సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటేసి ప్రపంచ రికార్డ్ సృష్టించారు
2019తో పోలిస్తే రీపోలింగ్ సంఖ్య గణనీయంగా తగ్గింది
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ వ్యాఖ్య
తొలిసారిగా కౌంటింగ్‌కు ముందే ప్రెస్‌మీట్
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో మొత్తంగా 64.2 కోట్ల మంది భారతీయ పౌరులు ఓటు హక్కును వినియోగించుకుని నూతన ప్రపంచ రికార్డును సృష్టించారని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ ప్రకటించారు. దేశ చరిత్రలో తొలిసారి ఓట్ల లెక్కింపునకు ముందు తోటి కమిషనర్లతో సహా సీఈసీ సోమవారం ఢిల్లీలో పత్రికాసమావేశం ఏర్పాటుచేసి పలు అంశాలపై మాట్లాడారు.
జీ7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ
‘‘ 31.2 కోట్ల మంది మహిళలుసహా 64.2 కోట్ల మంది ఓటేశారు. ఈ సంఖ్య జీ7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ. 27 యురోపియన్‌యూనియన్ దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ. ఈ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లందరికీ అభినందనలు’’ అంటూ సీఈసీ వేదికపై లేచి నిలబడి ఓటర్లకు అభినందనలు తెలిపారు. ‘‘ఎన్నికల సిబ్బంది జాగ్రత్త, అప్రమత్తత వల్లే తక్కువ చోట్ల మాత్రమే రీపోలింగ్ చేపట్టాల్సి వచి్చంది. 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరిగితే ఈసారి 39 మాత్రమే జరిగాయి’’ అని పేర్కొన్నారు.
మా గురించి మాట్లాడుకోరు
‘ 1.5 కోట్ల పోలింగ్, భద్రతా సిబ్బంది పోలింగ్ పర్వంలో పాల్గొన్నారు. 4 లక్షల వాహనాలను వినియోగించాం. 135 ప్రత్యేక రైళ్లలో సిబ్బంది, బలగాలను తరలించాం. 1,692 సార్లు హెలికాప్టర్లను వాడాం. కరెన్సీ కట్టలు, ఉచిత తాయిలాలుగా పంపిణీచేస్తున్న వస్తువులు, మద్యం, మత్తుపదార్థాలు సహా రూ.10,000 కోట్లు సీజ్‌చేశాం.
ఇంత చేస్తే ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధూల జాడ లేదంటూ ‘లాపతా జెంటిల్‌మెన్’ అని మీమ్స్ వేస్తున్నారు. మేం ఎక్కడికీ పోలేదు. మీ ముందే ఉన్నాంకదా. ఎప్పుడూలేనంతగా ఎన్నికలవేళ 100 పత్రికా ప్రకటనలు, అడ్వైజరీలతో అందర్నీ చైతన్యపరిచాం. మమ్మల్ని చూశాకైనా ‘లా పతా జెంటిల్‌మెన్ ఆర్ బ్యాక్’ అని మీమ్స్ మారుస్తారేమో. విరబూసిన పువ్వులనే చూస్తారుగానీ తోటమాలిని ఎవరూ పట్టించుకోరు. ప్రజాస్వామ్యంలో గెలుపుఓటములనే అందరూ పట్టించుకుంటారుగానీ సమర్థవంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించిన మా గురించి ఎవరూ మాట్లాడుకోరు’’ అని అన్నారు.
దమ్ముంటే నిరూపించండి
‘‘ ఎన్నికలను విదేశీ శక్తులు ప్రభావితం చేసే ప్రమాదముందని, వాటిని అడ్డుకునేందుకు మేం ఎప్పుడో సిద్ధమయ్యాం. తీరాచూస్తే ఇక్కడి విపక్షాలే అనవసర ఆరోపణలు చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రభావితం చేయనున్నారని రిటర్నింగ్ అధికారులపై విపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి. దమ్ముంటే మీ ఆరోపణలను సాక్ష్యాధారాలతో నిరూపించండి. పుకార్లు వ్యాపించజేసి అనుమాన మేఘాలు కమ్ముకునేలా చేయకండి. రిటరి్నంగ్ అధికారులుగా పనిచేసే జిల్లా మేజి్రస్టేట్, కలెక్టర్‌లపై మీరు చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే కౌంటింగ్‌కు ముందే వారిపై కఠిన చర్యలకు మేం సిద్ధం’ అని అన్నారు.
ఎన్నికల తర్వాత హింసనూ అడ్డుకుంటాం
‘‘ ఎన్నికల కోడ్ ముగిసినా సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు కొనసాగుతాయి. ఫలితాలు వచ్చాక ఎన్నికల తర్వాత హింసను అడ్డుకునే లక్ష్యంగా తొలిసారిగా ఈ పద్ధతిని అమలుచేస్తున్నాం. ఎన్నికల వేళ ఘర్షణ ఘటనలు చోటుచేసుకున్న పశి్చమబెంగాల్, మణిపూర్, ఆంధ్రప్రదేశ్‌సహా పలు రాష్ట్రాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మొహరిస్తాం. రాష్ట్రాలు, కేంద్ర పరిశీలకుల సూచనలు, సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏపీ, బెంగాల్‌లలో ఓట్ల లెక్కింపు తర్వాత 15 రోజులపాటు, యూపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌లో రెండు రోజులపాటు బలగాలు కొనసాగుతాయి’’ అని సీఈసీ వివరించారు.
జమ్మూకశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి జమ్మూకశీ్మర్‌లో నాలుగు దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా గరిష్టంగా 58.58 శాతం పోలింగ్ నమోదైంది. కశీ్మర్ లోయలో గరిష్టంగా 51.05 శాతం రికార్డయింది. సెపె్టంబర్ 30లోపు జమ్మూకశీ్మర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. అందుకే అక్కడ త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు తలకెత్తుకుంటాం. ఇవి నిజంగా అత్యంత సంతృప్తికరమైన క్షణాలు అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment