telangana: ‘ఇల్లరికం’ పోలీస్‌.. | 70 Percent Police Department Officials Rooted Same District Many Years | Sakshi
Sakshi News home page

telangana: ‘ఇల్లరికం’ పోలీస్‌..

Published Mon, Jan 10 2022 3:04 AM | Last Updated on Mon, Jan 10 2022 8:07 AM

70 Percent Police Department Officials Rooted Same District Many Years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇరు కుటుంబాల స్థితిగతులు, కాబోయే అత్తామామలకు మగ సంతానం లేకపోవడం ఇతరత్రా కారణాలతో కొందరు ఇల్లరికం వెళుతుంటారు. అంటే వివాహానంతరం పెళ్లికూతురు అత్తారింటికి వెళ్లిపోవడం కాకుండా రివర్స్‌లో పెళ్లికొడుకు అత్తారింటికి వెళ్లి అక్కడే స్థిరపడిపోతాడన్నమాట. అచ్చం ఇలాగే కాకపోయినా ఇల్లరికపుటల్లుడు మాదిరి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎక్కువ మంది ఒకే జిల్లాలో పాతుకుపోతున్నారు.

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం ప్రారంభించిన తర్వాత పదోన్నతులు పొందిన అధికారులు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లాల్సి ఉన్నా అలా జరగడం లేదు. జోన్‌లోని ఇతర జిల్లాల్లో పనిచేసే అవకాశం ఉన్నా వెళ్లకుండా అక్కడక్కడే పోస్టింగ్‌లు చేస్తూ స్థానికంగా లభించిన పట్టుతో అక్రమార్జనకు పాకులాడే నేపథ్యంలో వివాదాస్పదమవుతున్నారు. కొత్తగూడెంలోని పాల్వంచలో జరిగిన వనమా రాఘవేంద్రరావు తరహా వ్యవహారాలకు ఇలాంటి అధికారులే పరోక్ష కారణమన్నది బహిరంగ రహస్యం. సిఫారసులతో ఏళ్లకేళ్లుగా అక్కడే ఉంటున్న వీరు.. తమను సిఫారసు చేసిన ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు, కుటుంబీకులు చేసే అరాచకాలకు అందదండలందిస్తున్నారు. 

70 శాతం ఇదే రీతి...
రాష్ట్రంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ.. ఇలా కమిషరేట్లతో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి ఇల్లరికపు అధికారులు వందల మంది ఉన్నారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు అధికారులు జోన్‌లోని తన స్వంత జిల్లా కాకుండా మిగిలిన ఏ జిల్లాలో అయినా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. కానీ అనేకమంది సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా మంచి రెవెన్యూ ఉన్న జిల్లాలను ఎన్నుకోవడం.. అక్కడే రిటైర్మెంట్‌ దాకా పాతుకుపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇలా 70 శాతం మంది పోలీస్‌ అధికారులు ఒకే జిల్లాలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నుంచి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌/ఇన్‌స్పెక్టర్‌ ఆ తర్వాత డీఎస్పీగానూ పదోన్నతి పొంది మళ్లీ అక్కడే పనిచేస్తుండటం గమనార్హం. రాష్ట్ర స్థాయి హోదాలో డీఎస్పీగా తన స్వంత డివిజన్‌ తప్ప ఎక్కడైనా పనిచేసే అవకాశం ఉన్నా తాను గతంలో పని చేసిన జిల్లాలోనే తాను ఎస్‌ఐ, సీఐగా పనిచేసిన సబ్‌డివిజన్‌ డీఎస్పీగా/ఏసీపీలుగానే పనిచేస్తున్నారు. మరికొంత మంది అధికారులైతే ఏకంగా అదనపు ఎస్పీగా కూడా అదే జిల్లాలో ఉంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 

ఆదాయంపై గురి.. అక్రమాలకు దన్ను
ఇలాంటి అధికారులు టౌన్‌కు గరిష్టంగా 20 కిలోమీటర్లు దూరంలోపే పోస్టింగ్‌ తీసుకుంటారు. పైగా కనీస ఆదాయం అంటే తమను సిఫారసు చేసినందుకు ఇచ్చిన సొమ్ముకు రెండు, మూడింతలు వచ్చే పోస్టింగ్‌లో మాత్రమే కొనసాగుతారు. కొంతమంది అధికారులు మైనింగ్‌ కార్యకలాపాలుండే ప్రాంతాల్లో వరుస పోస్టింగ్‌లు తెచ్చుకుంటారు. ఇంకొంత మంది ఇసుక దందా సాగే ప్రాంతాలను ఎంచుకొని మరీ ఆయా ఠాణాల్లోనే పనిచేస్తారు. ఇంకొంత మంది గ్యాబ్లింగ్, వ్యాపార నెలవారీ కమీషన్లు, వైన్స్, బార్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటారు. ఇంకొంత మంది అధికారులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు, సెటిల్‌మెంట్ల కేంద్రంగా సాగే ఏరియా ఠాణాలను టార్గెట్‌ చేసుకొని పోస్టింగ్‌ పొందుతున్నారు. సైబరాబాద్, రాచకొండ ప్రాంతాల్లో సీఐ పోస్టింగ్‌కు సిఫారసు చేసేందుకు సంబంధిత ప్రజాప్రతినిధులు తక్కువలో తక్కువ రూ.20 లక్షలు తీసుకుంటున్నారంటే, ఆ పోస్టులో చేరి వారెంత అక్రమార్జనకు, ఎన్ని అవకతవకలకు పాల్పడతారో అర్ధం చేసుకోవచ్చు. 

దెబ్బతింటున్న పోలీసింగ్‌...
ఎప్పటిప్పుడు అధికారుల మార్పు జరిగితే విధులు అంకితభావంతో పాటు పారదర్శకంగా నిర్వర్తించేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఒకే అధికారి ఏళ్ల పాటు స్టేషన్లు మార్చిమార్చి పోస్టింగ్‌లు చేయడం, పదోన్నతి తర్వాత మళ్లీ అదే అధికారి సూపర్‌విజన్‌ డ్యూటీలోకి రావడం ఇష్టారీతిన జరిగిపోతోంది వనమా రాఘవతో ముడిపడిన ఘటన వంటి ఉదంతాలకు ఇలాంటి అధికారుల వ్యవహారాలే పరోక్షంగా కారణమవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఉమ్మడి కరీంనగర్‌లో 42 మంది సెటిల్‌
►ఉమ్మడి కరీంనగర్‌లో జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్‌ టౌన్‌ స్టేషన్లలో ఎస్‌ఐలుగా పనిచేసిన అధికారులే ఇప్పుడు సీఐలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న ఓ ఏసీపీ అధికారి గతంలో అక్కడే టౌన్‌ ఎస్‌ఐ, రూరల్‌ ఎస్‌ఐ, రూరల్‌ సీఐగా పనిచేశారు. ఇలా 42 మంది అధికారులు ఈ జిల్లాలోనే సెటిల్‌ అయిపోయారు. వీరు స్టేషన్‌ మారడం మినహా మరో జిల్లాకు పోయి పనిచేసింది లేదు. 
►ఉమ్మడి వరంగల్‌లోని హన్మకొండ, కాజీపేట, ఎల్కతుర్తి, పరకాల, మామునూర్, జనగాం, ఘన్‌పూర్, వర్ధన్నపేట మహబూబాబాద్, పాలకుర్తి, భూపాలపల్లి.. ఇలా సబ్‌ డివిజన్లలో ఎస్‌ఐగా, సీఐగా పనిచేసిన అధికారులే ప్రస్తుతం ఏసీపీలుగా, క్రైమ్‌ అధికారులుగా, టాస్క్‌ఫోర్స్, ట్రాఫిక్‌ విభాగాల్లో అధికారులుగా పనిచేస్తున్నారు. 
►ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఖమ్మం టౌన్, కొత్తగూడెం, వైరా, సత్తుపల్లి, మధిర, ఇల్లందు, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు ఆయాసర్కిల్స్‌/సబ్‌డివిజన్లలో ఎస్‌ఐగా పనిచేసిన వారు ఆయా ప్రాంతాల్లోనే సీఐ, డీఎస్పీలుగా ఉన్నారు. 

ఉమ్మడి ఆదిలాబాద్‌లో 70% మంది
►ఉమ్మడి ఆదిలాబాద్‌లో మంచిర్యాల, బెల్లంపల్లి, నిర్మల్, ఆదిలాబాద్‌ రూరల్, భైంసా, ఉట్నూర్‌ సబ్‌ డివిజన్లలో ఎస్‌ఐలుగా పనిచేసిన 70 శాతం మంది అధికారులు ఇప్పుడు అవే ప్రాంతాల్లో సీఐగా, ఆపై స్థాయి పోస్టింగుల్లో కొనసాగుతున్నారు. 
► ఉమ్మడి నిజామాబాద్‌లో హెడ్‌క్వార్టర్స్‌లోని ఠాణాలు, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి, బోధన్, భీమ్‌గల్, డిచ్‌పల్లి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, బిక్నూర్‌ సబ్‌డివిజన్, సర్కిల్లో ఎస్‌ఐలు, సీఐలుగా పనిచేసిన అధికారులు అక్కడే సీఐలు, డీఎస్పీ/ఏసీపీలుగా పనిచేస్తున్నారు. 
► ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో నల్లగొండ హెడ్‌క్వార్టర్‌లోని ఠాణాలు, కోదాడ, సూర్యాపేట, సాగర్, మాల్, చౌటుప్పల్, భువనగిరి, ఆలేరు, హుజూర్‌నగర్, చిట్యాల, మిర్యాలగూడ, దేవరకొండ, తుంగతుర్తి.. ఇలా పలు ఠాణాల్లో ఎస్‌ఐలుగా పనిచేసినవారు ఇప్పుడు సీఐలుగా, మరికొంత మంది డీఎస్పీలుగా అక్కడే పాతుకుపోయారు. 
►ఉమ్మడి మహూబూబ్‌నగర్‌లో హెడ్‌క్వార్టర్స్‌లోని ఠాణాలతో పాటు జడ్చర్ల, నారాయణపేట్, మక్తల్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అమన్‌గల్, అమ్రాబాద్, వనపర్తి, గద్వాల్, దేవరకద్ర.. ఇలా సర్కిల్‌/సబ్‌డివిజన్లలో 60 శాతం అధికారులు ఇంతకుముందు అక్కడక్కడ పనిచేసిన వారే. 
►ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సంగారెడ్డి, జహీరాబాద్, మెదక్, పటాన్‌చెరు, సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్‌ తదితర సర్కిల్, సబ్‌డివిజన్లలో ఎస్‌ఐగా పనిచేసిన వారు ఇప్పుడు అక్కడే సీఐగా, సీఐగా చేసిన వారు డీఎస్పీలుగా పనిచేస్తున్నారు. 
► ఇక సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండలో ఒక పోలీస్‌స్టేషన్‌నుంచి మరో పోలీస్‌స్టేషన్‌కు మార్పు చెందుతున్నారు కానీ కమిషనరేట్‌ను వదిలీ మరో కమిషనరేట్‌ లేదా జిల్లాకు మాత్రం బదిలీ కావడం లేదు. ఇలా ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో 90 శాతం అధికారులు తొలినాళ్లలో అక్కడే పనిచేసి, పదోన్నతి తర్వాత కూడా అక్కడే పనిచేస్తుండటం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement