
సాక్షి, సంగారెడ్డి: దెబ్బతిన్న లేదా పాడైన డీఎన్‌ఏను సరిచేసే (మరమ్మతు) ప్రొటీన్ పనివిధానాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) పరిశోధకులు ఆవిష్కరించారు. ఈ అధ్యయన ఫలితాలు పీర్–రివ్యూ జర్నల్ ‘న్యూక్లియిక్ యాసిడ్ రీసెర్చ్’లో ప్రచురితమైనట్లు ఐఐటీహెచ్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గువాహటి ఐఐటీ బయో సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ అరుణ్‌గోయెల్ సహకారంతో ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. జర్నల్‌లో వచ్చిన డాక్యుమెంట్‌ను అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనింద్యారాయ్, డాక్టర్ అరుణ్‌గోయెల్, మోనిషామోహన్, ఆకుల దీప, అరుణ్ థిల్లాన్‌లు సంయుక్తంగా రచించినట్లు తెలిపారు.
శరీరంలో సహజంగా ఉత్పత్తయ్యే కొన్ని రకాల రసాయనాలు డీఎన్‌ఏకు నష్టాన్ని కలిగిస్తాయని డాక్టర్ అనింద్యారాయ్ వివరించారు. ఈ సమస్యకు సత్వరం చికిత్స చేయకపోతే మరణం వరకు దారితీస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే దెబ్బతిన్న డీఎన్‌ఏకు చికిత్స చేయడానికి పరిశోధనలు చేపట్టినట్లు వివరించారు. ఈ పరిశోధనలకు భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, సైన్స్ అండ్ రీసెర్చ్ ఇంజనీరింగ్ బోర్డు (ఎస్‌ఈఆర్‌బీ) నిధులను సమకూరుస్తున్నట్లు తెలిపారు. డీఎన్‌ఏకి ఏదైనా నష్టం జరిగితే కేన్సర్ వంటి వ్యాధులకు ఈ మార్పులు దారితీస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment