స్వాతంత్య్రానికి పూర్వం మొత్తం భారత దేశంలో కేవలం రెండు, రెండున్నర శాతం ప్రజలకు మాత్రమే ఓటు హక్కు ఉందంటే బానిస పాలన లక్షణం తేలిపోతుంది.కొందరు జమీందారులు, సంస్థానాధీశులు, భూస్వాములు, విపరీత సంపన్నులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఇది అర్థం చేసుకుంటే మన స్వాతంత్య్రం గొప్పతనం అర్థమవుతుంది. వయోజనుడైన ప్రతి వ్యక్తికీ ఓటు హక్కు ఇచ్చారు.
ఇది సామాన్యమైన హక్కు కాదు. ప్రాణాలకు ప్రాణమైన హక్కు. మనకు స్వరాజ్యం ఉంది కానీ సురాజ్యం లేదనే విమర్శలు ఉన్నాయి. అందరికీ సమానంగా ఓటు హక్కు మాత్రం ఉంది. బలహీనులకు ఓటు ఇవ్వకూడదు అన్నా, మహిళలకు ఇవ్వలే మన్నా, చదువుకున్నవారికే ఇస్తామన్నా సమానత ఉండదు.
నిశ్శబ్ద విప్లవం
1950 నాటికి ప్రజాస్వామ్యం అని గొప్పలు చెప్పుకున్న అనేకా నేక దేశాల్లో సమాన ఓటు హక్కు లేదు. మన దేశంలో ఓటింగ్ హక్కు పైన ఒకటే పరిమితి ఉండేది. అదే 21 సంవత్సరాల వయసు. ఆ తరువాత 18 ఏళ్లుంటే చాలు కచ్చితంగా ఓటు హక్కు ఇవ్వాల్సిందే!
ఓటు అమ్ముకుంటున్నారో కొంటున్నారో, ఓటు వేస్తున్నారో లేదో అవసరం లేదు. కానీ హక్కు మాత్రం ఉంది. మనం వాడుకుంటున్నందువల్లనే ఇవ్వాళ రక్తపాతం లేకుండానే అధికారం మారిపోతూ ఉన్నది. ఇది నిశ్శబ్ద విప్లవం. ఓ అర్ధరాత్రి ఫలితాలు తెలిసినపుడు అధికారం మార్పిడి జరుగుతున్నది. ఎంత గొప్ప విషయం!
మనదేశంలో ఎందరికి ఓటు హక్కు ఉందో తెలుసా? 99.1 కోట్ల మందికి ఓటు అనే అధికారం ఉంది. వీరిలో 18 నుంచి 29 వయ సున్న 21.7 కోట్ల యువశక్తి కాస్త మెదడు వాడుకుంటే చాలు ప్రభు త్వం మారిపోతుంది. అదీ ఈ ఓటు మాయ. ‘ఓటింగ్ వంటిది మరోటి లేదు. కచ్చితంగా నేను ఓటేస్తాను’ అనే నినాదంతో ఈ జనవరి 25న ఎన్నికల కమిషన్ 75వ వార్షిక ఉత్సవం జరుగుతున్నది. 2011 నుంచి ఇదే తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు.
రాజ్యాంగం ఏర్పడిన తరువాత 1952లో తొలి ఎన్నికలసంగ్రామం జరిగింది. అదొక గొప్ప పండుగ అని పెద్దలు అనేవారు. కొన్ని దశాబ్దాల కింద మనిషి పోలింగ్ బూత్‌కు రాకపోతే ఆ వ్యక్తి చని పోయినాడనుకునేది. ఇంత కష్టపడి ఓటేయడం ఎందుకు అని ఎవ రైనా అంటే, ఓటు వేయడం నేను బతికి ఉన్నాను అనడానికి నిద ర్శనం అనేవారు. అధికారులు, ఉద్యోగులు, నాలుగోస్థాయి ఉద్యో గులు, ఉపాధ్యాయులు ఓటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది చాలా కష్టమైన పని. వాళ్లంతా కొన్ని నెలలపాటు కష్టపడితే, ఆడుతూ పాడుతూ ఓటు వేసుకోవచ్చు.
పారదర్శకత ఎంత?
ఇదివరకు ఒక్కరే కమిషనర్‌గా టి.ఎన్.శేషన్ ఎన్నికలు అద్భుతంగా నిర్వహించారు. ఆ తరువాత ముగ్గురు కమిషనర్లు వచ్చారు. ప్రధాన మంత్రి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్‌ను నియ మిస్తారు. వారిలో సీనియర్ కమిషనర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా నియమిస్తారు. ఈ అధికారం భారత రాజ్యాంగం ఆర్టికల్ 324 నుండి సంక్రమించింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ప్రత్వేక అధికారాలు లేవు. ఆ ముగ్గురిలో మెజారిటీ అభిప్రాయం ద్వారా నిర్ణయం సాగుతుంది. ఈ మధ్య 2023లో సవరణ చట్టం చేశారు. ఎంపిక కమిటీలో ప్రధానితో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపికైన మరొక మంత్రి ఉంటారు. అభిశంసన ప్రక్రియ ద్వారా సీఈసీని పదవి నుండి తొలగించవచ్చు. కానీ ఆ పరిస్థితి ఎప్పుడూ రాలేదు.
ముగ్గురిలో ఇద్దరి మెజారిటీ ఉంటే కొన్ని నిర్ణయాలు తీసు కోవచ్చు. కానీ ఒకరి నిరసన ఉంటే అది తీవ్రమైన అంశంగా పరిగ ణించాలి. ప్రధాని నాయకత్వంలో రాష్ట్రపతి నియమించినప్పటికీ ముగ్గురూ నీతిగా ఉంటూ, ప్రభుత్వ ఒత్తిళ్లను ప్రతిఘటించడం అవసరం. ముగ్గురూ ప్రభుత్వానికి పక్షపాతంగా ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరగవు. ఆ మధ్య అరుణ్ గోయల్‌తో మిగిలిన ఇద్దరికి అభిప్రాయ భేదం రావడం వల్ల రాజీనామా చేశారు. 2027 డిసెంబర్ దాకా కమిషనర్‌గా ఆయనకు గడువు ఉన్నప్పటికీ, 2024 మార్చ్ 9న రాజీనామా చేయడం వల్ల అనుమానాలు వచ్చాయి కూడా!
ప్రవర్తనా నియమావళిలో ఏ మాత్రం గందరగోళం ఉన్నా అను మానాలు పెరుగుతాయి. సార్వత్రిక ఎన్నికలలో, ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికలలో తీవ్రమైన అనుమానాలు వచ్చాయి. ఇప్పటికీ అనేక వివాదాలు వస్తున్నాయి. అలాగే మతాన్ని ఎన్నికలలో విరివిగా దుర్వినియోగం చేస్తుంటే, ఎన్నికలు స్వేచ్ఛగా జరిగినట్లు కాదు. విప రీతమైన డబ్బు వెదజల్లడం, ఓటర్లను బెదిరించడం, కండబలం వాడటం, ఫేక్ న్యూస్‌ను వ్యాపింపజేయడం వల్ల ఎన్నికలు పారదర్శ కంగా సాగవు. ప్రభుత్వాలే అక్రమాలకు పాల్పడితే ప్రజాస్వామ్యం మీద నమ్మకం తగ్గిపోతుంది.
చీకటి నిధులు
ఓటర్లకు అభ్యర్థులను గురించి తెలుసుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తరువాత ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థీ తన నేరాల చిట్టాలు, స్థిరచరాస్తులు పట్టాల వివరాలతో ఇచ్చిన ప్రమాణ పత్రాలు అట్లా పడి ఉన్నాయి. ఓటర్లకూ పట్టదు, రాజకీయ పార్టీలకూ పట్టదు. 43 శాతం ప్రజాప్రతినిధుల మీద ఉన్న తీవ్రనేరాలను త్వరగా విచారణ జరపకపోతే దేశ రాజ్యాంగ సంవి ధాన సుపరిపాలనా వ్యవస్థ కుప్పకూలిపోతుంది.
నిజానికి ఈసారి ఎన్నికల బాండ్లు చాలా అనుమానాలకు దారి తీశాయి. కోట్లకు కోట్ల రూపాయలను బాండ్ల ద్వారా ‘సంపాదించారు’. వీటిని మనం విరాళాలు అంటున్నాం. ఎలక్టోరల్ బాండ్స్ ప్రవేశపెట్టడానికి ఆనాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 జనవరి 28న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభిప్రాయం కోరుతూ లేఖ రాశారు.
జనవరి 30న రాసిన జవాబులో ఈ పద్ధతి అక్రమాలకు దారి తీసే అవకాశం ఉందనీ, పారదర్శకంగా ఉండవలసిన ఎన్నికల విరా ళాలను గోప్యంగా మారుస్తుందనీ, దీనివల్ల బలవంతపు విరాళాలు వసూలు చేసే అవకాశం ఉందనీ రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయపడింది.
అయినా పార్లమెంటులో ఎటువంటి చర్చా జరగకుండానే, ఎలక్టోరల్ బాండ్స్ దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించాయి. అందుకు తగినట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాన్ని కూడా సవరించారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిపోయి 2018 జనవరి 2న ఎలక్టోరల్ బాండ్ పథకం మొదలైంది.
ఎలక్టోరల్ బాండ్లను వ్యతిరేకించిన ఎన్నికల సంఘం 2019 మార్చ్ 25న అఫిడవిట్ దాఖలు చేసింది. విరాళాలకు సంబంధించిన వివరాలను పంచుకోవడం నుండి రాజకీయ పార్టీలను మినహాయించడం విదేశీ నిధుల సమాచారాన్ని చీకటిలో ఉంచుతుందని చెప్పింది. ‘భారతదేశంలోని రాజకీయ పార్టీల విదేశీ నిధులను తనిఖీ చేయ లేము, ఇది భారతీయ విధానాలను విదేశీ కంపెనీలు ప్రభావితం చేయడానికి కారణం అవుతుంది’ అని పేర్కొంది.
అయితే, 2019 ఏప్రిల్ 12 నుండి ఇప్పటివరకు కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. మొత్తం మీద గడచిన ఐదేళ్లలో దాదాపు 1,300 కార్పొరేట్ సంస్థలు దాదాపు 20 రాజకీయ పార్టీలకు రు 12,156 కోట్ల విరాళాలు అందజేశాయి. అందులో అత్యధిక భాగం రు. 6,060 కోట్లు బీజేపీకే దక్కాయి.
చివరికి 2024 ఫిబ్రవరి 15న కేంద్రం కళాత్మకంగా నిర్మించిన ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని కోర్టు ఏకగ్రీవంగా కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)లో పొందు పరిచిన ఓటర్ల సమాచార హక్కును ఈ పథకం ఉల్లంఘించిందనిబెంచ్ పేర్కొంది. ఎన్నికలు మాయాబజార్‌గా నిర్వహిస్తే రాజ్యాంగం ఉన్నట్టా, లేనట్టా?
» 75 ఏళ్ల కిందట, గణతంత్రానికి ఒక్కరోజు ముందు,అంటే 1950 జనవరి 25న మన భారత ఎన్నికల కమిషన్ ఏర్పడింది. ఎన్నికలు లేకపోతే ప్రజాస్వామ్యం లేదు, భారత రాజ్యాంగం లేదు, ఇంతెందుకు మన స్వాత్రంత్యానికి కూడా అర్థం పర్థం ఉండదు.
» ఇంగ్లీషు, హిందీ, తెలుగు వంటి అన్ని భాషల్లో అందరికీ బాగా తెలిసిన మాట... ఓటు!
» ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి నియమించినప్పటికీ ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ప్రభుత్వ ఒత్తిళ్లు ప్రతిఘటించడం అవసరం. ప్రభుత్వానికి పక్షపాతంగా ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరగవు.
- వ్యాసకర్త కేంద్ర మాజీ సమాచార కమిషనర్
- మాడభూషి శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment