ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య కొలీజియంపై విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరో వివాదాస్పద బిల్లును మోదీ సర్కార్ గురువారం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించింది. ఆయన స్థానంలో కేబినెట్ మంత్రికి స్థానం కల్పించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఎన్నికల సంఘంపై కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు లభిస్తాయి.
కేంద్రం ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చే వరకు ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తు లతో కూడిన త్రిసభ్య కమిటీ సీఈసీ, ఇతర కమిషనర్ల నియామకాలు చేపడుతుందని గత మార్చిలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీజేఐను తప్పించి కేబినెట్ మంత్రిని చేర్చడం వివాదానికి దారితీసింది.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ రాజ్యసభలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్‌మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీసు) బిల్లు, 2023ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధానమంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని నామినేట్ చేసిన కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఆ కమిటీయే సీఈసీ, ఈసీలను ఎంపిక చేస్తుంది. కాంగ్రెస్, ఆప్ ఇతర విపక్ష పార్టీ సభ్యుల ఆందోళనల మధ్య ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
సుప్రీం తీర్పుని లెక్క చేయరా ?
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వుల్ని నీరు కార్చేలా ఈ బిల్లు ఉందని విపక్షాలు విమర్శించాయి. కమిటీ నుంచి సీజేఐని తప్పించడం అత్యంత ప్రమాదకరమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలపై ఇది ప్రభావం చూపిస్తుందని అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పులేమైనా బీజేపీకి నచ్చకపోతే వాటిని లెక్క చేయదని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం మొత్తాన్ని ప్రధాని మోదీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఆరోపించారు. కమిటీలో ఇద్దరు బీజేపీకి చెందినవారే ఉంటే నిష్పాక్షికంగా కమిషనర్ల ఎంపిక ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.
వచ్చే ఏడాది ఈసీలో ఖాళీ
కేంద్ర ఎన్నికల కమిషన్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఖాళీ ఏర్పడనుంది. ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండేకి 65 ఏళ్లు నిండనుండడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న పదవీ విరమణ చేస్తారు. 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్ది రోజుల ముందే ఆయన పదవీ విరమణ చేస్తారు.
ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలి. తాము చెప్పినట్టు వినే కమిషనర్‌ను నియమించుకొని ఎన్నికల కమిషన్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవడానికే కేంద్రం ఇదంతా చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సుప్రీం కోర్టు ఉత్తర్వుల కంటే ముందు కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించే వారు.
Comments
Please login to add a commentAdd a comment