సాక్షి, అనకాపల్లి: ఓ అక్కా.. ఓ చెల్లి.. ఓ అవ్వా.. ఓ తాతా అంటూ ఒకటో తేదీన ఉదయాన్నే తలుపు తట్టి చిరునవ్వుతో ఫించన్ అందించే పరిస్థితికి బ్రేక్ పడింది. సీఎం జగన్ ఆలోచనల్లోంచి పుట్టి.. ఎండనకా వాననకా, ఆఖరికి కరోనాను సైతం లెక్క చేయకుండా నాలుగన్నరేళ్లు నిర్విరామంగా విధులు నిర్వహించారు వలంటీర్లు. అలాంటి వ్యవస్థకు ఆటంకాలు కలగజేయాలని కుట్ర కార్యరూపం దాల్చింది. పెన్షన్‌దారులు మండుటెండలో మళ్లీ క్యూలు కట్టాల్సిన పరిస్థితిని తెచ్చి పెట్టింది.
2019 అక్టోబర్ 2వ తేదీన పురుడుపోసుకున్న వలంటీర్ వ్యవస్థ ఇప్పుడు రాష్ట్రంలో బలంగా పాతుకుపోయింది. రెండున్నల లక్షల మందికిపైగా వలంటీర్లు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందటంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సుమారు 530 సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధాన కర్తలుగా, సంక్షేమ వారధులుగా వలంటీర్లను సీఎం జగన్ అభివర్ణిస్తుంటారు. అయితే..
ఈ నాలుగున్నరేళ్లలో వలంటీర్లను మానసికంగా వేధించే ప్రయత్నాలు జరిగాయి. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, పలువురు టీడీపీ నేతలు.. ప్రజా సేవకులపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. అయినా అవమానాల్ని దిగమింగుకుని తమ సేవల్ని వలంటీర్లు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు.. ఈసీ కోడ్ పేరుతో తమ విధులకు విఘాతం కలిగించడాన్ని వలంటీర్లు భరించలేకపోతున్నారు.
ఈ ఉదయం పెందుర్తి నియోజకవర్గంలో 23 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తానం గ్రామ వలంటీర్లు సాక్షితో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలలోకి తీసుకునే వెళ్ళే అదృష్టం సీఎం జగన్ మాకు ఇచ్చారు. కానీ, మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు మమ్మల్ని అనేక విధాలుగా మానసికంగా హింసించారు. పేదలకు, లబ్ధిదారులకు సేవ చేస్తుంటే.. స్లీపర్ సెల్స్ అని అపవాదు చేశారు. ఇప్పుడు ఇలా విధులకు ఆటంకాలు విధించారు. మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. అప్పుడే విధుల్లో చేరతాం’’ అని వలంటీర్లు శపథం చేశారు. ‘ ఏపీ ప్రజలు అన్ని చూస్తున్నారు.. మళ్లీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపించుకునే దిశగా అడుగులేస్తున్నారు’ అని వలంటీర్లు చెబుతున్నారిప్పుడు. పెందుర్తి పరిధిలోనే కాదు.. రాష్ట్రంలో పలుచోట్ల వలంటీర్లు స్వచ్ఛందంగా తమ విధులకు రాజీనామా చేస్తున్నట్లు తెలస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment