మూడేళ్లు పైబడి పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
దీర్ఘకాలికంగా జిల్లాలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌కు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మూడేళ్లకు పైబడి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని కదలించేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఈ మేరకు రెండు రోజులుగా ఏళ్లుగా పనిచే స్తున్న అధికారుల జాబితాను జిల్లా యంత్రాంగం రూపొందించింది. ఎన్నికల విధులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారులనే బదిలీలకు పరిమితం చేసిన ఎన్నికల సంఘం ఈ సారి మాత్రం క్షేత్రస్థాయి అధికారులకు కూడా స్థానచలనం కలిగించాలని ఆదేశాలు జారీ చేసింది. తహసీల్దార్లు, సర్కిల్ ఇన్స్‌పెక్టర్లపై ఇదివరకే మార్గదర్శకాలు జారీచేసిన ఈసీ.. తాజాగా సబ్ ఇన్స్‌పెక్టర్లను కూడా బదిలీల జాబితాలో చేర్చింది. ఈ మేరకు రెండు రోజుల్లో జాబితాను పంపాలని నిర్దేశించింది. ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ భన్వర్‌లాల్ నిర్ణయాన్ని వెల్లడించడంతో బదిలీల ప్రక్రియకు తెరలేచింది. వేర్వేరు పోస్టింగ్‌ల్లో పనిచేసినప్పటికీ, జిల్లాలో మూడేళ్లు పనిచేసినవారిపై బదిలీ వేటు వేయాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 17 మంది తహసీల్దార్లను ఎన్నికల వేళ ఇతర ప్రాంతాలకు సాగనంపేందుకు రంగం సిద్ధమైంది.
రాజేంద్రనగర్ డిప్యూటీ కలెక్టర్ ముకుందరెడ్డి, సరూర్‌నగర్ ఆర్‌డీఓ సూర్యారావు కూడా బదిలీల జాబితాలో ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓ) బదిలీ వ్యవహారంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎంపీడీఓల వ్యవహారంలో ఎలా నడుచుకోవాలనే అంశంపై ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీచేస్తామని ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకనుగుణంగా నడుచుకోవాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల క్రతువు మొదలుకానుందనే సంకేతాల నేపథ్యంలో అధికారులు వడివడిగా ఎన్నికల ఏర్పాట్లను చేపడుతున్నారు. రెవెన్యూ అధికారుల బదిలీల జాబితాను కొలిక్కి తెచ్చిన యంత్రా ంగం.. పోలీసుల జాబితాను పంపాలని హోంశాఖకు సూచించింది. జిల్లా యూ నిట్ ప్రామాణికంగా బదిలీల పరంపర కొనసాగిస్తున్నందున.. సైబరాబాద్ కమిషనరేట్, రంగారెడ్డి గ్రామీణ ఎస్పీ పరిధిలో మూడో వంతు అధికారులకు స్థానభ్రంశం కలుగనుంది. బదిలీల జాబి తాలో సీఐ, ఎస్‌ఐలు కూడా ఉండడంతో సైబరాబాద్, రూరల్ ఎస్పీ పరిధిలోని సింహాభాగం పోలీసు అధికారుల కుర్చీలకు ఎసరు వచ్చింది. ఎన్నికల సంఘం తొలిసారి సబ్ ఇన్స్‌పెక్టర్లను చేర్చడంతో పోలీసుశాఖలో కలవరం మొదలైంది.
తప్పదు బదిలీ!
Published Mon, Jan 20 2014 11:53 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement