కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ అహ్మద్ బాబు తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) భన్వర్‌లాల్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌లో ఏర్పాట్లపై కలెక్టర్ ఆయనకు వివరించారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి ఎనిమిది మంది, జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 107 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8గంటల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు.
పోస్టల్ బాలెట్ ఓట్లు, ఈవీఎంల ఓట్ల లెక్కింపునకు ప్రతి టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, సూక్ష్మ పరిశీలకులు ఉంటారని అన్నారు. ఓట్ల లెక్కింపుపై అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. అసెంబ్లీకి 15,028, పార్లమెంటుకు 11,228 పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకున్నారని, ముందుగా వీటిని లెక్కిస్తామని అన్నారు. ఫలితాలు ప్రజలకు తెలిసే విధంగా గురుకుల కళాశాలలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి గూగుల్ డాక్స్ ఆన్‌లైన్ విధానం ద్వారా జిల్లా ఫలితాలు రాష్ట్రంలోనే ముందుగా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు.
లెక్కింపు రౌండ్ల వారీగా ప్రజలు వీక్షించేందుకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి స్క్రీన్ ద్వారా ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సంజయ్ కుమార్ సక్సేనా, ఓంప్రకాశ్ ఫాటక్, రాకేశ్‌కుమార్, ఎంజె టక్కర్, ప్రమోద్‌కుమార్ ఉపాధ్యాయ్, చిత్తరంజన్‌సింగ్, శివకాంత్ ద్వివేది, పంకజ్ జోషి పరిశీలిస్తారని తెలిపారు. లెక్కింపు కేంద్రాల వద్ద 2,100 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ పాల్గొన్నారు.
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
Published Fri, May 16 2014 1:41 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement