పోలింగ్‌కు సిద్ధం..  | Be Ready to Vote | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు సిద్ధం.. 

Published Thu, Dec 6 2018 1:17 PM | Last Updated on Thu, Dec 6 2018 1:30 PM

Be Ready to Vote - Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: మరో ఇరవై నాలుగు గంటల్లో జరగనున్నఅసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణ, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేలా జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ముందు నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకున్న అధికారులు ప్రణాళిక ప్రకారం పోలింగ్‌కు ఒక రోజు ముందే అన్ని పనులు పూర్తి చేశారు. ఇక ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ నిర్వహించడమే తరువాయిగా మారింది. ఈ నేపథ్యంలో పోలింగ్‌కు జిల్లా అధికారులు తీసుకున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై ప్రత్యేక కథనం..వంద శాతం పోలింగ్‌ నమోదు లక్ష్యంగా ఎన్నికల అధికారులు ఆది నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చారు.
ఈ క్రమంలో ఎన్నికల సిబ్బంది మొదలుకుని, పోలీస్‌ బందోబస్తు వరకు పోలింగ్‌ కేంద్రాల వారీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా 3,84,136 మంది ఓటర్లు ఉండగా రెండు నియోజకవర్గాల్లో 520 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంపులు, విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నీచర్, హెల్ప్‌డెస్క్‌ తదితర సౌకర్యాలు కల్పించారు. ఎన్నికల సామగ్రి, వీవీప్యాట్, ఈవీఎంలు, పోలింగ్‌ సిబ్బందిని తరలించేందుకు జిల్లా వ్యాప్తంగా 238 వాహనాలను సిద్ధం చేశారు. ఇందులో ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని 263 పోలింగ్‌ కేంద్రాలకు 30 రూట్లు, బోథ్‌లోని 257 కేంద్రాలకు 25 రూట్లతో మ్యాప్‌లు సిద్ధంగా ఉంచారు. కాగా ఆదిలాబాద్‌లో 52, బోథ్‌లో 48 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నాయని అధికారులు వెల్లడించారు. 

రెండేసి చొప్పున పోలింగ్‌ కేంద్రాలు.. 
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో రెండు మహిళా, రెండు దివ్యాంగుల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో వందశాతం పోలింగ్‌ నమోదు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదిలాబాద్‌లోని మావల మండల కేంద్రంలో గల జెడ్పీఎస్‌ఎస్‌లలో పీఎస్‌ నంబర్‌ 125, ఇచ్చోడలోని ఆడెగామ (కె)లో మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలోని 118 కేంద్రాలను మహిళా పోలింగ్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. పట్టణంలోని తిర్పెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలోని పీఎస్‌ 219, ఇచ్చోడలోని గేర్జం ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 135 పీఎస్‌ను దివ్యాంగుల పోలింగ్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 6,837 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఇందులో ఆదిలాబాద్‌లో 2,452 మంది, బోథ్‌లో 4,385 మంది ఉన్నారు. 

జిల్లాలో ఓటర్లు ఇలా..
జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్‌ నియోజకవర్గాల్లో మొత్తం 3,84,136 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,90,517 మంది ఉండగా, మహిళలు 1,93,557 మంది ఉన్నారు. ఇతరులు 62 మంది ఉన్నారు. అధికారిక ఓటర్ల జాబితా ప్రకారం దివ్యాంగ ఓటర్లు 6,837 మంది ఉన్నట్లు తేల్చారు. బాలింతలు, గర్భిణి ఓటర్లు 10,109 మంది ఉండగా, 1,175 మంది అంధత్వ ఓటర్లు ఉన్నారు. మూగ, చెవిటి గల వారు 802 మంది ఉండగా, శారీరక వైకల్యం కలిగిన వారు 3,171 మంది ఓటర్లు ఉన్నారు. 80 ఏళ్లకు పైబడిన వృద్ధ ఓటర్లు 1,111 మంది ఉండగా, 578 మంది ఇతర దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. 

దివ్యాంగులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు..
జిల్లా వ్యాప్తంగా మొత్తం 6837 మంది దివ్యాంగ ఓటర్లు ఉండగా వీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 435 ఆటోలు ఏర్పాటు చేశారు. 383 ట్రై సైకిళ్లను అందుబాటులో ఉంచారు. 423 సహాయకులను, 383 మంది రిసోర్స్‌ పర్సన్లను నియమించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement