మీ గార్డెన్, కొత్త నిర్మిస్తున్న ఫంక్షన్‌హాల్‌ల నిర్మాణంలో కొందరు అధికారుల పాత్రే కీలకం కావడం గమనార్హం. మావల చెరువును ఆనుకుని కొత్తగా నిర్మిస్తున్న ఫంక్షన్‌హాల్ యజమాని పేరిట 1.30 భూమికే పట్టా ఉండగా.. సదరు వ్యక్తి నాలుగెకరాల్లో ఫంక్షన్‌హాల్ నిర్మాణం చేపట్టాడు. సుమారు ఎనిమిది మాసాల క్రిత మే ఈ ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి శ్రీకారం జరగ్గా అప్పుడున్న ఉన్నతాధికారులతో పాటు రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకున్నారు. దానిపైనా విజిలెన్స్ అధికారులు తాజాగా రంగంలోకి దిగడం చర్చనీయాంశం అవుతోంది. 1.30 ఎకరాలకు పట్టాపొందిన ఓ ఉన్నతస్థాయి బ్యాంకు అధికారి నాలుగెకరాల్లో ఫంక్షన్‌హాల్ నిర్మించడం.. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవడం.. మిగిలిన 1.30 ఎకరాల్లో సదరు వ్యక్తికి ఉన్న లింకుడ్ డాక్యుమెంట్లపైనా వారు ఆరా తీస్తుండటం కలకలం రేపుతోంది. -
సమస్యల పరిష్కారానికే రచ్చబండ
కెరమెరి, న్యూస్‌లైన్ : ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమమే రచ్చబండ అని జిల్లా ఇన్చార్జి మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. శనివారం కెరమెరి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రచ్చబండకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వరకే పార్టీలు కానీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలు శాశ్వతంగా ఉంటాయని అన్నారు. ప్రజలు ఆ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వివిధ రకాల కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.923 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రాష్ట్రంలో 25లక్షల మంది విద్యార్థులకు ఉచిత విద్య, స్కాలర్షిప్లు అందించామని తెలిపారు. పలు మండలాల తాగునీటి కోసం రూ.78లక్షలతో చేపట్టిన పథకాలను త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. కలెక్టర్ అహ్మద్ బాబు చురుగ్గా పనిచేస్తున్నారంటూ ప్రశంసల జల్లు కురిపించారు. అనార్పల్లి రోడ్డు మరమ్మతుకు రూ.50లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. రచ్చబండలో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి సత్వర న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించబోతోందని అన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల విద్యుత్ బకాయిలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. సబ్‌ప్లాన్‌లో భాగంగా మండలంలోని గ్రామ పంచాయతీలకు రూ.5లక్షల చొప్పున రోడ్డు పనులకు మంజూరైనట్లు తెలిపారు. పరందోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంలో అవినీతిపరులు జైలుపాలైనప్పటికీ అర్హులకు గృహాలు అందలేదన్నారు. ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని అన్నారు. కెరమెరి నుంచి నార్నూర్ వరకు రోడ్డు పనులు చేపట్టాలని కరంజివాడ సర్పంచు రాథోడ్ శంకర్ కోరారు. ధ్వంసమైన రోడ్డు ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను సభలో చూపించారు. అర్హులకు బంగారుతల్లి, పింఛన్, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్డీవో రామచంద్రయ్య, ఏపీడీ జాదవ్ గణేశ్, తహశీల్దార్ రవిచంద్రారెడ్డి, ఎంపీడీవో శశికల, ఎంఈవో మల్లయ్య, నాయకులు మునీర్‌అహ్మద్ బాపురావు, సర్పంచులు రాథోడ్ శంకర్, జలపతిరావు, లింబారవు, సుంగుబాయి, పరమేశ్వర్, భీంరావు పాల్గొన్నారు.