ఓటు అందరి హక్కు.. ప్రజాస్వామ్య దేశంలో పాలకులను మార్చే వజ్రాయుధం ఓటు. రాజ్యాంగం దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతీ పౌరుడికీ ఈ హక్కు కల్పించింది. ఓటుతోనే అవినీతిని పారదోలే అవకాశం ఉంటుంది. ప్రశ్నించే అధికారం లభిస్తుంది. పాలకులను సీట్లో కూర్చోబెట్టాలా? దింపాలా? అనేది నిర్ణయిస్తుంది. నేడు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
సాక్షి, ఆదిలాబాద్/మంచిర్యాల: ఓటు హక్కు అనేది పౌరుడికి రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశం. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు భారత ఎన్నికల సంఘం ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతోంది. ఓటరు జాబితా తయారీ నుంచి తొలగించే వరకు ఆయా జిల్లాల్లో ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. కానీ ఓటరు నమోదుపై యువతకు అవగాహన లేకపోవడంతో చాలామంది ఓటుహక్కు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని తెలుస్తోంది. జిల్లాలో గత ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు, రెండోసారి డిసెంబర్ నెల మొత్తం ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో ఉమ్మడి జిల్లాలో వేల మంది యువత జాబితాలో చేరారు.
ఉమ్మడి జిల్లాలో ఓటర్లు..
2022 జనవరి 5న విడుదల చేసిన తుది జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలో 21,06,626 మంది ఓటర్లు ఉ న్నారు. పురుషులు 10,41,006 మంది, మహిళలు 10,65,500 మంది, ఇతరులు 120 మంది, నాన్ రెసిడెన్షీ ఇండియా (ఎన్నారై) ఓటర్లు 61 మంది ఉన్నారు. గతేడాదిలో నాలుగు నెలలు సాగిన ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా ఉమ్మడి జిల్లాలో 31,712 మంది యువత ఓటు నమోదు చేసుకున్నారు.
ఓటరు దినోత్సవ లక్ష్యం
భారత ఎన్నికల కమిషన్ ఆవిర్భవించిన రోజు జనవరి 25న కేంద్ర ప్రభుత్వం జాతీయ ఓటరు దినోత్సవంగా ఏటా నిర్వహిస్తోంది. 18 ఏళ్లు నిండిన దేశపౌరుడిని ఓటరు జాబితాలో చేర్పించి గుర్తింపు కార్డు అందజేసి హక్కును కల్పిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో బూత్‌స్థాయి అధికారులు అందుబాటులో ఉంటూ విద్యార్థులతో ర్యాలీలు చేపట్టి ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం.. విద్యార్థులకు ఆటపాటలు, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయడం ఓటరు దినోత్సవ లక్ష్యం.
ఇంటి నుంచే ఓటు నమోదు
మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నికల సంఘం ఓటు నమోదు ప్రక్రియలో మార్పులు చేసింది. ఒకప్పుడు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు వెళ్లి నమోదు ఫారం తీసుకొని అందులో వివరాలు పొందుపర్చి ధ్రువీకరణ పత్రాలు జత చేస్తూ దరఖాస్తు చేసేవారు. కానీ ఇప్పుడలా కాకుండా ఆన్‌లైన్ ద్వారా ఇంటి నుంచే ఓటు హక్కు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఎన్నికల సంఘం వెబ్‌సైట్ (www.ceo.telangana.gov.in), ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్, మీసేవ, ఈసేవ, స్వీప్, సీఎస్‌సీ కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవచ్చు.
ఏ దరఖాస్తు దేనికి.?
► ఫారం–6 : కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు..
► ఫారం–6ఏ: విదేశాల్లో ఉన్నవారు ఓటు నమోదు చేసుకునేందుకు..
► ఫారం–7 : జాబితా నుంచి ఓటుహక్కును తొలగించేందుకు..
► ఫారం–8 : ఓటరు కార్డులో మార్పులు, చేర్పులకోసం
► ఫారం–8ఏ: ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరో పీఎస్‌కు మార్చుకునేందుకు..
ఓటరు కార్డుతో ప్రయోజనాలు
► భారతదేశ పౌరుడిగా గుర్తింపు ఉంటుంది.
► ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.
► వయస్సు, నివాస ధృవీకరణ గుర్తించవచ్చు.
తొలి ఓటు హక్కు
1950 జనవరి 25న మొదటి సారిగా దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పౌరుడికి ఓటు హక్కు కల్పించారు. 1952లో తొలిసారి నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటరు జాబితా ఆధారంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1992 వరకు ఎలక్ట్రోరల్ ఫొటో గుర్తింపు కార్డు లేదు. 1993లో భారత ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఉన్న టీఎన్.శేషన్ ఓటరు గుర్తింపు కార్డుల ప్రక్రియను ప్రారంభించారు. అది ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది.
నేడు ప్రతిజ్ఞ
జాతీయ 12వ ఓటరు దినోత్సవం సందర్భంగా మంగళవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ సమావేశ మందిరాల్లో కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లచే కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment