న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పలు కీలక సందేహాలు లేవనెత్తింది. ‘‘కేంద్రంలో అధికారంలో ఉండే ప్రతి పార్టీ ఎలాగోలా దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలని భావిస్తుంది. అందుకోసం అన్ని విషయాల్లోనూ తను చెప్పిన దానికి ‘ఎస్ సర్’ అనేవారినే సీఈసీగా నియమించుకునే ఆస్కారముంది’’ అని పేర్కొంది. ప్రస్తుత నియామక వ్యవస్థ అందుకు వీలు కల్పిస్తోందంటూ న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆక్షేపించింది.
ఓవైపు ఈ అంశంపై తమ విచారణ కొనసాగుతుండగానే ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్‌ను ఎలా నియమిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీని వెనక వేరే రహస్య ఉద్దేశాలేమీ లేవు కదా అంటూ నిలదీసింది. ‘‘సీఈసీ, ఈసీల నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్లపై గత గురువారం నుంచి మేం విచారణ జరుపుతున్నాం. ఓవైపు అది కొనసాగుతుండగానే కేంద్ర సర్వీసులో కొనసాగుతున్న ఐఏఎస్ అధికారిని ముందస్తుగా రిటైర్ చేయించి మరీ ఈసీగా ఎందుకు నియమించాల్సి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాం. గోయల్ నియామక ఫైలును పరిశీలన నిమిత్తం మాకు సమర్పించండి’’ అని కేంద్రాన్ని ఆదేశించింది.
కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ఆర్.వెంకటరమణి ఇందుకు తీవ్రంగా అభ్యంతరాలు వెలిబుచ్చినా వాటిని తోసిపుచ్చింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈసీలు, సీఈసీ నియామకాలకు కొలీజియం తరహా వ్యవస్థ ఉండాలంటూ దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు మంగళవారం వాదనలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అవి బుధవారం రోజంతా కొనసాగాయి. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవాలంటే అందులోకి నియామకాలను తొలి దశలోనే పూర్తిస్థాయిలో తనిఖీ చేసే వ్యవస్థ ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఈ అంశంపై ధర్మాసనానికి, కేంద్రం తరఫున వాదించిన ఏజీ వెంకటరమణికి మధ్య సుదీర్ఘ వాదోపవాదాలు జరిగాయి. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి 1991 నాటి చట్టం పూర్తి రక్షణ కల్పిస్తోందని ఏజీ వాదించారు. ‘దినేశ్ గోస్వామి కమిటీ నివేదిక ఆధారంగా పార్లమెంటు ఆమోదించిన చట్టమిది. కాబట్టి దాని రూపకల్పన వెనక సరైన ఆలోచన చేయలేదని చెప్పలేం. సీఈసీ, ఈసీల జీతభత్యాలు, పదవీకాలం తదితరాలన్నింటికీ రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. కనుక ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరమేదీ లేదు’’ అని స్పష్టం చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శి స్థాయిల్లో ఉన్న అధికారులను ఎలక్షన్ కమిషనర్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది.
అమల్లో ఉన్న విధానం ప్రకారం వారిలో సీనియర్ అధికారి సీఈసీగా నియమితులవుతారు’’ అని వివరించారు. ‘‘మేం ఆనవాయితీని పాటిస్తున్నాం. అలాగాకుండా సీఈసీ నియామకానికి జాతీయ స్థాయిలో ఎన్నికలు పెట్డం సాధ్యం కాదు’’ అన్నారు. ఈ వ్యవస్థ సరిగా పని చేయడం లేదని చెప్పడం తమ ఉద్దేశం కాదని ధర్మాసనం పేర్కొంది. అందుకు పారదర్శక వ్యవస్థ ఉండాలన్నది మాత్రమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. ‘‘కేంద్రం ఒకవేళ తమ భావజాలమే ఉన్న, తాము చెప్పిన దానికల్లా తలూపే వ్యక్తిని సీఈసీగా నియమిస్తే? అందుకే సీఈసీ నియామక ప్రక్రియపై మేం మరింతంగా దృష్టి సారించాలనుకుంటున్నాం. అందులో సీజేఐనీ చేరిస్తే బాగుంటుంది’’ అని పేర్కొంది.
గోయల్‌పై వాదోపవాదాలు
ఈసీగా గోయల్ నియామకంపై వాడివేడి వాదనలు సాగాయి. ఓవైపు ఈ కేసులో విచారణ జరుగుతుండగానే కేంద్రం హడావుడిగా ఆయనను నియమించిందని పిటిషనర్ అనూప్ బరన్వాల్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘గోయల్ గురువారం దాకా కేంద్రంలో కార్యదర్శి స్థాయి అధికారిగా కొనసాగారు. ఉన్నట్టుండి ఆయనకు వీఆర్‌ఎస్ ఇచ్చి శుక్రవారానికల్లా ఈసీగా నియమించారు’’ అని గుర్తు చేశారు. తనకు తెలిసినంత వరకూ వీఆర్‌ఎస్ ఆమోదానికి మూడు నెలలు పడుతుందని జస్టిస్ జోసెఫ్ అన్నారు. గోయల్ ఆయన నియామక ఫైలును సమర్పించాలన్న ఆదేశించారు. దీనిపై ఏజీ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు.
‘‘విచారణ జరుగుతున్నది ఈసీలు, సీఈసీ నియామకాలకు సంబంధించిన విస్తృతమైన అంశం మీద. అలాంటప్పుడు ప్రశాంత్ భూషణ్ తెరపైకి తెచ్చిన ఈ వ్యక్తిగత నియామకాన్ని ఎలా పరిశీలనకు తీసుకుంటారు? దీనికి నేను తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నా. విచారణ మధ్యలో ఇలా నియామక ఫైలును కోర్టు చూడటంపై చాలా అభ్యంతరాలున్నాయి’’ అన్నారు. వాటిని ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘మేం విచారణ మొదలు పెట్టిన తర్వాత నవంబర్ 19న గోయల్ నియామకం జరిగింది. దానికి కారణమేమిటో తెలుసుకోవడానికే ఫైలు చూడాలనుకుంటున్నాం. నియామకం పూర్తిగా నిబంధనలకు లోబడే జరిగిందని మీరంటున్నారు. దాన్నే మేం పరిశీలించదలచాం.
నియామకంలో అక్రమాలేవీ జరగని పక్షంలో మీరు భయపడాల్సిందేముంది? రేపట్లోగా సంబంధిత ఫైలును మా ముందుంచాల్సిందే’’ అని స్పష్టం చేసింది. ‘‘ఫైలును సమర్పిస్తారా, లేదా? దాన్ని బయట పెట్టొద్దనుకుంటుంటే అదే విషయం చెప్పండి. మీరు (ఏజీ) గనక బిజీగా ఉంటే ఫైలును మాకు సమర్పించాల్సిందిగా ఇంకెవరికైనా పురమాయించండి’’ అని జస్టిస్ జోసెఫ్ అన్నారు. ఈసీగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన గోయల్ 2025లో రాజీవ్‌కుమార్ రిటైర్మెంట్ అనంతరం సీఈసీ కానున్నారు. ఆయన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా డిసెంబర్ 31 దాకా పదవిలో కొనసాగాల్సి ఉండగా ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నారు.
మనకిప్పుడో శేషన్ కావాలి!
సీఈసీ, ఈసీల నియామకం విషయంలో రాజ్యాంగం మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా దుర్వినియోగం చేసుకుంటూ వస్తున్నాయంటూ మంగళవారం విచారణ సందర్భంగా ధర్మాసనం అసహనం వెలిబుచ్చడం తెలిసిందే. ఇదో అవాంఛిత పోకడ అంటూ ఆక్షేపించింది. వారి నియామకానికి ఎలాంటి ప్రక్రియనూ ఆర్టికల్ 324 నిర్దేశించని విషయాన్ని గుర్తు చేసింది. ఇందుకోసం చట్టం చేయాలని రాజ్యాంగం నిర్దేశించినా 72 ఏళ్లుగా ఆ పని చేయలేదంటూ తప్పుబట్టింది. ‘‘2004 నుంచి ఒక్క సీఈసీ కూడా ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు. ఇక పదేళ్ల యూపీఏ పాలనలో ఏకంగా ఆరుగురు సీఈసీలు మారారు. ప్రస్తుత ఎన్డీఏ ఎనిమిదేళ్ల పాలనలో ఏకంగా 8 మంది మారారు’’ అంటూ ఆక్షేపించింది. గట్టి వ్యక్తిత్వమున్న టి.ఎన్.శేషన్ వంటివారు సీఈసీగా రావాలని తాము కోరుకుంటున్నట్టు స్పష్టం చేసింది.
ప్రధానిపై ఆరోపణలొస్తే.. సీఈసీ చర్యలు తీసుకోగలరా?
ప్రధాని స్థాయి వ్యక్తితో సీఈసీ తలపడాల్సిన పరిస్థితి తలెత్తితే? అందుకాయన సిద్ధపడతారా, ససేమిరా అంటారా? మీకేమనిపిస్తోంది? ప్రధానిపై సీఈసీ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే... ఆయన ఏ చర్యలూ తీసుకోలేదనుకుందాం. అప్పుడది వ్యవస్థ పూర్తిగా కుప్పకూలినట్టు కాదా? అందుకే సీఈసీకి రాజకీయ ప్రభావం నుంచి సంపూర్ణ రక్షణ తప్పనిసరి.
– సుప్రీంకోర్టు ధర్మాసనం
సీఈసీ, ఈసీలను పార్టీల ప్రభావం నుంచి దూరంగా ఉంచాలి. అప్పుడే వాళ్లు స్వతంత్రంగా పని చేయగలరు. ఇది జరగాలంటే సీఈసీ ఎంపికలో భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా భాగస్వామిని చేయాలి. అప్పుడే కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని నిలుపుకుంటూ ఒత్తిళ్లకు అతీతంగా బాధ్యతలు నెరవేర్చగలుగుతుంది.
– సుప్రీం ధర్మాసనం
Comments
Please login to add a commentAdd a comment