దానిపై క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు... పోలింగ్ కేంద్రమెక్కడో, ఎలా వెళ్లాలో తెలుసుకోవచ్చు
తమ భవిష్యత్‌ను నిర్ణయించే పాలకులను ఎన్నుకోవడంలో కీలకమైన ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో ప్రజల్లో నిర్లిప్లత కనిపిస్తుంటుంది. చాలామంది చిన్న చిన్న ఇబ్బందుల కారణంగా ఓటేసేందుకు ఆసక్తి చూపించరు. ఫలితంగా లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా 70 శాతం ఓటింగ్ కూడా నమోదు కాలేదు!
పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో ఓటింగ్ మరీ తక్కువగా నమోదవుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు, మరింత మందిని పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంటోంది. వీటికి తోడు ఓటరు స్లిప్‌లపై క్యూఆర్ కోడ్‌లు ముద్రిస్తోంది. పోలింగ్ బూత్ ఎక్కడుంది మొదలుకుని ఓటింగ్‌కు సంబంధించిన సమస్త సమాచారాన్నీ కోడ్ సాయంతో ఇట్టే తెలుసుకోవచ్చు.
స్కాన్ చేస్తే పూర్తి సమాచారం
ఓటర్ స్లిప్‌లపై ఉండే క్యూఆర్ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్ చేస్తే చాలు.. ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో చెబుతుంది. అక్కడికెలా వెళ్లాలో కూడా గూగుల్ మ్యాప్ సాయంతో చూపిస్తుంది. ఇటీవలి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరు పరిధిలో క్యూఆర్‌తో కూడిన ఓటర్ స్లిప్‌ల కారణంగా ఓటింగ్ బాగా పెరిగినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికార మనోజ్‌కుమార్ మీనా వెల్లడించారు.
బెంగళూరు టీచర్స్ కాలనీ అసెంబ్లీ స్థానంలో 2020లో 66 శాతం నమోదైన పోలింగ్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 86 శాతానికి పెరిగిందన్నారు. ‘‘చాలామంది ఓటర్లకు పోలింగ్ బూత్ ఎక్కడ ఉందో తెలియడం లేదు. ముఖ్యంగా పట్టణాల్లో ఈ పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ భవనాలెక్కడున్నదీ తెలియకపోవడం ఇందుకు ప్రధాన కారణం. క్యూఆర్ కోడ్ దీనికి పరిష్కారం. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో 80 శాతానికి పైగా ఓటర్లకు క్యూఆర్ కోడ్ ఆధారిత ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేశాం’’ అని ఆయన వివరించారు.
డిజిటల్ ఓటర్ స్లిప్
2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ స్లిప్‌లను ‘ఓటర్ హెల్ప్‌లైన్’ యాప్ ద్వారా డిజిటల్‌గా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఎన్నికల సంఘం కలి్పంచడం విశేషం. పోలింగ్ కేంద్రంలో సిబ్బంది డెస్క్ వరకు ఫోన్లను తీసుకెళ్లి ఈ డిజిటల్ ఓటర్ స్లిప్‌ను చూపించేందుకు అనుమతించారు. భవిష్యత్‌లో ఎన్నికలు మరింత డిజిటల్‌గా మారనున్నాయనేందుకు ఇది మరో సంకేతం.
ఆకర్షించే ఏర్పాట్లు
ఓటర్లను మరింతగా ఆకర్షించేందుకు ఈ విడత చాలా రాష్ట్రాల్లో థీమ్ ఆధారిత పోలింగ్ బూత్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కేవలం మహిళా సిబ్బందితో కూడిన కేంద్రాలు, 30 ఏళ్లలోపు వయసున్న అధికారులతో యూత్ పోలింగ్ కేంద్రాలు, గిరిజన ప్రాంతాల్లో వారి ఇళ్లను పోలిన పోలింగ్ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నారు. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో పోలింగ్ కనాకష్టంగా 50 శాతం దాటుతుండటం తెలిసిందే.
ఇలా చాలా తక్కువ ఓటింగ్ నమోదవుతున్న ప్రాంతాలపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా ప్రాంతాలకు బృందాలను పంపించి ఓటర్లలో చైతన్యానికి చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సాయం కూడా తీసుకుంటోంది. బూత్ వద్ద చాంతాడంత క్యూలు చూసి అంతసేపు లైన్లో ఉండాలా అని చాలామంది అనుకుంటారు. దీనికి విరుగుడుగా పోలింగ్ బూత్ వద్ద క్యూను ఇంటి నుంచే మొబైల్‌లో తెలుసుకునేలా యాప్‌లను ఈసీ అభివృద్ధి చేసింది.
ఆ బూత్‌ల సమీపంలో వాహనాల పార్కింగ్ వసతులున్నాయా, లేదంటే సమీపంలో ఎక్కడ పార్క్ చేసుకోవచ్చు వంటి సమాచారం కూడా వాటిలో అందుబాటులోకి తెచి్చంది. నడవలేని వృద్ధుల కోసం ఈ యాప్‌ల నుంచి వీల్‌చైర్ కూడా బుక్ చేసుకోవచ్చు. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి అర్హతలు, అఫిడవిట్‌లో సమాచారం, వారిపై ఏవైనా క్రిమినల్ కేసులు నమోదయ్యాయా? ఆస్తులు, అప్పులు తదితర పూర్తి సమాచారాన్నీ తెలుసుకోవచ్చు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment