విశ్లేషణ
భారత సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పులు వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని తేల్చి చెప్పాయి. పీఎమ్‌ఎల్‌ఏ, ఉపా వంటి చట్టాల అమలులో వ్యక్తమవుతున్న ఆందోళనల వెలుగులో ప్రాథమిక హక్కుల రక్షణ, సరైన చట్ట ప్రక్రియ ఆవశ్యకతను ఇవి నొక్కిచెప్పాయి. అరెస్టు చేయడానికి గల కారణాలను తెలియపర్చడం కీలకమైన రాజ్యాంగ భద్రత అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘న్యూస్ క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్టును రద్దు చేస్తూనే, విధానపరమైన న్యాయ ప్రాముఖ్యాన్నీ, ఉపా కింద అరెస్టు చేయడానికి గల కారణాలను తెలియజేసే హక్కునూ ఎత్తిపట్టింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నప్పుడు రాజ్యాంగ హక్కులకు మినహాయింపు ఉండదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
భారత సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పులు... మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎమ్‌ఎల్‌ఏ), చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ– ఉపా) వంటి కఠినమైన చట్టాల అమలు సందర్భంగా వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని గట్టిగా నొక్కి వక్కాణించాయి. ఆర్థిక నేరాలను, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి రూపొందించిన ఈ చట్టాలు ఎలా వ్యవహరిస్తున్నాయి అనే విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు గణనీయమైన మార్పు తీసుకొచ్చాయి. చట్టాన్ని అమలు చేయడం, వ్యక్తిగత స్వేచ్ఛల మధ్య ప్రమాణాలను సమతుల్యం చేయడంలో సుప్రీంకోర్టు నిబద్ధతను తెలియజేసేలా, మే నెలలో వారంలోపు వ్యవధిలో ఈ తీర్పులు వెలువడ్డాయి. న్యాయబద్ధత, నిర్బంధంలోకి తీసుకునే అధికారాలను ఉపయోగించడంపై వ్యక్తమవుతున్న తీవ్రమైన ఆందోళనల వెలుగులో ప్రాథమిక హక్కుల రక్షణ, సరైన చట్ట ప్రక్రియ ఆవశ్యకతను ఇవి నొక్కిచెప్పాయి.
పీఎమ్‌ఎల్‌ఏ కింద దాఖలు చేసిన చార్జిషీట్‌పై ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టిన తర్వాత మే 16న వెలువరించిన కీలకమైన తీర్పులో, వ్యక్తులను అరెస్టు చేసే విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఉన్న అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం కుదించింది. న్యాయస్థానం విచారణ చేపట్టిన తర్వాత, ఫిర్యాదులో పేర్కొన్న నిందితులను ఈడీ అరెస్టు చేయలేదని న్యాయమూర్తులు ఏఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్ ప్రకటించారు. విచారణ సమయంలో అరెస్టు చేయని నిందితులకు వారెంటుకు బదులుగా ప్రత్యేక కోర్టులు సమన్లు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ ఆదేశం ఏకపక్ష నిర్బంధాలను నిరోధిస్తుంది. కోర్టుకు హాజరయ్యే వారిని మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 45 ప్రకారం కఠినమైన బెయిల్ ప్రక్రియలోకి నెట్టకుండా హామీనిస్తుంది. నిందితుడి బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అవకాశం ఇవ్వాలని సెక్షన్ 45 నిర్దేశిస్తుంది. అంతేకాకుండా, నిందితుడు నిర్దోషి అనీ, బెయిల్‌పై ఉన్నప్పుడు ఎలాంటి నేరం చేసే అవకాశం లేదనీ విశ్వసించడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని ట్రయల్ కోర్టుకు నమ్మకం కలిగించడం అవసరం.
ఈ పరిస్థితులు సాధారణంగా మనీ లాండరింగ్ కేసులో నిందితుడు బెయిల్ పొందడాన్ని సవాలుగా మారుస్తాయి. సమన్లు పంపిన తర్వాత హాజరయ్యే నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరినట్లయితే, అది సంబంధిత ట్రయల్ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. నేరాన్ని గుర్తించిన తర్వాత ఈడీ చేసే అరెస్ట్ అధికారాలను పరిమితం చేయడం ద్వారా, కోర్టు సమన్లను పాటించిన నిందితుడిని కస్టడీలోకి తీసుకుని, అయోమయం కలిగించే, కఠినమైన పీఎంఎల్‌ఏ బెయిల్ ప్రక్రియలో జరిగే దుర్వినియోగాలను పరిష్కరించడం ఈ తీర్పు లక్ష్యం.
అదేవిధంగా, ఈడీ అరెస్టులు చేసే ముందు నేరాలను అంచనా వేయవలసిన అవసరాన్ని మే 17న సుప్రీంకోర్టు చేసిన న్యాయపరమైన ఉత్తర్వు నొక్కి చెప్పింది. పీఎమ్‌ఎల్‌ఏ కింద నమోదయ్యే నేరాలు ‘పరాన్నజీవి‘ స్వభావంతో కూడి ఉన్నాయనీ, ముందస్తు నేరాల ఉనికి అవసరమనీ ఆ తీర్పు నొక్కి చెప్పింది. ముందస్తు నేరం లేకుండా, పీఎంఎల్‌ఏ ఆరోపణలు స్వతంత్రంగా నిలబడలేవని న్యాయమూర్తులు సూర్యకాంత్, కేవీ విశ్వనాథన్ నొక్కి చెప్పారు.
ముందస్తు నేరంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది నిందితుల పేర్లు లేకపోయినా, ఒక కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలను విచారించే ముందుగా ఈడీ ఆ కేసులో అంతర్లీనంగా ఉండే ముందస్తు నేరాలను క్షుణ్ణంగా నిర్ధారించాలని పేర్కొంది. ఆర్థిక నేర పరిశోధనల్లో బలమైన చట్టపరమైన ఆధారం అవసరమని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.
ఈ దృక్పథం ఆర్థిక నేర పరిశోధనలలో బలమైన చట్టపరమైన పునాది అవసరాన్ని బలపరిచింది, పవన దిబ్బూర్ కేసులో సుప్రీంకోర్టు 2023 నవంబర్‌లో ఇచ్చిన తీర్పు హేతుబద్ధతను ఇది ముందుకు తీసుకువెళ్లింది. 2023లో కోర్టు నిర్ణయం ప్రకారం, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120బి కింద శిక్షార్హమైన నేరపూరిత కుట్ర, మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించినంత మాత్రమే అది నేరం కాకూడదు. ఆ కుట్ర పీఎమ్‌ఎల్‌ఏ కింద తప్పనిసరిగా షెడ్యూల్ చేసిన నేరంగా నమోదు చేసిన నేరానికి సంబంధించినదై ఉండాలి.
మే 15న సుప్రీంకోర్టు తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం ‘న్యూస్ క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్టును రద్దు చేస్తూనే, విధానపరమైన న్యాయ ప్రాముఖ్యతను, ఉపా కింద అరెస్టు చేయడానికి గల కారణాలను తెలియజేసే హక్కును ఎత్తిపట్టింది. ఢిల్లీ పోలీసుల విధానపరమైన లోపాలను న్యాయమూర్తులు బీఆర్ గవయీ, సందీప్ మెహతా విమర్శించారు. ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టుకు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలని చెబుతున్న రాజ్యాంగ ఆదేశాన్ని నొక్కిచెప్పారు.
భారతదేశ స్థిరత్వం, సమగ్రతకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో చైనా సంస్థల ద్వారా విదేశీ నిధులను స్వీకరించిన ఆరోపణలపై 2023 అక్టోబర్‌లో పుర్కాయస్థను అరెస్టు చేసిన తరువాత ఉపా కింద పోలీసు కస్టడీకి పంపిన తీరుపై సుప్రీంకోర్టు తీర్పు తీవ్రంగా విమర్శించింది. ఆయన అరెస్టు, రిమాండ్‌ను ‘రహస్యంగా‘ నిర్వహించారని కోర్టు పేర్కొంది.
‘ఇది చట్టబద్ధమైన ప్రక్రియను తప్పించుకునే కఠోరమైన ప్రయత్నం తప్ప మరొకటి కాదు; నిందితుడిని అరెస్టు చేసిన కారణాలను తెలియజేయకుండా పోలీసు కస్టడీకి పరిమితం చేశారు. న్యాయవాదుల సేవలను పొందే అవకాశాన్ని నిందితుడికి హరించారు. బెయిల్ కోరడం అనేది నిందితుడి ఎంపిక’ అని కోర్టు పేర్కొంది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నప్పుడు రాజ్యాంగ హక్కులకు మినహాయింపు ఉండదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనీ లాండరింగ్ చట్టం, ఉపా చట్టం రెండింటిలోనూ అరెస్టుకు గల కారణాలను నిందితులకు రాతపూర్వకంగా తెలియజేయాలని కోరడమైనదనీ, ఈ అవసరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1)లో వేళ్లూనుకుని ఉందనీ కోర్టు పేర్కొంది. ఇది తమను ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే అంశంపై ప్రజల హక్కును పరిరక్షిస్తుంది. పంకజ్ బన్సాల్ కేసులో 2023 అక్టోబరు 3 నాటి తీర్పులో ఉపా కేసులకు వర్తించదంటూ ఢిల్లీ పోలీసుల వాదనకు ప్రతిస్పందనగా న్యాయస్థానం ఈవిధంగా ప్రకటించింది.
దీని ప్రకారం నిందితులను అరెస్టు చేసేటప్పుడు ఈడీ పత్రబద్ధమైన ఆధారాలను అందించాలి. అరెస్టు చేయడానికి గల కారణాలను తెలియపర్చడం అనేది కీలకమైన రాజ్యాంగ భద్రత అనీ, పారదర్శకతను, న్యాయాన్ని నిర్ధారించడానికి ఏకరీతిగా దీనిని వర్తింపజేయాలని న్యాయస్థానం నొక్కి చెప్పింది. చట్టాలను అమలు చేసే సంస్థలకు విస్తృతమైన అధికారాలను కల్పించే విధానాలలోని పారదర్శకత, న్యాయమైన ఆవశ్యకతను ఈ తీర్పు పునరుద్ఘాటించింది.
వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడానికి, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు తగిన ప్రక్రియకు, న్యాయానికి కట్టుబడి ఉండేలా చేయడంలో సుప్రీంకోర్టు నిబద్ధతను ఈ తీర్పులు సమష్టిగా సూచిస్తాయి. ఈ నిర్ణయాలు చట్ట నియమాన్ని పటిష్ఠం చేస్తాయి. ఈడీ వంటి ఏజెన్సీలు వ్యక్తిగత స్వేచ్ఛలను గౌరవిస్తూ చట్టపరమైన సరిహద్దుల్లో పని చేసేలా చూస్తాయి. ఈ విధానం ప్రజల హక్కులను పరిరక్షిస్తుంది. ఉగ్రవాదం, ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో కీలకమైన విధులను అందించే చట్టాల అమలు సంస్థల విశ్వసనీయతను, జవాబుదారీతనాన్ని ఏకకాలంలో ఇది పెంచుతుంది.
ఉత్కర్ష్ ఆనంద్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment