Lok sabha elections 2024: ఓటేస్తే డిస్కౌంట్‌... ఫ్రీ హెయిర్‌ కట్‌! | Lok sabha elections 2024: Retailers announce special offers for voters | Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: ఓటేస్తే డిస్కౌంట్‌... ఫ్రీ హెయిర్‌ కట్‌!

Apr 18 2024 4:47 AM | Updated on Apr 18 2024 4:47 AM

Lok sabha elections 2024: Retailers announce special offers for voters - Sakshi

ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం! మన రాత మారాలన్నా, నేతల తలరాతలు మార్చాలన్నా మన చేతుల్లోనే ఉంది. అందుకే ప్రతి ఓటరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం కోడై కూస్తోంది. అయినా కొందరిలో మాత్రం చలనం శూన్యం. అందుకే, ఈ ఓట్ల జాతరలో దుమ్మురేపేందుకు మేము సైతం అంటున్నారు కొందరు ఔత్సాహిక వ్యాపారులు. అటు ఓటింగ్‌ శాతం, ఇటు తమ వ్యాపారం పెరిగేలా బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

‘ఓటేసి వేలిపై సిరా చుక్క చూపండి, డిస్కౌంట్‌ పొందండి’ అంటూ ఓటర్లను ఊరిస్తున్నారు. ఉత్తరాఖండ్‌ హోటల్, రెస్టారెంట్‌ అసోసియేషన్‌ తాజాగా ఆఫర్‌ ప్రకటించింది. రాష్ట్రంలో 19న శుక్రవారం ఒకే విడతలో లోక్‌సభ ఎన్నికలు పూర్తవుతాయి. పోలింగ్‌ ముగిసిన తర్వాత నుంచి 20వ తేదీ సాయంత్రం దాకా తమ హోటళ్లు, రెస్టారెంట్లలో ఏం తిన్నా బిల్లులో 20 శాతం డిస్కౌంట్‌ ఇస్తామని తెలిపింది.

ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, వేలిపై సిరా గుర్తు చూపి డిస్కౌంట్‌ పొందచ్చొని అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ సాహ్ని చెబుతున్నారు. శుక్రవారమే రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ జరగనున్న తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో కూడా ఓటేసిన వారికి పోలింగ్‌ రోజు హోటళ్లు, ఫుడ్‌ స్టాల్స్, బేకరీలు.. ఇలా ఎక్కడ ఏం తిన్నా 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఓటర్లను ప్రోత్సహించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.అరుణ్‌ రాజ్‌ చెప్పారు. ఇక కాంచీపురం కలెక్టర్‌ కలైసెల్వి మోహన్‌ వాటర్‌ బాటిళ్లపై పోలింగ్‌ సంబంధ పోస్టర్లను అతికించడం ద్వారా ఓటర్లలో చైతన్యం నింపుతున్నారు.

ఏప్రిల్‌ 26న రెండో విడతలో పోలింగ్‌ జరిగే మహారాష్ట్రలోని అకోలాకు చెందిన అనంత కౌల్కర్‌ అదిరిపోయే ఆఫరిచ్చాడు. ఓటేసి సిరా గుర్తు చూపిన వారికి తన సెలూన్‌లో ఫ్రీగా హెయిర్‌ కట్‌ చేస్తాననంటూ షాపు ముందు బోర్డు పెట్టేశాడు. మే 25న ఆరో విడతలో పోలింగ్‌ జరగనున్న జంషెడ్‌పూర్‌లో కూడా ఓటేసిన వారికి హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు డిస్కౌంట్‌ ఇచ్చేలా ఈసీ అధికారులు ఒప్పించారు. గత నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బైక్‌ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో 2,600 పై చిలుకు పోలింగ్‌ బూత్‌లకు ఫ్రీ రైడ్స్‌ ఆఫర్‌ చేయడం తెలిసిందే. ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతల్లో జూన్‌ 1 దాకా సుదీర్ఘంగా జరగనున్న నేపథ్యంలో ఆఫర్ల జోరు కూడా పెరిగేలా కనిపిస్తోంది!  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement