ఓటరు స్లిప్ నమునా
ఆదిలాబాద్‌అర్బన్: డిసెంబర్‌లో జరిగే సాధారణ ఎన్నికల నిర్వహణకు ఇటు ఎన్నికల అధికార యంత్రాంగం, అటు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో అవసరమైన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు పోలింగ్ సిబ్బంది, ఎన్నికల అధికారుల నియామకం, పోస్టల్ బ్యాలెట్ల సరఫరా, ఓటర్ల తుది జాబితాను ఇది వరకే ప్రకటించింది. తాజాగా బుధవారం ఎన్నికలకు ముందు ఓటర్లకు పంపిణీ చేసే ఓటరు స్లిప్(పోల్ చీటి)లను కూడా నాలుగు జిల్లాలకు సరఫరా చేసింది.
ఈ నెల 21 నుంచి 23 వరకు ఓటర్లకు అందజేసే పోల్ చీటిలను తీసుకెళ్లాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఈసీ సర్క్యూలర్ ద్వారా సమాచారం అందించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నాలుగు జిల్లాల అధికారులు స్లిప్పులను ఈ నెల 21న జిల్లాల వారీగా తీసుకెళ్లాలని సర్క్యూలర్‌లో పేర్కొనడంతో ఆయా జిల్లాల అధికారులు సరఫరా చేసుకున్నారు. ఇందులో భాగంగా నాలుగు జిల్లాల ఎన్నికల సిబ్బంది బుధవారం హైదరాబాద్‌లో ఈసీ అధికారులు స్లిప్పులు భద్రపర్చిన గోదాముకు వెళ్లి 21.75 లక్షల పోలింగ్ చీటిలను తీసుకొచ్చారు. ఆదిలాబాద్‌కు సంబంధించిన పోల్‌చీటిలను ఆదిలాబాద్‌లోని ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయంలో భద్రపర్చారు.
రెండ్రోజుల్లో పంపిణీ..
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా జిల్లాల వారీగా సరఫరా చేసిన ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయనున్నారు. పోల్ చిటీల పంపిణీ బాధ్యతను ఎన్నికల సంఘం ఆయా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న బూత్ స్థాయి అధికారుల(బీఎల్‌వో)కు అప్పగించింది. మరో రెండ్రోజుల్లో పంపిణీ ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు బీఎల్‌వో స్వయంగా ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్పులను అందజేస్తారు. ఈ ఓటర్ స్లిప్పులను కుటుంబ సభ్యులకు మాత్రమే అందజేయాలనే ఆదేశాలు ఉండడంతో బీఎల్‌వోలు చర్యలు చేపట్టారు.
పోలింగ్ కేంద్రం పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు.. మనకు ఎన్ని ఓటర్ స్లిప్పులు దిగుమతి చేసుకోవాలి.. వాటిని ఈ నెలాఖరులోగా ఓటర్లకు ఏలా పంపిణీ చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నారు. ఓటర్ స్లిప్పులను బల్క్‌గా పంపిణీ చేస్తే సంబంధిత బీఎల్‌వోలపై కఠిన చర్యలు తీసుకుంటామని, డూప్లికేట్ ఓటర్ స్లిప్పులు తయారు చేసి పంపిణీ చేపడితే కేసులు పెడతామని సీఈవో రజత్ కుమార్ ఇదివరకే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లకు సకాలంలో పోల్ చిటీలు సరఫరా చేసే విధంగా బీఎల్‌వోలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఓటర్లకు స్లిప్పులు సకాలంలో పంపిణీ కాకపోతే అంగన్‌వాడీ, ఆయాల సహకారం తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఉమ్మడి జిల్లాకు 21.75 లక్షల చిటీలు...
ప్రతీ ఓటరుకు ఎన్నికల సంఘం అందజేసే ఓటర్ స్లిప్పు(పోల్ చీటి) ఓటరు ఫొటో, పేరు.. చిరునామా.. వయస్సు, గ్రామం, నియోజకవర్గం, జిల్లా తదితర వివరాలు ఉంటాయి. పది నియోజకవర్గాల్లో మొత్తం 18,88,958 మంది ఓటర్లు ఉండగా, 21,72,302 ఓటర్ స్లిప్పులు కావాలని ఉమ్మడి జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈసీకి ప్రతిపాదనలు పంపింది. ఈ నెల 19న విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా ప్రకారం ఎక్కువగా అవసరం ఉంటుందని గ్రహించిన ఈసీ అధిక సంఖ్యలో కేటాయింపు చేసింది. ఉమ్మడి జిల్లాకు మొత్తం 21.75 లక్షల స్లిప్పులు వచ్చాయి. వీటిని పది నియోజకవర్గాల వారీగా పంపిణీ చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.
అధికారులు ప్రతిపాదించిన వాటికంటే ఎన్నికల సంఘం ఎక్కువ ఓటర్ స్లిప్పులను పంపించడంతో కొరత రాకుండా ఉంది. ఉమ్మడి జిల్లాకు వచ్చిన 21.75 లక్షల చీటిలలో ఆసిఫాబాద్‌లోని రెండు నియోజకవర్గాలకు 4.28 లక్షలు, మంచిర్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలకు 6.11 లక్షలు, ఆదిలాబాద్‌లోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లకు 4.35 లక్షలు, నిర్మల్ జిల్లాలోని మూడు స్థానాలకు అవసరమైన 7.01 లక్షల ఓటర్ స్లిప్‌లు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వారీగా సరఫరా చేసిన అనంతరం ఓటర్లకు అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment