ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా
‘ఢిల్లీ ఆర్డినెన్స్’ పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వ (సవరణ) చట్టం, 2023, ఢిల్లీలో పరిపాలనా రూపాన్ని మారుస్తుంది. ఈ ఆర్డినెన్స్, స్పష్టమైన కారణం లేకుండా, ‘సేవలకు’ సంబంధించి అధికారాలను వినియోగించుకునే వీలును ఢిల్లీ ప్రభుత్వానికి లేకుండా చేస్తోంది. దీనికి బదులుగా, ఇది భారత ప్రభుత్వానికి అపరిమిత అధికారాన్ని ఇచ్చింది.
పైగా ఢిల్లీ ముఖ్యమంత్రిని, మంత్రులను రబ్బర్ స్టాంప్ కంటే తక్కువ స్థాయికి కుదించింది. దీంతో ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం చుక్కాని లేనిదిగా మిగిలిపోయింది. పైగా, ప్రజల అభీష్టం అనేది ఏ మాత్రం విలువ లేనిదిగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ పాలన ఎలా ఉంటుందనేది ఆశ్చర్యంగానే ఉంది. అంబేడ్కర్, సుప్రీంకోర్టు అభిప్రాయాలను కలిపి చదివినట్లయితే, దురదృష్టవశాత్తు ఆర్డినెన్స్ రాజ్యాంగ నైతికతను విస్మరించిందని స్పష్టమవుతోంది.
బాబాసాహెబ్ అంబేడ్కర్ 1948 నవంబర్ 4న రాజ్యాంగ సభలో రాజ్యాంగ నైతికత గురించి ప్రసంగించారు. ఆయన ఇలా అన్నారు: ‘‘ప్రజాస్వామ్య రాజ్యాంగం శాంతియుతంగా పనిచేయడానికి రాజ్యాంగ నైతికత వ్యాప్తి ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించినప్పటికీ, దానితో పరస్పరం అనుసంధానితమైన రెండు అంశాలను దురదృష్టవశాత్తు సాధారణంగా గుర్తించలేదు.
ఒకటి, పరిపాలనా రూపానికి రాజ్యాంగ రూపంతో దగ్గరి సంబంధం ఉంది. రెండోది, దాని రూపాన్ని మార్చకుండా కేవలం పరిపాలనా రూపాన్ని మార్చడం ద్వారా రాజ్యాంగాన్ని వక్రీకరించగలగడం. ఇలా చేయడం ద్వారా రాజ్యాంగాన్ని అస్థిరపర్చి, రాజ్యాంగ స్ఫూర్తిని వ్యతిరేకించడం కచ్చితంగా సాధ్యమవుతుంది.’’
ఇంత తొందరేల?
జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వ (సవరణ) చట్టం, 2023, ఢిల్లీలో పరిపాలనా రూపాన్ని మారుస్తుంది. అలాగే ఇది రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా లేదు. ఆర్డినెన్స్ రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీంకోర్ట్ నిర్ణయిస్తుంది. పైగా దాని ప్రస్తుత రూపాన్ని సవాలు చేసినప్పుడు, 1991లో జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి కనీసం ఢిల్లీలో అమలులో ఉన్న పరిపాలనా రూపాన్ని అది అధిగమిస్తుందనడంలో సందేహం లేదు.
ఒక మార్పు తీసుకురావడంలో ఇంత తొందరపాటు అవస రమా? రాజ్యాంగం ఇచ్చిన అసాధారణ అధికారాన్ని వినియోగించు కోవాల్సిన తక్షణ అవసరం ఉందా? ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అధికారుల నియామకం, నియంత్రణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వా నికీ, భారత ప్రభుత్వానికీ మధ్య ఉన్న వివాదాన్ని, ఆర్డినెన్స్ ప్రకటించడానికి కేవలం ఒక వారం ముందు సుప్రీంకోర్టు పరిష్కరించింది. రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
అంతకుముందు, రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన వివాదంలో, సుప్రీంకోర్టు (2018) రాజ్యాంగ నైతికతను ఈ పదాలలో ప్రస్తావించింది. ‘‘రాజ్యాంగ నైతికత అనేది ఉన్నత స్థాయి సిబ్బందిపై, పౌరు లపై ఒక ముఖ్యమైన తనిఖీ వ్యవస్థగా పనిచేస్తుంది. అపరిమితమైన శక్తిని కలిగివుండి, ఎటువంటి తనిఖీలు, నియంత్రణలు లేకపోతే ప్రజాస్వామ్య ఆలోచనకు విరుద్ధమైన నిరంకుశ పరిస్థితి ఏర్పడుతుంది. అదే మొత్తం ప్రజాస్వామ్య భావనకే విరుద్ధమైనది.’’
కాలు చేతులు లేకుండా...
ఈ ఆర్డినెన్స్, స్పష్టమైన కారణం లేకుండా, ‘సేవలకు’ సంబంధించి అధికారాలను వినియోగించుకునే వీలును ఢిల్లీ ప్రభుత్వానికి లేకుండా చేస్తోంది. దీనికి బదులుగా, ఇది భారత ప్రభుత్వానికి అపరి మిత అధికారాన్ని ఇచ్చింది. పైగా ఢిల్లీ ముఖ్యమంత్రిని, మంత్రులను రబ్బర్ స్టాంప్ కంటే తక్కువ స్థాయికి కుదించింది.
అంబేడ్కర్, సుప్రీంకోర్టు అభిప్రాయాలను కలిపి చదివినట్ల యితే, దురదృష్టవశాత్తు ఆర్డినెన్స్ రాజ్యాంగ నైతికతను విస్మరించిందని స్పష్టమవుతుంది. ఇతర నిబంధనలను చూస్తే, ఆర్డినెన్స్ ఢిల్లీ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక అథారిటీని ఏర్పాటు చేసే వీలు కల్పిస్తుంది. దీనిని నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ అని పిలుస్తారు.
ఈ అథారిటీకి పబ్లిక్ ఆర్డర్, పోలీస్, ల్యాండ్, అంటే భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌లోని జాబితా పరిధిలోకి వచ్చే ఎంట్రీలు కాకుండా, ఢిల్లీ ప్రభుత్వ వ్యవహారాల్లో పనిచేస్తున్న గ్రూప్–ఏ అధికారులకు సంబంధించి హాస్యాస్పదమైన సిఫార్సులు చేసే అధికా రాలు మాత్రమే ఉన్నాయి. అథారిటీకి ముఖ్యమంత్రి అధ్యక్షత వహించినప్పటికీ, సీనియర్ బ్యూరోక్రాట్‌లుగా ఉన్న మరో ఇద్దరు అధికార సభ్యులు ముఖ్యమంత్రిని తోసిరాజనవచ్చు.
అందువల్ల, ముఖ్యమంత్రి పేరుకు నామమాత్రపు అధిపతి. పైగా ఆయన ఢిల్లీ ప్రజల ఎన్నికైన ప్రతినిధి అయినప్పటికీ, ఆయన కేవలం సున్నాకు తగ్గించబడ్డారు. అంతే కాకుండా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరుకి అథారిటీ సిఫార్సును ఆమోదించాల్సిన అవసరం లేదు.
ప్రజాభీష్టం మాటేమిటి?
మరొక క్రూరమైన కోత ఏమిటంటే, సాక్షాత్తూ మంత్రుల మండలి అభిప్రాయాలను ఒక కార్యదర్శి నిరోధించగలగడం. అప్ప టికి అమలులో ఉన్న చట్టానికి అనుగుణంగా మంత్రుల మండలి అభిప్రాయం లేకపోతే గనక, తానుగా ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకోగలిగే అధికారం ఈయనకు దఖలు పడింది.
పైగా ఆ అభిప్రాయాన్ని ఆయన తప్పనిసరిగా లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టికి తెచ్చి, దానిమీద ఆయన నిర్ణయాన్ని తీసుకునే వీలు కల్పిస్తాడు. మరో మాటలో చెప్పాలంటే, మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాల చట్టబద్ధతను పరీక్షించే ఇన్విజిలేటర్ లేదా ఎగ్జామినర్ పాత్రను కార్యదర్శి స్వీకరిస్తాడు. కాబట్టి ముఖ్యమంత్రి పాత్ర శూన్యంగా మారిపోవడమే కాకుండా, మంత్రి మండలి కూడా ఆ స్థాయికి దిగజారిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ పాలన ఎలా ఉంటుందనేది ఆశ్చర్యంగానే ఉంది.
ఆర్డినెన్స్ ద్వారా న్యాయం ప్రభావితం అవుతుందా? అవును, ఆర్డినెన్స్‌లోని సెక్షన్ 45 డి ప్రకారం, ఏదైనా కమిషన్, చట్టబద్ధమైన అధికార వ్యవస్థ, బోర్డు, కార్పొరేషన్ లో ఎవరైనా ఛైర్‌పర్సన్, సభ్యుడు లేదా ఆఫీస్ బేరర్‌ను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అంటే తద్వారా భారత ప్రభుత్వానికి ఆ అధికారం ఉంటుంది.
పర్యవసానంగా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ఢిల్లీ మహిళా కమి షన్, ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మొదలైన వాటితో సహా పాక్షిక–న్యాయ అధికారాలను అమలు చేసే చట్టబద్ధమైన సంస్థల నియామకాన్ని భారత ప్రభుత్వమే చేపడుతుంది. ఇది బాలల హక్కులు, స్త్రీల హక్కులు, రవాణా, నీరు, విద్యుత్ మొదలైన రంగాలకు విస్తరించింది. ప్రభావ వంతంగా, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం చుక్కానిలేనిదిగా మిగిలి పోయింది. పైగా, ప్రజల అభీష్టం అనేది ఏమాత్రం విలువ లేనిదిగా మారిపోయింది.
ఆర్డినెన్స్ ఆమోదం పొందిన నేపథ్యంలో, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన ఏకగ్రీవ తీర్పును రద్దు చేయడమే ఆర్డినెన్స్ ఉద్దేశ్యం, లక్ష్యం అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఆర్డినెన్స్ ఢిల్లీ ప్రజలపై, దాని ఎన్నికైన ప్రజాప్రతినిధులపై, రాజ్యాంగంపై కూడా రాజ్యాంగ వంచన రూపంలో వచ్చింది.
ఈ మొత్తం కసరత్తు బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని ఆవాహన చేసుకోవడం, ‘‘ప్రజాస్వామ్య రాజ్యాంగం శాంతి యుతంగా పనిచేయడానికి రాజ్యాంగ నైతికత విస్తరణ ఆవశ్యకతను’’ అంగీకరించడంలో పొరబడ్డారా అనే ఆశ్చర్యానికి దారి తీస్తుంది.
జస్టిస్ మదన్ బి లోకూర్
వ్యాసకర్త సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
Comments
Please login to add a commentAdd a comment