న్యూఢిల్లీ: కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకం చేపట్టవద్దని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్)అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం(మార్చ్ 15) విచారించనుంది. ఫిబ్రవరిలో ఎన్నికల కమిషనర్ అనూప్‌చంద్ర పాండే రిటైర్ అవడం, ఇటీవలే మరో ఎన్నికల కమిషనర్ అరుణ్‌గోయెల్ ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేయడంతో లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎన్నికల కమిషన్‌లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి.
ఈ రెండు ఖాళీలను నింపేందుకు ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఈ వారంలోనే సమావేశమవనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏడీఆర్ వేసిన పిటిషన్‌ను లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఈ కమిటీలో ప్రధాని, కేంద్ర మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్షనేత సభ్యులుగా ఉంటారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) కమిటీలో సభ్యుడిగా ఉండగా కొత్త చట్టంలో ఆయన స్థానంలో కేంద్రమంత్రికి అవకాశం కల్పించారు. అయితే ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తప్పించిన తర్వాత తొలిసారి ఈసీలను కేంద్రం ఎంపిక చేస్తుండటంతో ఏడీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు చెప్పనుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
కాగా, లోక్‌సభ ఎన్నిలకు త్వరలో షెడ్యూల్ వెలువడనుండగా ఎన్నికల కమిషనర్ అరుణ్‌గోయెల్ ఇటీవల ఆకస్మికంగా రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. సీఈసీతో ఉన్న విభేదాల కారణంగానే గోయెల్ తన పదవికి రాజీనామా చేశారన్న ప్రచారం జరిగింది. అరుణ్‌గోయెల్ ఆకస్మిక రాజీనామాతో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.
Comments
Please login to add a commentAdd a comment