భగెల్ తీవ్ర ఆరోపణలు
నేను పోటీ చేసిన రాజ్‌నంద్‌గావ్‌లో జరిగింది
చాలా స్థానాల్లో ఇలాగే చేశారు
ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న ఛత్తీస్ మాజీ సీఎం
న్యూఢిల్లీ: పోలింగ్ ప్రక్రియ ముగిసి ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధమైనా ఎన్నికల సంఘంపై, ఈవీఎంల పనితీరుపై విపక్షాల ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగెల్ సోమవారం రాత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పోటీ చేసిన రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ స్థానంలో పోలింగ్ ముగిశాక పలుచోట్ల ఏకంగా ఈవీఎంలనే మార్చేశారని పేర్కొన్నారు!
‘‘పలు బూత్‌ల్లో ఈవీఎం బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల సీరియల్ నంబర్లు పోలింగ్ తర్వాత మారిపోయాయి. ఫామ్ 17సీలో పొందుపరిచిన సమాచారమే ఇందుకు రుజువు. దీనివల్ల వేలాది ఓట్లు ప్రభావితమవుతాయి’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇందుకు సాక్ష్యాలంటూ ఈవీఎంల తాలూకు తొలి నంబర్లు, మారిన నంబర్లతో కూడిన వివరాలను పోస్ట్ చేశారు.
‘‘ఇలా మార్చిన ఈవీఎం నంబర్ల తాలూకు జాబితా చాలా పెద్దది. అందరికీ తెలియాలని చిన్న జాబితా మాత్రమే పోస్ట్ చేస్తున్నా’’ అని తెలిపారు. ‘‘ఇది చాలా సీరియస్ అంశం. ఇలా నంబర్లను ఎందుకు మార్చాల్సి వచి్చంది?’’ అని ఈసీని ఉద్దేశించి భగెల్ ప్రశ్నించారు. చాలా లోక్‌సభ స్థానాల నుంచి ఇలాంటి ఫిర్యాదులే వస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేస్తున్నాం.
నంబర్లను ఏ పరిస్థితుల్లో మార్చాల్సి వచి్చందో ఈసీ బదులివ్వాల్సిందే. దీనివల్ల ఆయా స్థానాల్లో ఎన్నికల ఫలితంపై ప్రభావం పడితే అందుకు ఎవరిది బాధ్యత?’’ అంటూ మండిపడ్డారు. పోలింగ్ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా 150 జిల్లాల కలెక్టర్లకు నేరుగా ఫోన్ చేసి బెదిరింపులకు దిగారంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆదివారం ఆరోపించడం తెలిసిందే. పుకార్లు వ్యాప్తి చేయొద్దని, రుజువులుంటే ఇవ్వాలని సీఈసీ రాజీవ్‌కుమార్ స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment