Arun Goyal
-
ఈసీలో కొత్త నీరు!
ఎన్నికల నోటిఫికేషన్ల విడుదల సమయాల్లో మాత్రమే వినబడే ఎన్నికల సంఘం చాన్నాళ్లుగా తరచు వార్తల్లోకెక్కుతోంది. అక్కడ కమిషనర్ల ప్రవేశమూ, నిష్క్రమణా కూడా సంచలనాలుగా, వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ నెల 9న ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా చేశాక ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలో కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. తాజాగా ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూలను ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ గురువారం ప్రకటించింది. తనకు 212 పేర్లతో బుధవారం రాత్రే జాబితా పంపారని, తెల్లారేలోగా అంతమందిని జల్లెడపట్టి వారిలో ఇద్దరిని ఎంపిక చేయటం సాధ్య మేనా అని కమిటీలోని విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురి ప్రశ్నించారు. ఆ సంగతలావుంచి రేపో మాపో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతున్న దశలో ఈ ఎంపిక వుండదని, ఏకసభ్య సంఘం చేతులమీదుగా అంతా ముగుస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ రాజు తల్చుకుంటే కానిదంటూ ఏముంటుంది? నిజానికి ఎన్నికల సంఘం 90వ దశకం వరకూ ఏకసభ్య సంఘంగానే వుండేది. 1987లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో జైల్‌సింగ్‌కు రెండోసారి అవకాశం లేకుండా ఎన్నికల ప్రక్రియను సవరించాలన్న నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రయత్నానికి అప్పటి ఎన్నికల కమిషనర్ ఆర్వీఎస్ పేరిశాస్త్రి అడ్డుపుల్ల వేయటంతో ఆగ్రహించి ఆ సంఘాన్ని త్రిసభ్య సంఘం చేయాలని కేంద్రం భావించింది. అయితే అనంతర కాలంలో వీపీ సింగ్ ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలా చేసింది. 1990లో నాటి ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ దూకుడును తట్టుకోలేకపోయిన నాటి పీవీ నరసింహారావు సర్కారు దాన్ని త్రిసభ్యసంఘంగా మార్చింది. నిర్వాచన్ సదన్‌లో ఏదో జరుగుతోందని తెలిసినా ఎందుకో అర్థంకాని పరిస్థితి గతంలో లేదు. ఏదైనా సమస్యవుంటే ప్రభుత్వం వివరణనివ్వటం రొటీన్‌గా సాగిపోయేది. లేదంటే మీడియానే కూపీ లాగే ప్రయత్నం చేసేది. ఇప్పుడు వివరణనిచ్చే సంస్కృతీ లేదు... వెలికితీసే మీడియా కూడా లేదు. ఈమధ్యే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేసి నిష్క్రమించారు. వచ్చినప్పటిలాగే వెళ్లేటపుడు కూడా ఎన్నో ప్రశ్నలు మిగిల్చారు. వాస్తవానికి ఆయనకు ఇంకా మూడేళ్ల వ్యవధివుంది. పైగా వచ్చే ఫిబ్రవరిలో రాజీవ్‌కుమార్ రిటైరయ్యాక ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యే అవకాశం కూడావుంది. ఈ చాన్సును కమిషనర్లుగా వున్నవారు ఎట్టి పరిస్థితు ల్లోనూ వదులుకోరు. పోనీ గోయెల్‌కు అలా వెళ్లితీరాల్సిన పరిస్థితి ఏర్పడినా సాధారణంగా కేంద్రం సర్దిచెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గత నెలలో మరో కమిషనర్ అనూప్ పాండే రిటైరయ్యారు. గోయెల్ కూడా నిష్క్రమిస్తే ఒక్కరే మిగులుతారు. ఒక్కరితో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు బదులు ఆ ప్రక్రియ ముగిసేవరకూ వుండాలని ఆయన్ను కోరితే వేరుగా వుండేది. ఈ హఠాత్తు నిష్క్ర మణలోని ఆంతర్యమేమిటో మూడోకంటికి తెలియదు. ఆయనంతట ఆయన వెళ్లారా, ప్రభుత్వమే అడిగిందా అన్నది అర్థంకాదు. ఆయన నియామకం కూడా వివాదాస్పదమే. 2022 నవంబర్ వరకూ పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా వున్న గోయెల్ ఆ నెల 18న స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు. రాత్రికి రాత్రి కేంద్ర న్యాయశాఖలో కమిషనర్ ఫైలు చకచకా కదిలి, నలుగురు సభ్యుల జాబితాలో గోయెల్ పేరు చేరిపోయింది. ఆ మర్నాడే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు ఆ ఫైలు వెళ్లటం, గోయెల్‌ను ఎంపిక చేయటం, ఆయన కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడం ముగిసిపోయాయి. ఈ హైస్పీడ్ ‘24గంటల వ్యవహారం’పై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఎందుకింత తొందర?’ అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది కూడా. కానీ చివరకు ఆ పిల్‌ను తోసిపుచ్చింది. ఎన్నికల కమిషనర్ల నియామకం అంశంలో కొత్త చట్టం వచ్చేవరకూ ఎంపిక కమిటీలో ప్రధాని, లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వుండాలని నిరుడు మార్చిలో అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సూచించింది. రాజ్యాంగంలోని 324(2) అధికరణను ఉల్లంఘించి ప్రధాని ఏకపక్షంగా నియమకాలు చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం ఆ తీర్పునిచ్చింది. అనంతరం ఆగస్టులో కేంద్రం తెచ్చిన చట్టంలో ఆ తీర్పు స్ఫూర్తి గాలికెగిరి పోయింది. ప్రధాని, కేంద్రమంత్రి, లోక్‌సభలో విపక్షనేత ఎంపిక కమిటీలో వుంటారని ఆ చట్టం చెబుతోంది. పర్యవసానంగా ఎప్పటిలా పాలకపక్షం అభీష్టమే నెరవేరుతుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షం లేకుండానే బిల్లు ఆమోదం పొంది, చట్టం కావటాన్ని సవాలు చేస్తూ దాఖలైన రిట్ ప్రస్తుతం విచారణలో వుంది. ఆ చట్టంకిందనే తాజాగా ఇద్దరు కమిషనర్లను నియమించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ కీలకమైన అంశం. దాన్ని పర్యవేక్షించే ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వుండాలని జనం కోరుకుంటారు. అందుకే కమిషనర్ల నియామకం, పదోన్నతులు సాధ్యమైనంత పారదర్శకంగా వుండేందుకు ప్రయత్నించాలి. హఠాత్తు నిష్క్రమణలు, ఆగమనాలు ఎన్నికల సంఘం తటస్థతను ప్రశ్నార్థకం చేస్తాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యే దశలో అశోక్ లావాసా 2020లో హఠాత్తుగా రాజీనామా చేయటం, ఇటీవల వున్నట్టుండి గోయెల్ నిష్క్రమించటం, పాలకపక్షందే పైచేయిగావున్న ఎంపిక కమిటీ కొత్త నియామకాలు చేయటం వంటివి సంశ యాలకు తావిస్తాయని పాలకులు తెలుసుకోవటం ఉత్తమం. -
ఈసీ గోయెల్ రాజీనామా.. కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ ఆకస్మిక రాజీనామాపై రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్ రాజీనామా నేపథ్యంలో ఎన్నికల కమిషన్(ఈసీ) నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా అని సిబల్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం సిబల్ మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరపడం ఎన్నికల కమిషన్ విధి. అయితే గత పదేళ్లలో ఈసీ కేంద్ర ప్రభుత్వ మరో విభాగంలా తయారైంది’అని సిబల్ విమర్శించారు. దీనికి తోడు సిబల్ ఆదివారం ఎక్స్(ట్విటర్)లోనూ గోయెల్ రాజీనామాపై ఒక పోస్టు పెట్టారు. ‘దారి క్లియరైంది. కమిషన్ మొత్తం ఎస్ చెప్పే వ్యక్తులతో నింపండి. అన్ని రాజ్యాంగ బద్ధ సంస్థలకు ఇది వర్తిస్తుంది’ అని గోయెల్ రాజీనామాను ఉద్దేశించి సిబల్ సెటైర్లు వేశారు. కాగా, లోక్‌సభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ కొద్దిరోజుల్లో వెలువడుతుందనగా ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ ఆకస్మిక రాజీనామా సంచలనం రేపింది. ఈయన రాజీనామా దేశంలో రాజకీయ దుమారానికి దారి తీసింది. ఇదీ చదవండి.. ఎన్నికల వేళ ఈడీ దూకుడు.. లాలూ సన్నిహితుడి అరెస్టు -
అరుణ్ గోయల్ రాజీనామ
-
ఈసీ గోయల్ రాజీనామా
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపించిన వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. శనివారం సాయంత్రం ఆయన రాజీనామా చేయడం, ఆ వెంటనే దాన్ని రాష్ట్రపతి ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. గోయల్ పదవీకాలం 2027 డిసెంబర్ దాకా ఉంది. పైగా 2025 ఫిబ్రవరిలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ రిటైరయ్యాక గోయలే సీఈసీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మూడున్నరేళ్ల ముందే ఆయన రాజీనామా చేయడానికి కారణాలేమిటన్నది తెలియరాలేదు. మరో కమిషనర్ అనూప్ చంద్ర పాండే గత ఫిబ్రవరిలోనే రిటైరయ్యారు. ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర ఎన్నికల సంఘంలో అప్పటినుంచీ ఒక స్థానం ఖాళీగానే ఉంది. ఇప్పుడు గోయల్ కూడా తప్పుకోవడంతో కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లు రాజీనామా చేయడం ఇది తొలిసారేమీ కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన పలు కేసుల్లో ఈసీ తీసుకున్న నిర్ణయాలపై నాటి ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా తీవ్ర అసమ్మతి తెలిపారు. అనంతరం 2020 ఆగస్టులో రాజీనామా చేశారు. తొలుత ఒక్కరే... ఎన్నికల సంఘంలో తొలుత సీఈసీ ఒక్కరే ఉండేవారు. ఆయన అపరిమిత అధికారాలు చలాయిస్తున్నారన్న అభిప్రాయాల నేపథ్యంలో ఈసీలో మరో ఇద్దరు కమిషనర్లను నియమిస్తూ 1989లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. అప్పట్నుంచి ఈసీ తీసుకునే నిర్ణయాల్లో మెజారిటీ అభిప్రాయమే చెల్లుబాటవుతూ వస్తోంది. గోయల్ నియామకమూ వివాదమే... అరుణ్ గోయల్ 1985 పంజాబ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా ఆయన నియామకమూ వివాదాస్పదంగానే జరిగింది. 2022 నవంబర్ 18న గోయల్ స్వచ్ఛంద పదవీ విరమణ చేయగా అదే రోజు కేంద్రం ఆమోదించింది. ఆ మర్నాడే ఈసీగా నియమించింది. దీన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఇదేం నియామకమంటూ విచారణ సందర్భంగా కోర్టు కూడా ఆశ్చర్యపోయింది. గోయల్ స్వచ్ఛంద పదవీ విరమణ, ఈసీ నియామక ఫైళ్లు మెరుపు వేగంతో కదలడం, మొత్తం ప్రక్రియ 24 గంటల్లోపే పూర్తవడంపై విస్మయం వెలిబుచి్చంది. అంత వేగంగా ఎందుకు నియమించాల్సి వచి్చందని కేంద్రాన్ని నిలదీసింది కూడా. ఇప్పుడేం జరగనుంది...? ఈసీ సభ్యుల ఎన్నిక ప్రక్రియకు అనుసరిస్తున్న 1991 నాటి చట్టానికి కీలక మార్పుచేర్పులు చేస్తూ కేంద్రంలోని మోదీ సర్కారు ఇటీవల కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, కమిషనర్ల (నియామకం, పదవీ నిబంధనలు, పదవీకాలం) చట్టం తెచ్చింది. దీని ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవికి కేంద్ర న్యాయ మంత్రి సారథ్యంలోని సెర్చ్ కమిటీ ముందుగా ఐదు పేర్లను షార్ట్ లిస్ట్ చేస్తుంది. వారిలోంచి ఒకరిని ప్రధాని సారథ్యంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. కమిటీలో ప్రధానితో పాటు ఒక కేంద్ర మంత్రి, లోక్‌సభలో విపక్ష నేత సభ్యులుగా ఉంటారు. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ప్రధాని తనకు అనుకూలమైన వారినే ఎన్నికల కమిషనర్లుగా నియమించుకునేందుకు ఇది వీలు కలి్పస్తోందంటూ దుయ్యబట్టాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీలో రెండు ఖాళీల భర్తీ అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త చట్టం ప్రకారమే ముందుకు వెళ్లవచ్చన్న అభిప్రాయాలు విని్పస్తున్నాయి. -
ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందర.. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఆ రాజీనామాను ఆమోదించారు. అరుణ్ గోయల్ పదవీకాలం 2027 వరకు ఉండగా.. ఇంత ముందుగానే ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్‌తో పాటు మరో ఇద్దరు కమిషనర్లు సభ్యులుగా ఉంటారన్నది తెలిసిందే. అయితే అనూప్ చంద్ర పాండే ఫిబ్రవరిలో పదవీ కాలం పూర్తి చేసుకుని దిగిపోయారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానం భర్తీ చేసేందుకు కసరత్తులు కొనసాగుతున్నాయి. ఈలోపు అరుణ్ గోయల్ కూడా రాజీనామా చేయడంతో ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మాత్రమే మిగిలారు. తాజా రాజీనామా పరిణామంతో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంపై ఏమైనా ప్రభావం పడుతుందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీల భర్తీ ఓ ప్రక్రియను అనుసరించి జరుగుతుంది. సీఈసీ అండ్ ఓఈసీ యాక్ట్ Chief Election Commissioner and Other Election Commissioners (Appointment, Conditions of Service and Term of Office) Act, 2023 ప్రకారం.. న్యాయ శాఖ మంత్రి నేతృత్వంలోని కమిటీ(ఇద్దరు కేంద్ర కార్యదర్శులు కూడా సభ్యులుగా ఉంటారు) ఐదుగురు పేర్లతో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రధాని నేతృత్వంలోని కమిటీకి (ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన స్వతంత్ర ఎంపిక కమిటీ) అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఖాళీ భర్తీ చేయడం కోసం ఈ కమిటీ భేటీ కావాల్సి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు రెండు ఖాళీల నేపథ్యంలో ముందుకు వెళ్తుందా? అనేది చూడాలి. గోయల్ ఎన్నికల కమిషనర్ ఎంపికనే వివాదం అరుణ్ గోయల్ పంజాబ్ కేడర్‌కు చెందిన 1985 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. 2022 నవంబర్ 18వ తేదీన ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆ తర్వాతి రోజే ఆయన్ని ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. ఈ నియామకంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ అరుణ్ గోయల్ నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ క్రమంలో.. కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్‌ను ఎందుకంత వేగంగా నియమించారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను ‘మెరుపు వేగం’తో ఆమోదించడంపై సర్వోన్నత న్యాయస్థానం పెదవి విరిచింది. 24 గంటలు కూడా గడవకముందే మొత్తం నియామక ప్రక్రియ ఎలా పూర్తి చేశారని రాజ్యాంగ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సంబంధిత వార్త: సీఈసీ, ఈసీ నియామకాలపై సుప్రీం అసహనం ‘ఇదేం నియామకం? ఇక్కడ మేం అరుణ్ గోయల్ సామర్థ్యాలను ప్రశ్నించట్లేదు. నియామక ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాం. గోయల్ ఫైల్‌ను ఎందుకంత హడావుడిగా, వేగంగా ఆమోదించాల్సి వచ్చింది. ఫైల్ మొదలుపెట్టిన రోజే అపాయింట్మెంట్ ఎలా జరిగింది. ఈసీ పదవి కోసం నలుగురి పేర్లను షార్ట్‌లిస్ట్ చేసిన న్యాయశాఖ నవంబరు 18న ఆ ఫైల్‌ను ప్రధాని కార్యాలయానికి పంపించింది. అదే రోజున ప్రధాని ఒక పేరును ప్రతిపాదించారు. నలుగురి పేర్లను సిఫార్సు చేస్తే... వారిలో చిన్నవాడైన అరుణ్ గోయల్ పేరును ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు. దీనికి అనుసరించిన పద్ధతి ఏంటీ?’’ అని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. సుప్రీం ప్రశ్నలకు అటార్నీ జనరల్ స్పందిస్తూ.. ‘‘ఎన్నికల కమిషనర్ ఎంపిక ప్రక్రియలో ఎక్కడా తప్పు జరగలేదు. గతంలో కూడా 12 నుంచి 24 గంటల్లో నియామకాలు జరిగిన సందర్భాలున్నాయి. న్యాయశాఖ ప్రతిపాదించిన నాలుగు పేర్లను డీఓపీటీ డేటాబేస్ నుంచే తీసుకున్నారు. ఆ వివరాలన్నీ బహిరంగంగానే అందుబాటులో ఉన్నాయి. ఇక, పేరు ఎంపిక సమయంలో సీనియార్టీ, పదవీ విరమణ వయసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వయసుకు బదులుగా బ్యాచ్ ఆధారంగా సీనియార్టీని పరిగణిస్తారు’’ అని బదులిచ్చారు. అయితే ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ ఎంపికను కొట్టేయలేమని చెబుతూనే.. ఆ పిటిషన్‌ను ఆ సమయంలో రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు తీసుకోవడం గమనార్హం. -
..‘ఎస్ సర్’లే సీఈసీలా?!
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పలు కీలక సందేహాలు లేవనెత్తింది. ‘‘కేంద్రంలో అధికారంలో ఉండే ప్రతి పార్టీ ఎలాగోలా దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలని భావిస్తుంది. అందుకోసం అన్ని విషయాల్లోనూ తను చెప్పిన దానికి ‘ఎస్ సర్’ అనేవారినే సీఈసీగా నియమించుకునే ఆస్కారముంది’’ అని పేర్కొంది. ప్రస్తుత నియామక వ్యవస్థ అందుకు వీలు కల్పిస్తోందంటూ న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆక్షేపించింది. ఓవైపు ఈ అంశంపై తమ విచారణ కొనసాగుతుండగానే ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్‌ను ఎలా నియమిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీని వెనక వేరే రహస్య ఉద్దేశాలేమీ లేవు కదా అంటూ నిలదీసింది. ‘‘సీఈసీ, ఈసీల నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్లపై గత గురువారం నుంచి మేం విచారణ జరుపుతున్నాం. ఓవైపు అది కొనసాగుతుండగానే కేంద్ర సర్వీసులో కొనసాగుతున్న ఐఏఎస్ అధికారిని ముందస్తుగా రిటైర్ చేయించి మరీ ఈసీగా ఎందుకు నియమించాల్సి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాం. గోయల్ నియామక ఫైలును పరిశీలన నిమిత్తం మాకు సమర్పించండి’’ అని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ఆర్.వెంకటరమణి ఇందుకు తీవ్రంగా అభ్యంతరాలు వెలిబుచ్చినా వాటిని తోసిపుచ్చింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈసీలు, సీఈసీ నియామకాలకు కొలీజియం తరహా వ్యవస్థ ఉండాలంటూ దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు మంగళవారం వాదనలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అవి బుధవారం రోజంతా కొనసాగాయి. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవాలంటే అందులోకి నియామకాలను తొలి దశలోనే పూర్తిస్థాయిలో తనిఖీ చేసే వ్యవస్థ ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అంశంపై ధర్మాసనానికి, కేంద్రం తరఫున వాదించిన ఏజీ వెంకటరమణికి మధ్య సుదీర్ఘ వాదోపవాదాలు జరిగాయి. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి 1991 నాటి చట్టం పూర్తి రక్షణ కల్పిస్తోందని ఏజీ వాదించారు. ‘దినేశ్ గోస్వామి కమిటీ నివేదిక ఆధారంగా పార్లమెంటు ఆమోదించిన చట్టమిది. కాబట్టి దాని రూపకల్పన వెనక సరైన ఆలోచన చేయలేదని చెప్పలేం. సీఈసీ, ఈసీల జీతభత్యాలు, పదవీకాలం తదితరాలన్నింటికీ రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. కనుక ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరమేదీ లేదు’’ అని స్పష్టం చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శి స్థాయిల్లో ఉన్న అధికారులను ఎలక్షన్ కమిషనర్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. అమల్లో ఉన్న విధానం ప్రకారం వారిలో సీనియర్ అధికారి సీఈసీగా నియమితులవుతారు’’ అని వివరించారు. ‘‘మేం ఆనవాయితీని పాటిస్తున్నాం. అలాగాకుండా సీఈసీ నియామకానికి జాతీయ స్థాయిలో ఎన్నికలు పెట్డం సాధ్యం కాదు’’ అన్నారు. ఈ వ్యవస్థ సరిగా పని చేయడం లేదని చెప్పడం తమ ఉద్దేశం కాదని ధర్మాసనం పేర్కొంది. అందుకు పారదర్శక వ్యవస్థ ఉండాలన్నది మాత్రమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. ‘‘కేంద్రం ఒకవేళ తమ భావజాలమే ఉన్న, తాము చెప్పిన దానికల్లా తలూపే వ్యక్తిని సీఈసీగా నియమిస్తే? అందుకే సీఈసీ నియామక ప్రక్రియపై మేం మరింతంగా దృష్టి సారించాలనుకుంటున్నాం. అందులో సీజేఐనీ చేరిస్తే బాగుంటుంది’’ అని పేర్కొంది. గోయల్‌పై వాదోపవాదాలు ఈసీగా గోయల్ నియామకంపై వాడివేడి వాదనలు సాగాయి. ఓవైపు ఈ కేసులో విచారణ జరుగుతుండగానే కేంద్రం హడావుడిగా ఆయనను నియమించిందని పిటిషనర్ అనూప్ బరన్వాల్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘గోయల్ గురువారం దాకా కేంద్రంలో కార్యదర్శి స్థాయి అధికారిగా కొనసాగారు. ఉన్నట్టుండి ఆయనకు వీఆర్ఎస్ ఇచ్చి శుక్రవారానికల్లా ఈసీగా నియమించారు’’ అని గుర్తు చేశారు. తనకు తెలిసినంత వరకూ వీఆర్ఎస్ ఆమోదానికి మూడు నెలలు పడుతుందని జస్టిస్ జోసెఫ్ అన్నారు. గోయల్ ఆయన నియామక ఫైలును సమర్పించాలన్న ఆదేశించారు. దీనిపై ఏజీ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘విచారణ జరుగుతున్నది ఈసీలు, సీఈసీ నియామకాలకు సంబంధించిన విస్తృతమైన అంశం మీద. అలాంటప్పుడు ప్రశాంత్ భూషణ్ తెరపైకి తెచ్చిన ఈ వ్యక్తిగత నియామకాన్ని ఎలా పరిశీలనకు తీసుకుంటారు? దీనికి నేను తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నా. విచారణ మధ్యలో ఇలా నియామక ఫైలును కోర్టు చూడటంపై చాలా అభ్యంతరాలున్నాయి’’ అన్నారు. వాటిని ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘మేం విచారణ మొదలు పెట్టిన తర్వాత నవంబర్ 19న గోయల్ నియామకం జరిగింది. దానికి కారణమేమిటో తెలుసుకోవడానికే ఫైలు చూడాలనుకుంటున్నాం. నియామకం పూర్తిగా నిబంధనలకు లోబడే జరిగిందని మీరంటున్నారు. దాన్నే మేం పరిశీలించదలచాం. నియామకంలో అక్రమాలేవీ జరగని పక్షంలో మీరు భయపడాల్సిందేముంది? రేపట్లోగా సంబంధిత ఫైలును మా ముందుంచాల్సిందే’’ అని స్పష్టం చేసింది. ‘‘ఫైలును సమర్పిస్తారా, లేదా? దాన్ని బయట పెట్టొద్దనుకుంటుంటే అదే విషయం చెప్పండి. మీరు (ఏజీ) గనక బిజీగా ఉంటే ఫైలును మాకు సమర్పించాల్సిందిగా ఇంకెవరికైనా పురమాయించండి’’ అని జస్టిస్ జోసెఫ్ అన్నారు. ఈసీగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన గోయల్ 2025లో రాజీవ్‌కుమార్ రిటైర్మెంట్ అనంతరం సీఈసీ కానున్నారు. ఆయన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా డిసెంబర్ 31 దాకా పదవిలో కొనసాగాల్సి ఉండగా ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నారు. మనకిప్పుడో శేషన్ కావాలి! సీఈసీ, ఈసీల నియామకం విషయంలో రాజ్యాంగం మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా దుర్వినియోగం చేసుకుంటూ వస్తున్నాయంటూ మంగళవారం విచారణ సందర్భంగా ధర్మాసనం అసహనం వెలిబుచ్చడం తెలిసిందే. ఇదో అవాంఛిత పోకడ అంటూ ఆక్షేపించింది. వారి నియామకానికి ఎలాంటి ప్రక్రియనూ ఆర్టికల్ 324 నిర్దేశించని విషయాన్ని గుర్తు చేసింది. ఇందుకోసం చట్టం చేయాలని రాజ్యాంగం నిర్దేశించినా 72 ఏళ్లుగా ఆ పని చేయలేదంటూ తప్పుబట్టింది. ‘‘2004 నుంచి ఒక్క సీఈసీ కూడా ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు. ఇక పదేళ్ల యూపీఏ పాలనలో ఏకంగా ఆరుగురు సీఈసీలు మారారు. ప్రస్తుత ఎన్డీఏ ఎనిమిదేళ్ల పాలనలో ఏకంగా 8 మంది మారారు’’ అంటూ ఆక్షేపించింది. గట్టి వ్యక్తిత్వమున్న టి.ఎన్.శేషన్ వంటివారు సీఈసీగా రావాలని తాము కోరుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ప్రధానిపై ఆరోపణలొస్తే.. సీఈసీ చర్యలు తీసుకోగలరా? ప్రధాని స్థాయి వ్యక్తితో సీఈసీ తలపడాల్సిన పరిస్థితి తలెత్తితే? అందుకాయన సిద్ధపడతారా, ససేమిరా అంటారా? మీకేమనిపిస్తోంది? ప్రధానిపై సీఈసీ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే... ఆయన ఏ చర్యలూ తీసుకోలేదనుకుందాం. అప్పుడది వ్యవస్థ పూర్తిగా కుప్పకూలినట్టు కాదా? అందుకే సీఈసీకి రాజకీయ ప్రభావం నుంచి సంపూర్ణ రక్షణ తప్పనిసరి. – సుప్రీంకోర్టు ధర్మాసనం సీఈసీ, ఈసీలను పార్టీల ప్రభావం నుంచి దూరంగా ఉంచాలి. అప్పుడే వాళ్లు స్వతంత్రంగా పని చేయగలరు. ఇది జరగాలంటే సీఈసీ ఎంపికలో భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా భాగస్వామిని చేయాలి. అప్పుడే కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని నిలుపుకుంటూ ఒత్తిళ్లకు అతీతంగా బాధ్యతలు నెరవేర్చగలుగుతుంది. – సుప్రీం ధర్మాసనం -
Election Commissioner: నచ్చినవాడికి ఇచ్చేద్దామా?
నిష్పక్షపాతంగా వ్యవహరించడమే కాదు, వ్యవహరించినట్టు కనిపించడం కూడా అంతే ముఖ్యం. కానీ, ప్రజాస్వామ్యానికి పునాది లాంటి ఎన్నికలు, వాటిని నిర్వహిస్తున్న మన ఎన్నికల వ్యవస్థ అలానే ఉన్నాయా? ఎన్నికల సంఘానికి పెద్ద అయిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల (ఈసీల) నియామక ప్రక్రియ నిష్పాక్షికంగా, న్యాయబద్ధంగా జరుగుతోందా? దేశ సర్వోన్నత న్యాయస్థానం మంగళ, బుధవారాల్లో అన్న మాటలు, అడిగిన ఫైళ్ళు చూశాక సహజంగానే ఈ ప్రశ్నలు అడగాల్సినవే అనిపిస్తాయి. సీఈసీ, ఈసీల వ్యవస్థ రాజకీయ, ప్రభుత్వ జోక్యాలకు అతీతంగా ఉండేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యలు ఆలోచన రేపుతున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి చోట్ల కూడా ఎన్నికల సంఘ నియామకాలు, చట్టాలు పారదర్శకంగా ఉంటే 72 ఏళ్ళ తర్వాతా మన వద్ద ఆ పరిస్థితి లేకపోవడం విషాదమే. ఈ నెల 18న స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి అరుణ్ గోయెల్‌ను ఆ వెంటనే 19వ తేదీన ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వ పెద్దలు నియమించడం సైతం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మామూలుగా అయితే, ఈ ఏడాది ఆఖరుకు రిటైరవ్వాల్సిన వ్యక్తికి హఠాత్తుగా స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చి, ఇలా ఎన్నికల సంఘంలో నియుక్తం చేయడంలో అంతా సవ్యంగానే జరిగిందా అన్నది ప్రశ్న. అది తెలుసుకొనేందుకే సుప్రీమ్ కోర్ట్ ఇప్పుడు అరుణ్ గోయెల్ నియామకం సహా నిర్ణీత ఫైళ్ళను పంపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం. అధికార పార్టీలు తమకు నచ్చిన ప్రభుత్వ ఉన్నతాధికారులను సీనియారిటీ ప్రాతిపదికన ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్న విధానం తప్పనేది ప్రాథమికంగా పిటిషనర్ల వాదన. సీఈసీల నియామకంలోనూ కొలీజియమ్ తరహా విధానాన్ని పాటించాలని అభ్యర్థన. ఎన్నికల కమిషనర్ల నియామకం పూర్తిగా పాలకుల ఇష్టారాజ్యమైందన్నది చేదు నిజం. సుప్రీమ్ అన్నట్టు – క్యాబినెట్ నియమించిన సీఈసీ, ఈసీలు ఏ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికో వ్యతిరేకంగా నోరు విప్పగలరా అన్నది అనుమానమే. గణాంకాలు చూస్తే రాజ్యాంగం అమలులోకి వచ్చాక తొలి 46 ఏళ్ళలో (1950 –1996) సీఈసీగా వ్యవహరించింది పట్టుమని పది మందే! ఆ తర్వాత గత 26 ఏళ్ళలో ఇప్పటికి 15 మంది వచ్చారు, పోయారని కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 2004 తర్వాత ఏ ఒక్కరూ పూర్తి ఆరేళ్ళ పదవీకాలం లేరు. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ సారథ్య యూపీఏ అయినా, బీజేపీ నేతృత్వ ఎన్డీఏ అయినా ఇదే దుఃస్థితి. స్వల్పకాలమే ఉంటున్న ఈ ఎన్నికల పెద్దలు అనుకున్నది చేయగలరా? ఏ మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలరు? సుప్రీమ్ ప్రశ్న కూడా ఇదే! దేశంలో తొలిసారిగా ఎన్నికల సంఘం గురించి సామాన్యులకు తెలిసింది – ఎన్నికల కమిష నర్గా శేషన్ సంస్కరణలు సాగించిన కాలంలోనే. ఇవాళ్టి ఓటర్ గుర్తింపుకార్డులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రవేశపెట్టిందీ ఆయనే. శేషన్ తర్వాత లింగ్డో లాంటి కొందరు నిర్భయంగా ఎన్నికల సంఘం అధికారాలను వినియోగించినా, గత దశాబ్దిన్నరలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడా ఎన్నికల వ్యయంపై నియంత్రణ లేకుండా పోయింది. ఇటీవలి మునుగోడు ఉప ఎన్నిక సహా అనేకచోట్ల మద్యం ఏరులై పారుతూ, కోట్లకొద్దీ నోట్ల కట్టలు తెగుతూ, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నా, ఎన్నికల సంఘం చేష్టలుడిగి చూస్తోంది. శేషన్ నాటికీ, నేటికీ అధికా రాల్లో మార్పు లేకపోయినా అంకితభావంలో మార్పు వచ్చింది. పదవీప్రసాద ప్రభుభక్తి పెరిగింది. రాజ్యాంగంలోని 324వ అధికరణం ఈసీల నియామక ప్రక్రియను వివరించలేదు. దానిపై పార్లమెంట్ చట్టం చేస్తుందని భావించింది. ఇన్నేళ్ళుగా అది జరగలేదు. తాజా కేసులోనూ సర్కారు 1991 నాటి చట్టాన్నీ, అలాగే రాష్ట్రపతికి ప్రధాని సారథ్యంలోని మంత్రివర్గ సిఫార్సుల పైనే నియా మకాలు జరుగుతున్న పూర్వోదాహరణల్నీ అడ్డుపెట్టుకుంటోంది. లా కమిషన్ సైతం కొలీజియమ్, లేదా ప్రధాని, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన సెలక్షన్ కమిటీయే ఈసీలం దర్నీ నియమించాలని 2015 నివేదికలో పేర్కొంది. కొలీజియమా, కమిటీయా అన్నది పక్కన పెడితే ఈసీల నియామక ప్రక్రియలో తక్షణ సంస్కరణలు అవసరం. అయితే, దీనికి పార్లమెంట్ ఆమోదంతో రాజ్యాంగ సవరణ చేయాలి. అందుకు మన పాలకులెంత సిద్ధం ఉంటారో చెప్పలేం. అసలైనా అధికారంలోని వారి అభీష్టమైన ఈసీల నియామకంపై జడ్జీలు జోక్యం చేసుకోవడమే మిటనేది ప్రభుత్వ అనుకూల వర్గాల వాదన. ధర్మాన్ని నిలబెట్టాల్సిన న్యాయవ్యవస్థ సైతం దృష్టి సారించరాదంటే తప్పొప్పులు దిద్దేదెవరు? రాష్ట్ర విభజన జరిగాక ఏపీకి తొలి ఈసీగా నియుక్తులైన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ లాంటి వారు బాధ్యత మరిచి, పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించడం తాజా ఉదాహరణే. ఇక, ఈసీల నియామకంపై వ్యాఖ్యానించిన సుప్రీమ్ తన సొంత జడ్జీల నియామక ప్రక్రియపై విమర్శలకు స్పందించదేమన్నది కొందరి విమర్శ. కొలీజియమ్ వ్యవస్థ ఆసరాగా ప్రధాన న్యాయమూర్తులు మెచ్చినవారినే జడ్జీలుగా నియమిస్తున్నారనీ, ఈ నియామకాల్లో పారద ర్శకత లేదనీ ఆరోపణ. న్యాయశాఖ మంత్రీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పాలంటే, ఎన్నికల సంఘంలోనైనా, న్యాయవ్యవస్థలోనైనా నియామకాలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరపాలి. తటస్థ వ్యవస్థలుంటేనే విశ్వాసం బలపడుతుంది. ప్రజాస్వామ్య పరిపుష్టి సాధ్యమవుతుంది. -
కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్
న్యూఢిల్లీ: గుజరాత్లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గా రిటైర్డ్ బ్యూరోక్రాట్ అరుణ్ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించినట్టు న్యాయ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. కాగా 1985 బ్యాచ్‌కు చెందిన(పంజాబ్ క్యాడర్) రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్.. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనుప్‌చంద్రపాడేతో కలిసి త్రిసభ్య కమిషన్‌లో చేరనున్నారు. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ఈ ఏడాది మే 15న పదవీ విరమణ చేయడంతో ఆ బాధ్యతలు రాజీవ్‌కుమార్‌కు అప్పగించారు. పోల్ ప్యానెల్లో అప్పటి నుంచి ఇద్దరు సభ్యుల సంఘంగా ఉంది. చదవండి: భారత ఆర్మీని పెళ్లికి ఆహ్వానించిన నవజంట.. సైన్యం రిప్లై ఇదే.. -
దెబ్బతిన్న డీఎన్ఏపై పరిశోధనలు
సాక్షి, సంగారెడ్డి: దెబ్బతిన్న లేదా పాడైన డీఎన్ఏను సరిచేసే (మరమ్మతు) ప్రొటీన్ పనివిధానాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) పరిశోధకులు ఆవిష్కరించారు. ఈ అధ్యయన ఫలితాలు పీర్–రివ్యూ జర్నల్ ‘న్యూక్లియిక్ యాసిడ్ రీసెర్చ్’లో ప్రచురితమైనట్లు ఐఐటీహెచ్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గువాహటి ఐఐటీ బయో సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ అరుణ్‌గోయెల్ సహకారంతో ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. జర్నల్‌లో వచ్చిన డాక్యుమెంట్‌ను అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనింద్యారాయ్, డాక్టర్ అరుణ్‌గోయెల్, మోనిషామోహన్, ఆకుల దీప, అరుణ్ థిల్లాన్‌లు సంయుక్తంగా రచించినట్లు తెలిపారు. శరీరంలో సహజంగా ఉత్పత్తయ్యే కొన్ని రకాల రసాయనాలు డీఎన్ఏకు నష్టాన్ని కలిగిస్తాయని డాక్టర్ అనింద్యారాయ్ వివరించారు. ఈ సమస్యకు సత్వరం చికిత్స చేయకపోతే మరణం వరకు దారితీస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే దెబ్బతిన్న డీఎన్ఏకు చికిత్స చేయడానికి పరిశోధనలు చేపట్టినట్లు వివరించారు. ఈ పరిశోధనలకు భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, సైన్స్ అండ్ రీసెర్చ్ ఇంజనీరింగ్ బోర్డు (ఎస్ఈఆర్బీ) నిధులను సమకూరుస్తున్నట్లు తెలిపారు. డీఎన్ఏకి ఏదైనా నష్టం జరిగితే కేన్సర్ వంటి వ్యాధులకు ఈ మార్పులు దారితీస్తాయన్నారు. -
జీఎస్టీ కౌన్సిల్ అదనపుకార్యదర్శిగా అరుణ్ గోయల్
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ అదనపు కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి అరుణ్ గోయల్ నియమితులయ్యారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) అమలుకోసం కొత్తగా సృష్టించిన కౌన్సిల్ అడిషనల్ సెక్రటరీ నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించిందనీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. గోయల్, కేంద్ర పాలిత ప్రాంతాలు కేడర్‌కు కు చెందిన 1985 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. చెందిన ప్రస్తుత ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ లో పని అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో కౌన్సిల్ పన్ను రేటు, మినహాయింపు వస్తువులు మరియు ప్రారంభ పరిమితిని నిర్ణయించడంక తప్పనిసరి. ఏకీకృత పన్ను వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన జీఎస్టీ అమలు కోసం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కౌన్సిల్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.