రెండు నెలలుగా ఎదురుచూస్తున్న శాసన మండలి పోరు సమయం రానే వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సర్వ ఏర్పాట్లను సిద్ధం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన కొన్ని పోలింగ్ కేంద్రాలను ఈ ఎన్నికలకూ వినియోగించనున్నారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఈవీఎంల ద్వారా నిర్వహించగా, ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. ఈనెల 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం బ్యాలెట్ బాక్సులను జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు తరలించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, రెండు నెలలుగా అధికారులు సమీక్షలు, సమావేశాలు, బ్యాలెట్ బాక్సుల సేకరణ, పోలింగ్ సిబ్బంది నియామకం తదితర పనులతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే, ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉపాధ్యాయ అభ్యర్థులు ఏడుగురు, పట్టభద్రుల అభ్యర్థులు 17 మంది పోటీలో ఉన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాట్లు..
ఆదిలాబాద్‌అర్బన్: జిల్లాలో ఉపాధ్యాయులు, పట్టభధ్రుల ఓటర్లు కలిపి మొత్తం 9,343 మంది ఉన్నారు. విడిగా చూస్తే.. పట్టభద్రులు 7,789 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 5,687 మంది ఉండగా, మహిళలు 2,100 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. ఉపాధ్యాయ ఓటర్లు 1,554 మంది ఉండగా, ఇందులో పురుషులు 1,129 మంది, మహిళలు 425 మంది ఉన్నారు. వీరందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటును మొదటి ప్రాధాన్యతతో వినియోగించుకోనున్నారు. ఆదిలాబాద్, ఉట్నూర్ రెవెన్యూ డివిజన్లలో మొత్తం 20 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ ఎన్నికలు బ్యాలెట్ బాక్సు పద్ధతిలో జరుగనున్నందున మొత్తం 40 బాక్సులను అందుబాటులో ఉంచారు. ఇందులో ఒక్కో పీఎస్‌లో ఒక్కోటి వినియోగించగా, మరో ఇరవై బాక్సులు రిజర్వులో ఉండనున్నాయి.
మండలానికి ఒకటి చొప్పున ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల పోలింగ్ కేంద్రాలు కలుపుకొని ఒక్కో దగ్గర రెండేసి పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పీఎస్‌లకు మండలం చుట్టుపక్కల 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న వారు స్వచ్ఛందంగా వచ్చి ఓటేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మండల కేంద్రాల్లోనే పీఎస్‌లను ఏర్పాటు చేయడంతోగట్టి పోలీసు బందోబస్తు నడుమ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించనున్నారు.
సిబ్బంది సిద్ధం..
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహనకు ఆయా మండలాల తహసీల్దార్లను, ఎంపీడీవోలను రూట్, జోనల్ అధికారులుగా నియమించారు. జిల్లాలో మొత్తం 20 మంది రూట్, జోనల్ అధికారులు ఉన్నారు. ఇందులో పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలకు ఏడుగురు, ఉపాధ్యాయ పీఎస్‌లకు 13 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెండు, మూడు మండలాలకు, ఇద్దరు ముగ్గురు చొప్పున విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికలకు మొత్తం 120 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 24 మంది ప్రిసైడింగ్ అధికారులు ఉండగా, 96 మంది ఓపీవోలు ఉన్నారు. ఇందులో ప్రిసైడింగ్ అధికారులు 24 మంది ఉండగా, ఇతర ప్రిసైడింగ్ అధికారులు (ఓపీవో)–(1) 22 మంది, ఓపీవో(2)–22 మంది, ఓపీవో(3)–22 మంది, అదనపు ఇతర ప్రిసైడింగ్ అధికారులు(4)–15 మంది, అదనపు ఓపీవో(5)–15 మంది ఉన్నారు. కాగా, ఎన్నికల సిబ్బందికి ఇది వరకే మొదటి విడత శిక్షణ ఇవ్వగా, సోమవారం రెండో విడత శిక్షణ ఇవ్వనున్నారు. వీరితోపాటు ఉట్నూర్‌కు ఎంపీడీవో ఫణీందర్, ఆదిలాబాద్‌కు డీఏవో శ్రీనివాస్‌రావు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలుండగా, 17 వీడియో సర్వేలియన్స్ బృందాలు ఉన్నాయి.
ఐదు కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్..
పోలింగ్‌కు ఒకరోజు ముందు ఆదిలాబాద్‌లోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం నుంచి ఎన్నికల సిబ్బంది సామగ్రిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఉట్నూర్ డివిజన్‌కు సంబంధించిన ఆర్డీవో కార్యాలయంలో పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సామగ్రిని తీసుకెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇందులో ఐదు పీఎస్‌లలో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు. ఆదిలాబాద్‌లో నాలుగు పీఎస్‌లలో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనుండగా, ఉట్నూర్‌లో ఒక కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ చేపట్టనున్నారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్లు 1,436 మంది ఉండగా, 15 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అదేవిధంగా, ఓటు హక్కు ఉన్న పట్టభద్రులు జిల్లాలో 13,980 మంది ఉండగా, 27 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఈసారి కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆశించిన మేరకు పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోకపోయినా, 13,980 మంది మాత్రం ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 9,670 ఉండగా, మహిళలు 4,308 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. ఇక ఉపాధ్యాయులు 1,436 మంది ఓటు హక్కు పొందగా, వీరిలో పురుషులు 948, మహిళలు 488 మంది ఉన్నారు.
ఎమ్మెల్సీ బరిలో ఉన్న అభ్యర్థులు ఓటు తమకే వేయాలని నేరుగా ఓటర్లకు వాయిస్ కాల్ చేస్తూ, వాట్సాప్ మెస్సేజ్‌ల ద్వారా ప్రచారం చేయడం గమనార్హం! పట్టభద్రుల ఓటర్లు 13,980 మంది ఉండగా, 17 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరు టీఎన్జీవోస్ నాయకులు, ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాలు, కాంట్రాక్టు ఉద్యోగులు, వివిధ విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశాలను ఏర్పాటు చేసి తమకు మద్దతివ్వాలని కోరుతున్నారు. ఇక పార్టీల తరుపున పోటీలో ఉన్న వారు పార్టీ నాయకులను కలిసి తమ తరుపున ప్రచారం చేసి గెలిపించాలని ఆ పార్టీ కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను కోరుతూ ప్రచారం చేసుకుంటున్నారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్: జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లు 12,063 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 8,278 మంది, మహిళలు 3,785 మంది ఉన్నారు. ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 1,731 మంది ఉండగా, వీరిలో 1,277 మంది పురుషులు, 454 మంది మహిళలు ఉన్నారు. ప్రతీ మండలానికి ఒక పోలింగ్ కేంద్రం చొప్పున, నిర్మల్ జిల్లా కేంద్రంలో మాత్రం అదనంగా నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈసారి ఉపాధ్యాయ, పట్టభద్రులవి కలిపి కామన్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. రెండు నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికల పరంగా సమస్యలు తలెత్తకుండా భద్రత ఏర్పాట్లను కూడా పటిష్ఠంగా నిర్వహిస్తున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.
ఓటర్ల వివరాలు..
మొత్తం ఓటర్లు | పురుషులు | మహిళలు |
ఉపాధ్యాయులు | 1,731 | 1,277 454 |
పట్టభద్రులు | 12,063 | 8,278 3,785 |
మొత్తం పోలింగ్ కేంద్రాలు–27, పోలింగ్ అధికారులు–109
కుమురంభీం జిల్లాలో..
ఆసిఫాబాద్: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఎన్నికల నిర్వహణపై పోలీస్ శాఖతోపాటు ఇతర శాఖలకు చెందిన అధికారులు, ఎన్నికల సిబ్బందితో పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్లు 493 మంది, పట్టభద్రుల ఓటర్లు 4,355 మంది ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా ఐదు జోన్లలో 25 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఆసిఫాబాద్ డివిజన్‌లో 12, కాగజ్‌నగర్‌లో 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ఒకే పోలింగ్ బూత్‌లో ఉపాధ్యాయ, పట్టభద్రుల రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఐదు జోన్లలో 8 మంది నోడల్ అధికారులు, 26 మంది పీవోలు, 39 మంది ఏపీవోలు 26 మంది ఓపీవోలను నియమించారు.
ప్రత్యేక శిక్షణ..
ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సిబ్బందికి రెండు దఫాలుగా శిక్షణ ఇస్తున్నారు. ఈనెల 13న తొలిదశ శిక్షణ పూర్తి కాగా, 18న ఎన్నికల సిబ్బందితోపాటు మైక్రో ఆబ్జర్వర్స్‌కు రెండో దఫా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సామాగ్రిని ఈ నెల 21న పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే కరీంనగర్ నుంచి ఎన్నికల సామగ్రితోపాటు బ్యాలెట్ బాక్సులు జిల్లాకు చేరుకోగా, ఆసిఫాబాద్ ఆర్డీవో కార్యాలయంలో, కాగజ్‌నగర్ ప్రభుత్వ జూనియర్‌కళాశాలల్లో ఈ సామగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
జిల్లాలో 4 ఫ్‌లైయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేయగా.. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లలో ప్రతి డివిజన్‌కు రెండు బృందాలు, రెండు వీడియో సర్వేలియన్స్ బృందా లు ఉంటాయి. ఈనెల 26న ఎన్నికల ఫలితాలు విడుదల చేయగా, 28తో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. 22న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 21, 22న జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించి నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment