
ఎన్నికల నోటిఫికేషన్ల విడుదల సమయాల్లో మాత్రమే వినబడే ఎన్నికల సంఘం చాన్నాళ్లుగా తరచు వార్తల్లోకెక్కుతోంది. అక్కడ కమిషనర్ల ప్రవేశమూ, నిష్క్రమణా కూడా సంచలనాలుగా, వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ నెల 9న ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా చేశాక ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలో కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు.
తాజాగా ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధూలను ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ గురువారం ప్రకటించింది. తనకు 212 పేర్లతో బుధవారం రాత్రే జాబితా పంపారని, తెల్లారేలోగా అంతమందిని జల్లెడపట్టి వారిలో ఇద్దరిని ఎంపిక చేయటం సాధ్య మేనా అని కమిటీలోని విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురి ప్రశ్నించారు.
ఆ సంగతలావుంచి రేపో మాపో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతున్న దశలో ఈ ఎంపిక వుండదని, ఏకసభ్య సంఘం చేతులమీదుగా అంతా ముగుస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ రాజు తల్చుకుంటే కానిదంటూ ఏముంటుంది? నిజానికి ఎన్నికల సంఘం 90వ దశకం వరకూ ఏకసభ్య సంఘంగానే వుండేది.
1987లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో జైల్‌సింగ్‌కు రెండోసారి అవకాశం లేకుండా ఎన్నికల ప్రక్రియను సవరించాలన్న నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రయత్నానికి అప్పటి ఎన్నికల కమిషనర్ ఆర్‌వీఎస్ పేరిశాస్త్రి అడ్డుపుల్ల వేయటంతో ఆగ్రహించి ఆ సంఘాన్ని త్రిసభ్య సంఘం చేయాలని కేంద్రం భావించింది. అయితే అనంతర కాలంలో వీపీ సింగ్ ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలా చేసింది. 1990లో నాటి ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ దూకుడును తట్టుకోలేకపోయిన నాటి పీవీ నరసింహారావు సర్కారు దాన్ని త్రిసభ్యసంఘంగా మార్చింది.
నిర్వాచన్ సదన్‌లో ఏదో జరుగుతోందని తెలిసినా ఎందుకో అర్థంకాని పరిస్థితి గతంలో లేదు. ఏదైనా సమస్యవుంటే ప్రభుత్వం వివరణనివ్వటం రొటీన్‌గా సాగిపోయేది. లేదంటే మీడియానే కూపీ లాగే ప్రయత్నం చేసేది. ఇప్పుడు వివరణనిచ్చే సంస్కృతీ లేదు... వెలికితీసే మీడియా కూడా లేదు. ఈమధ్యే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేసి నిష్క్రమించారు.
వచ్చినప్పటిలాగే వెళ్లేటపుడు కూడా ఎన్నో ప్రశ్నలు మిగిల్చారు. వాస్తవానికి ఆయనకు ఇంకా మూడేళ్ల వ్యవధివుంది. పైగా వచ్చే ఫిబ్రవరిలో రాజీవ్‌కుమార్ రిటైరయ్యాక ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యే అవకాశం కూడావుంది. ఈ చాన్సును కమిషనర్లుగా వున్నవారు ఎట్టి పరిస్థితు ల్లోనూ వదులుకోరు. పోనీ గోయెల్‌కు అలా వెళ్లితీరాల్సిన పరిస్థితి ఏర్పడినా సాధారణంగా కేంద్రం సర్దిచెప్పే ప్రయత్నం చేయాలి.
ఎందుకంటే గత నెలలో మరో కమిషనర్ అనూప్ పాండే రిటైరయ్యారు. గోయెల్ కూడా నిష్క్రమిస్తే ఒక్కరే మిగులుతారు. ఒక్కరితో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు బదులు ఆ ప్రక్రియ ముగిసేవరకూ వుండాలని ఆయన్ను కోరితే వేరుగా వుండేది. ఈ హఠాత్తు నిష్క్ర మణలోని ఆంతర్యమేమిటో మూడోకంటికి తెలియదు. ఆయనంతట ఆయన వెళ్లారా, ప్రభుత్వమే అడిగిందా అన్నది అర్థంకాదు. ఆయన నియామకం కూడా వివాదాస్పదమే.
2022 నవంబర్ వరకూ పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా వున్న గోయెల్ ఆ నెల 18న స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు. రాత్రికి రాత్రి కేంద్ర న్యాయశాఖలో కమిషనర్ ఫైలు చకచకా కదిలి, నలుగురు సభ్యుల జాబితాలో గోయెల్ పేరు చేరిపోయింది. ఆ మర్నాడే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు ఆ ఫైలు వెళ్లటం, గోయెల్‌ను ఎంపిక చేయటం, ఆయన కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడం ముగిసిపోయాయి. ఈ హైస్పీడ్ ‘24గంటల వ్యవహారం’పై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఎందుకింత తొందర?’ అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది కూడా. కానీ చివరకు ఆ పిల్‌ను తోసిపుచ్చింది.
ఎన్నికల కమిషనర్‌ల నియామకం అంశంలో కొత్త చట్టం వచ్చేవరకూ ఎంపిక కమిటీలో ప్రధాని, లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వుండాలని నిరుడు మార్చిలో అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సూచించింది. రాజ్యాంగంలోని 324(2) అధికరణను ఉల్లంఘించి ప్రధాని ఏకపక్షంగా నియమకాలు చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం ఆ తీర్పునిచ్చింది.
అనంతరం ఆగస్టులో కేంద్రం తెచ్చిన చట్టంలో ఆ తీర్పు స్ఫూర్తి గాలికెగిరి పోయింది. ప్రధాని, కేంద్రమంత్రి, లోక్‌సభలో విపక్షనేత ఎంపిక కమిటీలో వుంటారని ఆ చట్టం చెబుతోంది. పర్యవసానంగా ఎప్పటిలా పాలకపక్షం అభీష్టమే నెరవేరుతుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షం లేకుండానే బిల్లు ఆమోదం పొంది, చట్టం కావటాన్ని సవాలు చేస్తూ దాఖలైన రిట్ ప్రస్తుతం విచారణలో వుంది. ఆ చట్టంకిందనే తాజాగా ఇద్దరు కమిషనర్లను నియమించారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ కీలకమైన అంశం. దాన్ని పర్యవేక్షించే ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వుండాలని జనం కోరుకుంటారు. అందుకే కమిషనర్‌ల నియామకం, పదోన్నతులు సాధ్యమైనంత పారదర్శకంగా వుండేందుకు ప్రయత్నించాలి. హఠాత్తు నిష్క్రమణలు, ఆగమనాలు ఎన్నికల సంఘం తటస్థతను ప్రశ్నార్థకం చేస్తాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యే దశలో అశోక్ లావాసా 2020లో హఠాత్తుగా రాజీనామా చేయటం, ఇటీవల వున్నట్టుండి గోయెల్ నిష్క్రమించటం, పాలకపక్షందే పైచేయిగావున్న ఎంపిక కమిటీ కొత్త నియామకాలు చేయటం వంటివి సంశ యాలకు తావిస్తాయని పాలకులు తెలుసుకోవటం ఉత్తమం.