సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందర.. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఆ రాజీనామాను ఆమోదించారు. అరుణ్ గోయల్ పదవీకాలం 2027 వరకు ఉండగా.. ఇంత ముందుగానే ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్‌తో పాటు మరో ఇద్దరు కమిషనర్లు సభ్యులుగా ఉంటారన్నది తెలిసిందే. అయితే అనూప్ చంద్ర పాండే ఫిబ్రవరిలో పదవీ కాలం పూర్తి చేసుకుని దిగిపోయారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానం భర్తీ చేసేందుకు కసరత్తులు కొనసాగుతున్నాయి. ఈలోపు అరుణ్ గోయల్ కూడా రాజీనామా చేయడంతో ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మాత్రమే మిగిలారు. తాజా రాజీనామా పరిణామంతో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంపై ఏమైనా ప్రభావం పడుతుందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీల భర్తీ ఓ ప్రక్రియను అనుసరించి జరుగుతుంది. సీఈసీ అండ్ ఓఈసీ యాక్ట్ Chief Election Commissioner and Other Election Commissioners (Appointment, Conditions of Service and Term of Office) Act, 2023 ప్రకారం.. న్యాయ శాఖ మంత్రి నేతృత్వంలోని కమిటీ(ఇద్దరు కేంద్ర కార్యదర్శులు కూడా సభ్యులుగా ఉంటారు) ఐదుగురు పేర్లతో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రధాని నేతృత్వంలోని కమిటీకి (ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన స్వతంత్ర ఎంపిక కమిటీ) అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఖాళీ భర్తీ చేయడం కోసం ఈ కమిటీ భేటీ కావాల్సి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు రెండు ఖాళీల నేపథ్యంలో ముందుకు వెళ్తుందా? అనేది చూడాలి.
గోయల్ ఎన్నికల కమిషనర్ ఎంపికనే వివాదం
అరుణ్ గోయల్ పంజాబ్ కేడర్‌కు చెందిన 1985 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. 2022 నవంబర్ 18వ తేదీన ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆ తర్వాతి రోజే ఆయన్ని ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. ఈ నియామకంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ అరుణ్ గోయల్ నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.
ఈ క్రమంలో.. కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్‌ను ఎందుకంత వేగంగా నియమించారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను ‘మెరుపు వేగం’తో ఆమోదించడంపై సర్వోన్నత న్యాయస్థానం పెదవి విరిచింది. 24 గంటలు కూడా గడవకముందే మొత్తం నియామక ప్రక్రియ ఎలా పూర్తి చేశారని రాజ్యాంగ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
సంబంధిత వార్త: సీఈసీ, ఈసీ నియామకాలపై సుప్రీం అసహనం
‘ఇదేం నియామకం? ఇక్కడ మేం అరుణ్ గోయల్ సామర్థ్యాలను ప్రశ్నించట్లేదు. నియామక ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాం. గోయల్ ఫైల్‌ను ఎందుకంత హడావుడిగా, వేగంగా ఆమోదించాల్సి వచ్చింది. ఫైల్ మొదలుపెట్టిన రోజే అపాయింట్‌మెంట్ ఎలా జరిగింది. ఈసీ పదవి కోసం నలుగురి పేర్లను షార్ట్‌లిస్ట్ చేసిన న్యాయశాఖ నవంబరు 18న ఆ ఫైల్‌ను ప్రధాని కార్యాలయానికి పంపించింది. అదే రోజున ప్రధాని ఒక పేరును ప్రతిపాదించారు. నలుగురి పేర్లను సిఫార్సు చేస్తే... వారిలో చిన్నవాడైన అరుణ్ గోయల్ పేరును ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు. దీనికి అనుసరించిన పద్ధతి ఏంటీ?’’ అని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.
సుప్రీం ప్రశ్నలకు అటార్నీ జనరల్ స్పందిస్తూ.. ‘‘ఎన్నికల కమిషనర్ ఎంపిక ప్రక్రియలో ఎక్కడా తప్పు జరగలేదు. గతంలో కూడా 12 నుంచి 24 గంటల్లో నియామకాలు జరిగిన సందర్భాలున్నాయి. న్యాయశాఖ ప్రతిపాదించిన నాలుగు పేర్లను డీఓపీటీ డేటాబేస్ నుంచే తీసుకున్నారు. ఆ వివరాలన్నీ బహిరంగంగానే అందుబాటులో ఉన్నాయి. ఇక, పేరు ఎంపిక సమయంలో సీనియార్టీ, పదవీ విరమణ వయసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వయసుకు బదులుగా బ్యాచ్ ఆధారంగా సీనియార్టీని పరిగణిస్తారు’’ అని బదులిచ్చారు. అయితే ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ ఎంపికను కొట్టేయలేమని చెబుతూనే.. ఆ పిటిషన్‌ను ఆ సమయంలో రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు తీసుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment