సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఉన్న ఎర్రవెల్లి గ్రామంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం చేపట్టిన ‘రచ్చబండ’కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఈ కార్యక్రమం గురించి ఆ జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేనైన తనతో చర్చించకుండానే రేవంత్ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నానని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
‘గతంలో ఇలాంటి విషయాలు మీడియా ముందు మాట్లాడొద్దని చెప్పేవారు. కానీ ఇలాంటి కార్యక్రమాల గురించి అందరితో చర్చించి నిర్ణయం తీసుకోకుంటే పార్టీకి నష్టం జరుగుతుంది. అందుకే నేను మీడియా ముందు ప్రకటన చేయాల్సి వచ్చింది’అన్నారు. ‘నాకు తెలియకుండా ప్రకటించిన రచ్చబండలో నేను కనపడకపోతే నా పట్ల రాంగ్ సిగ్నల్ పోతుంది. ఈ హక్కు రేవంత్‌కు ఎవరిచ్చారు’అని ప్రశ్నించారు.
పీసీసీ అంటే అందరినీ విడదీసే పోస్టు కాదు
పీసీసీ అంటే అందరినీ కలుపుకొనిపోయే పోస్టని, విడదీసే పోస్టు కాదని జగ్గారెడ్డి విమర్శించారు. ఇలాంటి కార్యక్రమాలు పీఏసీ మీటింగ్‌లో చర్చించకుండానే ప్రకటిస్తున్నాడని రేవంత్‌పై మండిపడ్డారు. ‘నిలదీస్తే అందరేమో బాధపడుతున్నారు. అంతర్గతంగానేమో ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి’అన్నారు. పార్టీ అంతర్గత విషయాలు మీడియా ముందు ఇలా ప్రకటించడానికి చాలా బాధగా ఉందని చెప్పారు.
ఇలాంటి నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తూ రేపు అధిష్టానానికి లేఖ రాస్తున్నట్టు వెల్లడించారు. తాను ఇన్‌చార్జిగా ఉన్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని నాయకులతో మాట్లాడి ఎక్కడైనా మిగిలిన వరి ధాన్యాల కుప్పలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment