
సాక్షి, ఆదిలాబాద్ : రాబోయే ఎన్నికల్లో మహిళలు నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఐదింట మహిళలే అధికంగా ఉండగా, మిగతా ఐదు చోట్ల సైతం పురుషుల కన్నా మహిళా ఓటర్లలో తేడా స్వల్పమే. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ మహిళా అభ్యర్థుల చుట్టూ ప్రదక్షణలు చేసే పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా స్థానిక ప్రాంతాల అభివృద్ధి, కుటుంబ సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మహిళలు ప్రజలకు ఉపయోగపడే అభ్యర్థిని ఎన్నుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇంట్లో భర్త అభిప్రాయం ఎలా ఉన్నా, అభ్యర్థి గుణగణాలను పరిగణనలోకి తీసుకొని ఓటేయడంలో భార్య ముందుంటుంది. ఈ లెక్కన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లు ఈసారి ఎన్నికల్లో కీలకం కాబోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 19,26,927 మంది ఓటర్లు ఉండగా, అందులో మహిళా ఓటర్లు 9,69,951 మంది కాగా, పురుషులు 9,56,689, ఇతరులు 287 మంది ఉన్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ తుది జాబితా విడుదల చేసింది.
2014 కన్నా 32వేలు తగ్గిన ఓటర్లు
సాధారణంగా ఏయేటికాయేడు ఓటర్ల సంఖ్య పెరగాలి. 18 సంవత్సరాల వయస్సు గల వారందరికీ ఎన్నికల సంఘం ఓటు హక్కు కల్పిస్తున్న నేపథ్యంలో 2014 ఎన్నికలకు ఇప్పటికి ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగాలి. ఉమ్మడి జిల్లాలో ఓటర్ల సంఖ్య నాలుగున్నరేళ్లలో 32,733 తగ్గింది. 2014 ఎన్నికల్లో 19,59,660 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 19,26,927గా ఉంది. అత్యధికంగా ఆదిలాబాద్‌లో 20వేలకు పైగా ఓట్లు తగ్గగా, మంచిర్యాల ఆ తరువాత స్థానంలో ఉంది.
ఓటర్ల జాబితా సవరణలతో పెరిగిన ఓటర్లు
సెప్టెంబర్‌లో వెలువరించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలో 17,67,165 మంది మాత్రమే. అంటే 2014 ఎన్నికలతో పోలిస్తే 2,05,174 మంది ఓటర్లు తగ్గారు. అధికార యంత్రాంగం ఇష్టానుసారంగా బోగస్ ఓటర్ల పేరుతో తొలగింపు కార్యక్రమం చేపట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో రెండు నెలల నుంచి రెండుసార్లు ఓటర్ల సవరణకు అవకాశం ఇచ్చారు. ఆన్‌లైన్ ఓటరు దరఖాస్తుల విషయంలో శ్రద్ధ చూపడం, ప్రత్యేకంగా ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టడంతో రెండు నెలల్లో సుమారు లక్షన్నర ఓటర్లు ఉమ్మడి జిల్లాలో పెరిగారు.
నిర్మల్‌లో పురుషుల కన్నా 11,607 మంది మహిళా ఓటర్లు అదనంగా ఉన్నారు. గట్టిపోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో 11వేల ఓట్లు కీలకం కానున్నాయనడంలో అతిశయోక్తి లేదు. పశ్చిమ జిల్లాలోని ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, ముథోల్‌లలో కూడా పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో అభ్యర్థులు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయారు. కాగా ఉమ్మడి జిల్లాలో ఈసారి థర్డ్‌జెండర్(ఇతరులు) ఓట్లు 287 నమోదు కాగా, అత్యధికంగా మంచిర్యాల, ఆదిలాబాద్‌లలో వరుసగా 49, 46 ఓట్లు ఉన్నాయి.