కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల జాతరకు బుధవారం నగారా మోగనుంది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 5న షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారమే బుధవారం అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం జిల్లాలోని రెండు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాలకు నా మినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 9 వరకు అంటే ఎనిమిది రోజులపాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. ఏప్రిల్ 10న పరిశీలన, 12న ఉపసంహరణ, 30న పోలింగ్ నిర్వహిస్తారు. వచ్చే నెల మే 16న ఫలి తాలు ప్రకటిస్తారు. కాగా, రెండు రోజుల క్రితమే మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికలు పార్టీలకు ప్రధానం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుం డడంతో జిల్లా రాజకీయం ఒక్కసారి వేడెక్కుతోంది.
రిటర్నింగ్ అధికారుల నియామకం
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం ఉదయం విడుదల కానుంది. ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఎన్నికల నోటిఫికేషన్ కలెక్టర్ అహ్మద్ బాబు విడుదల చేయనుండగా, మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో ఆయా రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అనంతరం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాగా, ఇప్పటికే సబ్ కలెక్టర్‌తోపాటు ఆయా ఆర్డీవోలను నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. అసెంబ్లీ నియోజకవర్గం నామినేషన్లు ఆయా రిటర్నింగ్ అధికారులు నియోజకవర్గ స్థాయిలో స్వీకరించనున్నారు. ఎంపీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థుల నుంచి కలెక్టర్ నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకు నామినేషన్ల స్వీకరణకు కలెక్టరేట్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు కానుంది. ఇందుకోసం అధికారులు ఆయా నియోజకవర్గాలవారీగా సర్వం సిద్ధం చేశారు.
పార్టీలకు ప్రతిష్టాత్మకం
జిల్లాలో పది అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్, సిర్పూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో 19,18,267 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 9.60 లక్షల మంది పురుషులు ఉండగా, 9.57 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నెల 30న జరగబోయే సార్వత్రిక ఎన్నికలు పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ఇక ఎన్నికల జాతర ఊపందుకోనుంది. ఎన్నికల నిర్వహణకు కొన్ని రోజులుగా కసరత్తు చేసిన జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పోలింగ్ ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది.
జిల్లా వ్యాప్తంగా 2,256 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 2,500 ట్రిపుల్ ఐటీ విద్యార్థులను వినియోగించనున్నారు. నోటిఫికేషన్ విడుదల కానుండడంతో ఆయా పోలింగ్ కేంద్రాలకు గోదాము నుంచి ఈవీఎంలు తీసుకెళ్లనున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
నేడే ‘సార్వత్రిక’ నోటిఫికేషన్
Published Wed, Apr 2 2014 2:00 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement