స్వేచ్ఛను లొంగదీసే దొంగాట! | National Voters Day ToDay | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛను లొంగదీసే దొంగాట!

Published Fri, Jan 25 2019 12:30 AM | Last Updated on Fri, Jan 25 2019 8:51 AM

National Voters Day ToDay - Sakshi

ప్రజాస్వామ్య ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే ‘ఓటరు’ స్వేచ్ఛను ఆట వస్తువు చేస్తున్నారు. కోరిన రీతిన వంచుతున్నారు. ఓటు విలువను పలుచన చేస్తున్నారు. ప్రజా స్వామ్యంలో తనకిష్టమైన పాలకులను నిర్ణయించుకునేందుకు, తన మనోగతాన్ని వెల్లడి చేసేందుకు బలమైన ఆయుధం ‘ఓటు’. లాటిన్‌ అమెరికా సాహితీ ప్రపంచంలో వేగుచుక్క అనదగ్గ కవి, రచయిత, జర్నలిస్టు, సామాజిక వేత్త అయిన జోస్‌ మార్టి (క్యూబా) మాటల్లో చెప్పాలంటే.. ‘‘అన్నింటి కన్నా ఓటు అత్యంత సున్నితమైన విశ్వాసం. ఓటరు ప్రయోజనం మాత్రమే కాదు అతని జీవితం, పరువు, భవిష్యత్తు కూడా ఓటుతో ముడివడి ఉన్నాయి’’  ‘‘పైసల్‌ తీస్కొని ఓటేసుడా..? థూ... ఓటుకు పైసల్‌ తీస్కునుడంటే, పానం (జీవితం) అమ్ము కున్నట్టు లెక్క పటేలా! ఇజ్జత్‌ (పరువు) అమ్ము కున్నట్టు’’

సరిగ్గా ముఫ్ఫై ఏళ్ల కింద... 1989లో జరిగిన ఎన్నికలప్పుడు మెదక్‌ జిల్లా మారుమూల గ్రామం యెనగండ్ల (మా ఊరు)లో 42 ఏళ్ల వయసున్న ఒక వ్యవసాయ దినకూలీ అన్నమాటలివి. దాన్ని అవగాహన అనాలో, చైతన్యం అనాలో, నైతికత అనాలో, మరేమనాలో తెలియదు. నాటి పరిస్థితిని నేటితో పోలిస్తే... ఎన్నో రెట్లు అవగాహన పెరిగింది. చైతన్యం రగిలింది. నైతికతే దిగజారింది. ఓటుకింత అనే లెక్కలో తమకు తక్కువ డబ్బులిచ్చారని ఒక వార్డు వాసులు ఓ రాజకీయ పార్టీ కార్యాలయం ముందు ధర్నాకు దిగే పరిస్థితులు నేడు నెలకొన్నాయి. ‘ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నాకు 11 కోట్ల రూపాయలు ఖర్చయింది’ అని రాజ్యాంగ హోదా అనుభవిస్తున్న ఓ బడా నేత నిర్భయంగా ప్రకటించుకునే పరి స్థితి! ఓటర్ల జాబితా సవరించాకా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి పేరిటే హైదరాబాద్‌లో రెండు ఓట్లున్న దుస్థితి! ప్రజాస్వామ్యంలో ఓటు విలువ గురించి ఎంతగా ప్రచారం చేస్తున్నామో, దాని విలువను దిగజార్చే పరి స్థితులు, పరిణామాలే అంతకు పలు రెట్లు అధికమవుతున్నాయి. తిలా పాపం తలా పిడికెడన్నట్టు ఆ పాతకానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యక్తులే కాక వ్యవస్థలూ కారణమవుతున్నాయి.

ఏదో రీతిన ఓట్లు దండు కొని గద్దె నెక్కాలనే నాయకులు, ఓటరు జాబితాలు తారుమారు చేసే పార్టీ గణాలు, ఎన్నికల ప్రక్రియను ప్రహసనం చేసే అధికార యంత్రాం గం, ఓటు హక్కునే విస్మరిస్తున్న ‘నాగరికులు’, విడిగా–ఉమ్మడిగా వెల కట్టి అమ్ముకుంటున్న ఓటర్లు... ఇలా అన్ని వైపుల నుంచీ ఓటు విలువను దిగజారుస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థనే నవ్వుల పాల్జేస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద, ఓటు విలువపైన విశ్వాసమున్న వారి నమ్మకం రోజు రోజుకు సడలిపోయేలా పరిస్థితులు విషమిస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం)లపై తెలెత్తిన వివాదం గోటిచుట్టపై రోకటి పోటులా తయారయింది. మళ్లీ బ్యాలెట్‌కు వెళ దామా? అనే చర్చ–మీమాంస పుట్టుకొస్తోంది. ఎన్నిసార్లు సవరణ ప్రక్రియ చేపట్టినా... తప్పుల తడిక ఓటరు జాబితాలు సగటు ఓటరును వెక్కిరిస్తున్నాయి. వ్యవస్థల్ని చెరబట్టిన రాజకీయ దళారీలు ఈ జాబి తాల్ని కలుషితం చేస్తున్నారు. లక్షల దొంగ ఓట్లను చేర్చడం ద్వారానో, తమకు ఓటేయరనే భయంతో లక్షలాది అసలు పేర్లను తొలగిస్తూనో అరాచకం సృష్టిస్తున్నారు. ఈ నేర ప్రక్రియ క్రమంగా ప్రమాదకర స్థాయిలో వ్యవస్థీకృతమవుతోంది.

ఎన్నికల సంఘం వైపు వేలు
ప్రక్షాళన పేరిట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటర్ల జాబితాలను అత్యంత కలుషితం చేశారు. నిన్నటికి నిన్న అసెంబ్లీ ఎన్నికల ముంగిట తెలంగాణలో లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయి.  రేపు ఎన్నికలు జరగా ల్సిన ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది దొంగ, నకిలీ ఓట్లొచ్చి జాబితాలో తిష్ట వేశాయి. ప్రక్షాళనకోసం వాడుతున్న సాఫ్ట్‌వేర్‌ లోపభూయిష్టమే కాకుండా నిర్వహణ ప్రక్రియలోనూ అనేక లోపాలున్నాయి. వివిధ స్థాయిల్లో అధికార యంత్రాంగం అత్యంత నిర్లక్ష్యంగా, బాధ్యతారహి తంగా వ్యవహరించింది. జవాబుదారితనం లేకుండా యథేచ్ఛగా వ్యవ హరించి ఓటరును నిమిత్తమాత్రుడిని చేసింది. ఓటు నమోదు, తొల గింపు ద్వారా సవరణ, ప్రక్షాళన ప్రక్రియల్లో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద పౌరుల (ఓటర్లుగా)కున్న హక్కుల్ని నిర్దాక్షిణ్యంగా కాలరాసింది. తెలిసి కొంత, తెలియక ఇంకొంత నేడున్న దురుద్దేశపు రాజకీయ వ్యవ స్థకు ఊడిగం చేస్తోంది. తెలంగాణలో చాలా చోట్ల జాబితాను ఓటర్లు తనిఖీ చేసినపుడు తమ పేరుంది, నంబరుంది... దాన్ని ఆధారం చేసుకొని తగిన గుర్తింపు కార్డుతో పోలింగ్‌ స్టేషన్‌కు వెళితే పేరు లేదు, ఓటే లేదు. ఓటేయకుండానే ఉస్సురంటూ వెనక్కి రావలసి వచ్చింది. ‘అవును 22 లక్షల ఓట్లను తొలగించామ’ని ఎన్నికల ప్రధానాధికారే అంగీకరించిన వాస్తవం.

వివాదమిప్పుడు న్యాయస్థానం పరిధికి చేరింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 52 లక్షల దొంగ/నకిలీ ఓట్లు రాష్ట్ర ఓటర్ల జాబితాలో చేరినట్టు ఓ నిపుణుల బృందం శాస్త్రీయంగా నిరూపించింది. ఎన్నికల సంఘం దీన్ని పాక్షికంగా అంగీకరించి, తిరిగి సవరణ చేప డితే... పెనంలోంచి పొయిలో పడ్డట్టు, ఇప్పుడు మరో 6 లక్షలు నకిలీ ఓట్లు అదనంగా వచ్చి చేరాయి. దాదాపు 25 లక్షల నకిలీ ఓట్లున్న మాట నిజమే అని రాష్ట్ర ఎన్నికల (కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తప్పించిన) ముఖ్యాధికారే స్వయంగా అంగీకరించి ఆమేరకు ప్రకటన వెలువరిం చారు. ప్రపంచమే అచ్చెరువొందేలా ఓ పెద్ద ఎన్నికల ప్రక్రియని దశా బ్దాల తరబడి నిర్విఘ్నంగా, ప్రశాంతంగా కొనసాస్తూ కీర్తి కిరీటం దక్కిం చుకున్న భారత ఎన్నికల సంఘం ఈ వైఫల్యాలకు జవాబు చెప్పు కోవాల్సి వస్తోంది. సగటు ఓటరు ముందు దోషిగా నిలబడింది. ఓటరు జాబితాలోంచి పేర్లు తొలగిస్తున్నపుడు పాటించాల్సిన చట్టబద్ద ప్రక్రి యను తూతూ మంత్రంగా నిర్వహించారు. అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం కల్పించకపోగా, ఎవరికి వారు ఆన్‌లైన్లో తనిఖీ చేసుకొని పేరు లేకుంటే, సంప్రదించి చేర్పించుకోవచ్చని బాధ్యతని ఓటరుపైకి నెట్టారు. వివిధ దశల్లో పాటించాల్సిన పారదర్శకతను మంటగలిపారు. రాజ్యాం గం కల్పించిన హక్కును హరించి అదనపు బాధ్యతను పౌరుల నెత్తిన రుద్దారు.

సవరించిన జాబితాల్లోనూ తప్పులా!
తప్పుడు, అక్రమ, రిపీట్, చెల్లని, దొంగ, బహుళ.... ఇలా వివిధ రూపాల్లో ఉన్న నకిలీ ఓట్లను తొలగించడానికి ఎన్నికల సంఘం అధికారులు వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ సమగ్రంగా లేదు. ఫలితంగా ఒకే వ్యక్తికి వివిధ పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో పలు ఓట్లుంటున్నాయి. తండ్రి/ భర్త పేరు మార్పుతో, ఇంటి నంబరు మార్పుతో, మగ–ఆడ అన్న లింగవైవిధ్యంతో ఒకరికే వేర్వేరు చోట్ల ఓట్లుంటున్నాయి. ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉండగలిగిన చిన్న ఇళ్లల్లో కూడా వందలాది ఓట్లుం టున్నాయి. ధ్రువీకరించడం తేలిగ్గా సాధ్యపడే కొన్ని తప్పిదాల్ని కూడా ఆధికార యంత్రాంగం ఇప్పుడు ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ పట్టుకోలేక పోతోంది. అది దుస్సాధ్యమైందేమి కాదు, ప్రయివేటు వ్యక్తులు, సంస్థల వద్ద కూడా లభ్యమయ్యే సాధారణ సాఫ్ట్‌వేర్‌ అని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రెండు రాష్ట్రాల్లో ఓటర్లుగా ఉన్న ఒకే వ్యక్తిని కూడా ఇప్పుడు అధికారులు వాడుతున్న సాఫ్ట్‌వేర్‌ పట్టుకోలేకపోతోంది. ఫలి తంగా రెండు, ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాష్ట్రాల్లో ఓటున్న వారి సంఖ్య 18.5 లక్షలున్నట్టు ప్రయివేటు నిపుణుల సంస్థ తేల్చింది.

ఓటరు ఐడి, ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, ఇంటి నంబరు, వయసు, జెండర్, పేరు వెనుక–ముందు... ఇలా పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకొని లెక్కిం చినపుడు ఏపీలో పెద్ద సంఖ్య నకిలీ ఓట్లు దొరికాయి. 13 జిల్లాలు, 175 నియోజకవర్గాలు, 45,920 పోలింగ్‌ బూత్‌ల పరిధిలోఉన్న 3.6 కోట్ల ఓటర్ల సమాచారాన్ని తీసుకొని శాస్త్రీయంగా తనిఖీ–విశ్లేషణ చేసి మరో 34.17 లక్షల (వెరసి 52.67 లక్షల) నకిలీ ఓట్లున్నట్టు తేల్చారు.  ఇదంతా బట్టబయలై జరిపిన తాజా సవరణ తర్వాత కూడా జాబితా తప్పుల తడికే! మళ్లీ ఒకే వ్యక్తి పేరిట నాలుగేసి ఓటరు కార్డులు కూడా జారీ చేశారు. సవరణ తర్వాత... అసలు ఇంటి నంబరు, నిజమైన వయసు, వాస్తవిక జెండర్‌తో సవరించిన పేర్లు జాబితాలోకి వచ్చాయి. అదే సమయంలో, పాత (నకిలీ) పేర్లూ తుది జాబితాలో కొనసాగుతు న్నాయి. మీ ఇంట్లో, మీకు తెలియకుండా అయిదారుగురు పైశాచి (గోస్ట్‌) ఓటర్లుంటారు. ఇలాంటి ‘బోగస్‌’ ఓట్లు ఇంకెన్నో! మొత్తమ్మీద ఇదీ తెలుగునాట నెలకొన్న దుస్థితి!

పెత్తనం కోసం సంపద వికృత రూపం
అన్ని వ్యవస్థల మీద రాజకీయ పెత్తందారీతనం పెరిగి అటువైపు ఆకర్షణ అధికమైంది. ఏదో రూపంలో రాజకీయాధికారం దక్కించుకో వాలి. సంపద కలిగిన వారికి ఇదింకా మోజయింది. అడ్డదారి సంపాదన ఉన్న వారు వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసైనా అధికారం చేజిక్కించుకోవా లని ఆరాటపడుతున్నారు. ఓటరు జాబితాల్లో కూడికలు, తీసివేతలు చేస్తూ తమ ఓట్ల పంట పండించుకుంటున్నారు. లేదంటే, ప్రత్యర్థులకు ఓట్ల కరువు తీసుకువస్తున్నారు. మధ్యలో ‘ఓటర్‌’ను బలిపశువు చేస్తు న్నారు. పెరుగుతున్న ఆర్థిక అంతరాలు ఈ పరిస్థితులకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. నిన్న ముగిసిన శాసనసభ ఎన్నికల్లో డబ్బు ఎంతగా ఖర్చ యిందో అందరికీ తెలుసు. ఈ రోజు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఎవరున్నా, తెరవెనుక ఆట నడుపుతున్న ఈ ‘నికృష్ట సంపదే’ వారిని ఆడిస్తోంది. పట్టణాలు, నగరాలు, పారిశ్రామిక వాడల నుంచి వనరులు గ్రామానికి వరదై పారుతున్నాయి. ఎక్కడికక్కడ డబ్బు, మధ్యం ఏరులై ప్రవహిస్తోంది. ఓటుకింతని డబ్బు పెట్టి కొంటున్నారు.

ఓటర్లనే కాదు, గంపగుత్తగా కుటుంబాలను, వాడలను వశపరచుకుంటు న్నారు. ఏదో రూపంలో ప్రలోభపెడుతున్నారు. లొంగని చోట బయ పెడుతున్నారు. పై స్థాయి నుంచే, ఓటర్లయిన పౌరుల చేతికి నికరంగా డబ్బు వచ్చేలా ‘పథకాలు’ పన్ని వేర్వేరు స్కీముల్లో వారిని ఇరికిస్తు న్నారు. ప్రజాస్వామ్య ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే ‘ఓటరు’ స్వేచ్ఛను ఆట వస్తువు చేస్తున్నారు. కోరిన రీతిన వంచుతున్నారు. ఓటు విలువను పలుచన చేస్తున్నారు. ఓటరు చైతన్యమొకటే దీనికి విరుగుడు. ఓటరు గట్టిగా నిలబడాలి. డబ్బు పంచినా, ప్రలోభపెట్టినా తన ‘ఓటు’ హక్కు భంగపోకుండా స్వతంత్రంగా వ్యవహరించాలి. స్వేచ్ఛగా ఓటేయాలి. బాహ్య ప్రేరకాలెలా ఉన్నా... స్వేచ్ఛగా ఓటేసే తన హక్కుని అవి ప్రభా వితం చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే, ప్రజాస్వామ్యంలో తన కిష్టమైన పాలకులను నిర్ణ యించుకునేందుకు, తన మనోగతాన్ని వెల్లడి చేసేందుకు బలమైన ఆయుధం ‘ఓటు’. లాటిన్‌ అమెరికా సాహితీ ప్రపంచంలో వేగుచుక్క అనదగ్గ కవి, రచయిత, జర్నలిస్టు, సామాజిక వేత్త అయిన జోస్‌ మార్టి (క్యూబా) మాటలతో ముగిస్తా. ‘‘అన్నింటి కన్నా ఓటు అత్యంత సున్నితమైన విశ్వాసం. ఓటరు ప్రయోజనం మాత్రమే కాదు అతని జీవితం, పరువు, భవిష్యత్తు కూడా ఓటుతో ముడివడి ఉన్నాయి’’

(నేడు జాతీయ ఓటరు దినోత్సవం)
దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement