సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎంపీలు పనుల పంపకాల్లో బిజీబిజీ అయ్యారు. కేడర్‌ను కాపాడుకునేందుకు వారికి కాంట్రాక్టు పనులు కట్టబెడుతున్నారు. నాలుగున్నరేళ్లపాటు ఆచితూచి అరకొరగా పనులు ప్రతిపాదించిన పార్లమెం ట్ సభ్యులు ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడటంతో ఆగమేఘాలపై ఎంపీ లాడ్స్ నిధులను వెచ్చిస్తున్నారు. గ్రామస్థాయి నాయకులతోపాటు, ద్వితీయ శ్రేణి నేతలకు పనులను కేటాయిస్తున్నారు.
ఎన్నికల్లో గట్టెక్కేందుకు అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నారు. మరో పక్షం రోజుల్లో ‘కోడ్’ అమలులోకి రానుంది. దీంతో కొత్తగా పనులకు మంజూరు లభించే అవకాశాలు లేవు. దీంతో జిల్లాకు చెందిన ఎంపీలు రాథోడ్ రమేష్, జి.వివేక్ ఒక్కసారిగా పనులు ప్రతిపాదించడంతో ఎంపీడీవోలు తలలు పట్టుకుంటున్నారు.
40 పనులకు రాథోడ్ రమేష్ తాజా ప్రతిపాదనలు
తెలంగాణ ఏర్పాటు విషయంలో చంద్రబాబు సమన్యాయం, రెండు కళ్ల సిద్ధాంతంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు చాలా మంది పార్టీకి దూరమయ్యారు. మిగిలిన కాస్త కేడర్‌ను కాపాడుకునే పనిలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు తలమునకలయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి ఇటీవల రూ.69.25 లక్షలు అంచనా వ్యయం కలిగిన 40 అభివృద్ధి పనులు అప్పగించారు.
ఈ మేరకు ఆయన పంపిన ప్రతిపాదనలకు ఈనెల 7న కలెక్టర్ అహ్మద్‌బాబు ఆమోదముద్ర వేశారు. ప్రొసిడింగ్ నెం.ఐ/10/ఎంపీ లాడ్స్ లోక్‌సభ కింద రూ.69.25 లక్షల పనులకు 60 శాతం నిధులు రూ.41.55 లక్షలు ఆయా మండలాల ఎంపీడీవోలకు విడుదల చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఊట్నూర్, జన్నారం, ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, తలమడుగు, కడెం, దిలావర్‌పూర్, గుడిహత్నూర్, లక్ష్మణచాంద మండలాల పరిధిలోని గ్రామాల్లో చిన్నచిన్న కాంట్రాక్టు పనులను నేతలకు, కార్యకర్తలకు అప్పగించనున్నారు. సీసీ రోడ్లు, మట్టి రోడ్లు, తాగునీటి పథకాలకు బోర్‌వెల్‌లు, కమ్యూనిటీ హాళ్లు, కల్వర్టుల నిర్మాణం వంటి పనులు తాజా ప్రతిపాదనల్లో ఉన్నాయి.
రూ.కోటి పనులకు వివేక్
పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ కూడా తాజాగా రూ.1.01 కోట్ల విలువ చేసే 62 పనులకు ప్రతిపాదనలు పంపారు. తాజాగా శుక్రవారం వీటికి పరిపాలన అనుమతి లభించింది. పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే లక్సెట్టిపేట, దండేపల్లి, చెన్నూరు, జైపూర్, మందమర్రి మండలాల పరిధిలో రూ.82 లక్షల అంచనా వ్యయం కలిగిన 43 అభివృద్ధి పనులకు, రూ.28.91 లక్షలు అంచనా వ్యయం కలిగిన మరో 19 పనులు మంజూరయ్యాయి. ఇందులో దాదాపు అన్ని పనులు రూ.లక్ష, రూ.2 లక్షల లోపు అంచనా వ్యయం కలిగిన పనులే ఉండటం గమనార్హం.
పనుల పంపకాలు
Published Wed, Feb 12 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement