general election notification
-
నేడే ‘సార్వత్రిక’ నోటిఫికేషన్
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల జాతరకు బుధవారం నగారా మోగనుంది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 5న షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారమే బుధవారం అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం జిల్లాలోని రెండు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాలకు నా మినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 9 వరకు అంటే ఎనిమిది రోజులపాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. ఏప్రిల్ 10న పరిశీలన, 12న ఉపసంహరణ, 30న పోలింగ్ నిర్వహిస్తారు. వచ్చే నెల మే 16న ఫలి తాలు ప్రకటిస్తారు. కాగా, రెండు రోజుల క్రితమే మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికలు పార్టీలకు ప్రధానం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుం డడంతో జిల్లా రాజకీయం ఒక్కసారి వేడెక్కుతోంది. రిటర్నింగ్ అధికారుల నియామకం సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం ఉదయం విడుదల కానుంది. ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఎన్నికల నోటిఫికేషన్ కలెక్టర్ అహ్మద్ బాబు విడుదల చేయనుండగా, మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో ఆయా రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అనంతరం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాగా, ఇప్పటికే సబ్ కలెక్టర్‌తోపాటు ఆయా ఆర్డీవోలను నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. అసెంబ్లీ నియోజకవర్గం నామినేషన్లు ఆయా రిటర్నింగ్ అధికారులు నియోజకవర్గ స్థాయిలో స్వీకరించనున్నారు. ఎంపీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థుల నుంచి కలెక్టర్ నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకు నామినేషన్ల స్వీకరణకు కలెక్టరేట్లో ప్రత్యేక విభాగం ఏర్పాటు కానుంది. ఇందుకోసం అధికారులు ఆయా నియోజకవర్గాలవారీగా సర్వం సిద్ధం చేశారు. పార్టీలకు ప్రతిష్టాత్మకం జిల్లాలో పది అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్, సిర్పూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో 19,18,267 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 9.60 లక్షల మంది పురుషులు ఉండగా, 9.57 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నెల 30న జరగబోయే సార్వత్రిక ఎన్నికలు పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ఇక ఎన్నికల జాతర ఊపందుకోనుంది. ఎన్నికల నిర్వహణకు కొన్ని రోజులుగా కసరత్తు చేసిన జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పోలింగ్ ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 2,256 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 2,500 ట్రిపుల్ ఐటీ విద్యార్థులను వినియోగించనున్నారు. నోటిఫికేషన్ విడుదల కానుండడంతో ఆయా పోలింగ్ కేంద్రాలకు గోదాము నుంచి ఈవీఎంలు తీసుకెళ్లనున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. -
ఇన్నాళ్లూ ఏం చేశారో?
చేతినిండా నిధులున్నా.. మురికి కూపాలుగా మారిన రోడ్లు కళ్లముందున్నా ఇన్నాళ్లూ వారికి పట్టలేదు.. ఏ అభివృద్ధి పనీ చేపట్టాలన్న ఆలోచనా రాలేదు.. నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా కళ్లు తెరిచారు. మంత్రిగారి సూచనో, నిధులు వెనక్కి పోతాయన్న భయమో కానీ పనులు ప్రారంభించేయాలని నిర్ణయించారు. అవి పూర్తయినా, కాకపోయినా తర్వాత సంగతి.. ముందు అమాత్యుడితో కొబ్బరికాయ కొట్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదీ తాండూరు మున్సిపాలిటీ అధికారుల తీరు. త్వరలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభివృద్ధి పనులు ప్రారంభింపజేసేందుకు తాండూరు మున్సిపల్ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. నిధులున్నా ఇన్నాళ్లూ మిన్నకున్న అధికారులు తీరా నెల రోజుల గడువే ఉండడంతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వివిధ పథకాల కింద మంజూరైన నిధులతో మున్సిపాలిటీ పరిధిలోని 31 వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు తదితర పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియను పూర్తిచేసిన అధికారులు పనుల శంకుస్థాపనల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పనులకు కొబ్బరికాయలు కొట్టించేస్తే.. పనులు ఎప్పటికైనా పూర్తి చేయవచ్చనే ధోరణి వారిలో కన్పిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే జిల్లా మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా పనులకు శంకుస్థాపనలు చేయించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల్లో మంత్రిని కలిసి అభివృద్ధి పనుల శంకుస్థాపనల తేదీలను ఖరారు చేయనున్నారు. బీఆర్జీఎఫ్, స్టేట్‌ఫైనాన్స్ కమీషన్(ఎస్ఎఫ్సీ), నాన్‌ప్లాన్‌గ్రాంట్ కింద గత ఏడాది నవంబర్లోనే సుమారు రూ.రెండు కోట్లు మంజూరయ్యాయి. బీఆర్జీఎఫ్ కింద సుమారు రూ.36.6లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో తొమ్మిది పనులకుగాను మూడే మొదలయ్యాయి. ఇంకా ఆరు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రూ.1.74కోట్ల ఎస్ఎఫ్సీ నిధులతో 70 పనులు చేయాలి. ఇందులో రూ.34లక్షలతో 26 పనులు జరిగాయి. ఇంకా రూ.1.40కోట్లతో 40 పనులు చేయాల్సి ఉంది. రూ.30లక్షల నాన్‌ప్లాన్‌గ్రాంట్ కింద చేపట్టాల్సిన ఐదు పనులు మిగిలి ఉన్నాయి. ఆయా పనులకు మంత్రి ప్రసాద్‌కుమార్ చేతుల మీదుగా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే శంకుస్థాపనలు చేయించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. షెడ్యూల్ విడుదలైన తర్వాత నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. -
తప్పదు బదిలీ!
మూడేళ్లు పైబడి పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: దీర్ఘకాలికంగా జిల్లాలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌కు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మూడేళ్లకు పైబడి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని కదలించేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఈ మేరకు రెండు రోజులుగా ఏళ్లుగా పనిచే స్తున్న అధికారుల జాబితాను జిల్లా యంత్రాంగం రూపొందించింది. ఎన్నికల విధులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారులనే బదిలీలకు పరిమితం చేసిన ఎన్నికల సంఘం ఈ సారి మాత్రం క్షేత్రస్థాయి అధికారులకు కూడా స్థానచలనం కలిగించాలని ఆదేశాలు జారీ చేసింది. తహసీల్దార్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లపై ఇదివరకే మార్గదర్శకాలు జారీచేసిన ఈసీ.. తాజాగా సబ్ ఇన్స్పెక్టర్లను కూడా బదిలీల జాబితాలో చేర్చింది. ఈ మేరకు రెండు రోజుల్లో జాబితాను పంపాలని నిర్దేశించింది. ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ భన్వర్‌లాల్ నిర్ణయాన్ని వెల్లడించడంతో బదిలీల ప్రక్రియకు తెరలేచింది. వేర్వేరు పోస్టింగ్‌ల్లో పనిచేసినప్పటికీ, జిల్లాలో మూడేళ్లు పనిచేసినవారిపై బదిలీ వేటు వేయాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 17 మంది తహసీల్దార్లను ఎన్నికల వేళ ఇతర ప్రాంతాలకు సాగనంపేందుకు రంగం సిద్ధమైంది. రాజేంద్రనగర్ డిప్యూటీ కలెక్టర్ ముకుందరెడ్డి, సరూర్‌నగర్ ఆర్డీఓ సూర్యారావు కూడా బదిలీల జాబితాలో ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓ) బదిలీ వ్యవహారంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎంపీడీఓల వ్యవహారంలో ఎలా నడుచుకోవాలనే అంశంపై ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీచేస్తామని ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకనుగుణంగా నడుచుకోవాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల క్రతువు మొదలుకానుందనే సంకేతాల నేపథ్యంలో అధికారులు వడివడిగా ఎన్నికల ఏర్పాట్లను చేపడుతున్నారు. రెవెన్యూ అధికారుల బదిలీల జాబితాను కొలిక్కి తెచ్చిన యంత్రా ంగం.. పోలీసుల జాబితాను పంపాలని హోంశాఖకు సూచించింది. జిల్లా యూ నిట్ ప్రామాణికంగా బదిలీల పరంపర కొనసాగిస్తున్నందున.. సైబరాబాద్ కమిషనరేట్, రంగారెడ్డి గ్రామీణ ఎస్పీ పరిధిలో మూడో వంతు అధికారులకు స్థానభ్రంశం కలుగనుంది. బదిలీల జాబి తాలో సీఐ, ఎస్ఐలు కూడా ఉండడంతో సైబరాబాద్, రూరల్ ఎస్పీ పరిధిలోని సింహాభాగం పోలీసు అధికారుల కుర్చీలకు ఎసరు వచ్చింది. ఎన్నికల సంఘం తొలిసారి సబ్ ఇన్స్పెక్టర్లను చేర్చడంతో పోలీసుశాఖలో కలవరం మొదలైంది. -
రాజుకుంటోంది
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే వార్తల నేపథ్యంలో జిల్లాలో రాజకీయం రాజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను గుర్తించేందుకు అధికార పార్టీ పరిశీలకులు శుక్రవారం జిల్లాకు వస్తున్నారు. వీరు మూడు రోజుల పాటు జిల్లా కేంద్రంలో మకాం వేస్తుండటంతో ‘బయోడేటా’లతో ఔత్సాహిక నేతలు సిద్ధమవుతున్నారు. అయితే జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా ఒకటి రెండు రోజుల్లో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ నేతలు విజ్ఞాపనలు సమర్పించనున్నారు. మహారాష్ట్రకు చెందిన శాసన సభ్యులు గడ్డం ఆనందరావు, బస్వరాజ్ పాటిల్‌లు సభ్యులుగా ఉన్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మూడు రోజుల పాటు జిల్లాలో మకాం వేయనుంది. ఈ ఇద్దరు నేతలు సంగారెడ్డి ఐబీ అతిథిగృహం కేంద్రంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేతల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలకులు వినతులు స్వీకరించేలా షెడ్యూలు సిద్ధం చేసినట్లు సమాచారం. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని స్థానాలకు ఆనందరావు, మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని స్థానాలకు బస్వరాజ్ పాటిల్ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల నుంచి టికెట్లు ఆశిస్తున్న ఔత్సాహిక అభ్యర్థులు పరిశీలకులను కలిసి తమ బలాబలాలు, తాము ఏ రకంగా అర్హులమో వివరించే అవకాశం ఉంది. తమ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో పరిశీలకులు హైదరాబాద్‌లో భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పరిశీలకులు సమర్పించే నివేదిక ఆధారంగా ఫిబ్రవరి పదో తేదీలోగా అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం ఓ స్పష్టతకు వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. సుమారు మూడు నెలల క్రితం ఏఐసీసీ పరిశీలకుడు అమర్ కాలే జిల్లాకు వచ్చిన ఔత్సాహిక నేతల నుంచి విజ్ఞాపనలు స్వీకరించిన విషయం తెలిసిందే. సిట్టింగులున్నా పోటాపోటీ ప్రస్తుతం జహీరాబాద్ లోక్‌సభ స్థానంతో పాటు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మెదక్‌లో టీడీపీ, సిద్దిపేటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి ఇతరులకు అవకాశం ఇవ్వడం కష్టమే అయినా తమ వంతు ప్రయత్నాలు చేసేందుకు కొందరు నేతలు సన్నద్ధమవుతున్నారు. మెదక్, సిద్దిపేటతో పాటు పటాన్చెరు, దుబ్బాకలో ఈ రకమైన ప్రయత్నాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీసీ కోటాలో నందీశ్వర్కే మరోమారు అవకాశం ఖాయమనే ప్రచారం వినిపిస్తోంది. అయితే డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి భవిష్యత్ ప్రణాళికపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. దుబ్బాకలో ముత్యంరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నా, ఇతర నేతలు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేసే యోచనలో ఉన్నారు. దుబ్బాక విషయంలో తనకు పార్టీ అధిష్టానం నుంచి అనుకూలత ఉందనే ధీమాలో రఘునందన్ రావు ఉన్నారు. మెదక్‌లో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి మరోమారు టికెట్ ఆశిస్తున్నా పీసీసీ సభ్యుడు సుప్రభాతరావు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎంపీ అభ్యర్థిగా భూపాల్? జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ సురేశ్ షెట్కార్ అభ్యర్థిత్వంపై ఎలాంటి పోటీ ఉండకపోవచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే 2009 ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీ చేసిన నరేంద్రనాథ్ పార్టీని వీడటంతో...డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డికి పార్టీలో అంతర్గత మద్దతు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. టికెట్ ఆశిస్తున్న నేతలంతా పరిశీలకుల ఎదుట వాదన వినిపించేందుకు, బల ప్రదర్శన జరిపేందుకు మద్దతుదారులను సమీకరించుకుంటుండటంతో జిల్లా కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. -
మళ్లీ ఓటరు నమోదు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోని యువతీయువకులకు మళ్లీ అవకాశం లభించనుంది. నవంబర్ 10 నుంచి ఈనెల 23 వరకు జరిగిన ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కాని యువతీయువకులు ఆధైర్యపడాల్సిన అవసరం లేకుండా పొయింది. ప్రతీ ఏటా చేపట్టే సాధారణ నమోదు ప్రక్రియలో భాగంగా ఓటర్ల తుది జాబితా అనంతరం ఓటు నమోదు ప్రక్రియకు మళ్లీ శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. కాగా, ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు ఆన్లైన్ లో డాటా ఎంట్రీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,16,276 దరఖాస్తులు అందాయి. ఇప్పటి వరకు 52,654 దరఖాస్తులను ఆన్లైన్లో పొందుపరిచారు. అన్ని మండల కేంద్రాల్లో ప్రక్రియ కొనసాగుతుంది. ఆన్లైన్లో పొందుపర్చిన దరఖాస్తులను పరిశీలించిన ఓటర్ల తుది జాబితా తయారు చేస్తారు. అనంతరం 2014 జనవరి 16న జాబితాను విడుదల చేయనున్నారు. జనవరి 17 నుంచి సాధారణ ఎన్నికల నోటిషికేషన్ వచ్చే పది రోజుల ముందు వరకు కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో నమోదు చేసుకున్న వారికి వారం రోజుల్లో ఓటరు గుర్తింపు కార్డులు అందనున్నాయి. ఈ ప్రక్రియలో ఓటు నమోదు చేసుకున్న వారు 2014లో జరుగనున్న సాధారణ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి.