రాష్ట్ర రాజకీయాలు ఈ ఏడాది (2021) మరింత రంజుగా సాగాయి. ఒకట్రెండు ఎదురుదెబ్బలు తగిలినా అధికార టీఆర్‌ఎస్ హవా కొనసాగడం ఓవైపు.. కొత్త పీసీసీ చీఫ్ రాకతో కాంగ్రెస్‌లో ఉత్సాహం, అధిష్టానం అండతో రాష్ట్ర బీజేపీ దూకుడు మరోవైపు వేడి పుట్టించాయి. నాగార్జునసాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, మినీ మున్సిపోల్, ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇలా ఏడాదంతా జరిగిన ఎన్నికల ప్రక్రియ ఈ వేడిని ఎక్కడా తగ్గనివ్వలేదు.
దాదాపు అన్ని ఎన్నికల్లో గులాబీ పార్టీ హవానే కొనసాగినా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక మాత్రం షాకిచ్చింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో కొత్త అధ్యక్షుడి రాకతో పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ అడపాదడపా వివిధ కార్యక్రమాలు, పోరాటాలతో తామూ ఆప్షన్‌గా ఉన్నామని చెప్పుకొనే ప్రయత్నం చేసింది. కానీ ప్రతి ఎన్నికలోనూ ఓటమి ఆ పార్టీని ఎదురుదెబ్బ తీసింది. గత ఏడాది చివరలో దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల విజయాలతో బీజేపీలో వచ్చిన జోష్ ఈ ఏడాదీ కనిపించింది.
పాదయాత్రలు, బహిరంగ సభలు, ఆందోళనలు, ఇతర కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రంలో ఈ మూడు ప్రధానపక్షాలు పోగా.. మిగతా పార్టీల ప్రభావం నామమాత్రంగానే మారిపోయింది. టీటీడీపీ ఉనికి కోల్పోయే పరిస్థితికి చేరగా.. తెలంగాణ జన సమితి, సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్షాల కార్యకలాపాలేమీ పెద్దగా కనిపించలేదు. అయితే 2021లో కొత్త రాజకీయ పార్టీ తెరపైకి వచ్చింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల నేతృత్వంలో వైఎస్సార్‌టీపీ ఏర్పాటైంది.
– సాక్షి, హైదరాబాద్
టీఆర్‌ఎస్ అన్నింటా కారే..
గత ఏడాది చివర్లో దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు చవిచూసిన టీఆర్‌ఎస్.. 2021లో ఒక్క హుజూరాబాద్ ఉప ఎన్నిక మినహా ఏడాదంతా హవా చూపింది. పార్టీని గాడినపెట్టి, మరింత బలోపేతం చేయడంపై టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు, ప్లీనరీ వంటి కార్యాచరణ అమలు చేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గం, ముఖ్య నేతలతో అడపాదడపా సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పార్టీకోసం కృషి చేస్తున్న నేతలకు వరుసగా నామినేటెడ్ పదవులు ఇచ్చారు. పలు అంశాల్లో స్వయంగా తానే ముందుండి పార్టీని నడిపించారు. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్‌ఎస్ కార్యాలయం ‘తెలంగాణ భవన్’కు శంకుస్థాపన చేశారు.
ఊరూరా పార్టీ జెండా పండుగ నిర్వహించి సంస్థాగత కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కరోనా నేపథ్యంలో రెండేళ్లపాటు ఆవిర్భావ వేడుకలు, ప్లీనరీకి దూరంగా ఉన్న టీఆర్‌ఎస్.. అక్టోబర్ 25న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఘనంగా ప్లీనరీ నిర్వహించుకుంది. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా వరుసగా 9వసారి ఎన్నికయ్యారు.
గత ఏడాది చివర్లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు సాధించినా.. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. ఫిబ్రవరి 11న జరిగిన ఎన్నికలో మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత ఎంపికయ్యారు. ఇక ఏప్రిల్‌లో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు మరో ఐదు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం మేయర్, చైర్మన్ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. వరంగల్ మేయర్‌గా మాజీ ఎంపీ గుండు సుధారాణి, ఖమ్మం మేయర్‌గా పునుకొల్లు నీరజ ఎన్నికయ్యారు.
‘సాగర్’లో నిలబడి..
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మరణించడంతో.. ఆ స్థానానికి ఈ ఏడాది ఏప్రిల్ 17న ఉప ఎన్నిక జరిగింది. నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌ను టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఎంపిక చేశారు. తాను స్వయంగా ఒక సభలో పాల్గొని ప్రచారం చేశారు. అక్కడ కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత జానారెడ్డి పోటీలో ఉండటంతో కొంత ఉత్కంఠ నెలకొంది. కానీ పక్కా వ్యూహంతో వ్యవహరించిన కేసీఆర్.. నోముల భగత్‌ను 18,872 ఓట్ల తేడాతో గెలిపించుకున్నారు.
‘ఎమ్మెల్సీ’లన్నీ క్లీన్‌స్వీప్ చేసి..
ఈ ఏడాది ఫిబ్రవరి మొదలుకుని డిసెంబర్ దాకా వేర్వేరు సందర్భాల్లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. ఎన్నిక జరిగిన 21 సీట్లనూ కైవసం చేసుకుంది. రెండు పట్టభద్రుల కోటా సీట్లకు మార్చిలో ఎన్నిక నిర్వహించగా.. ‘నల్లగొండ– వరంగల్– ఖమ్మం’స్థానంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’స్థానంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణీదేవి విజయం సాధించారు.
తర్వాత నవంబర్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. మరోవైపు స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీల్లో 12 మంది సభ్యులు 2022 జనవరి 4న పదవీ విరమణ చేయనుండటంతో.. ఎన్నికల సంఘం డిసెంబర్‌లో ఎన్నిక నిర్వహించింది. టీఆర్‌ఎస్ ఇందులో ఆరు సీట్లను ఏకగ్రీవంగా.. మరో ఆరు సీట్లను పోలింగ్‌లో గెలుచుకుని.. మరోసారి క్లీన్‌స్వీప్ చేసింది.
టీడీపీని ఖాళీ చేసి..
తెలంగాణ అసెంబ్లీకి టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నికవగా.. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గతంలోనే టీఆర్‌ఎస్‌లో చేరారు. టీటీడీపీకి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌రావు (అశ్వారావుపేట) ఏప్రిల్ 7న టీఆర్‌ఎస్‌లో చేరారు. సండ్ర, మెచ్చా లేఖ ఇవ్వడంతో టీడీపీ శాసనసభాపక్షం టీఆర్‌ఎస్‌లో విలీనమైంది. ఇక టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు.
సీనియర్ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, కాంగ్రెస్ నేతలు పాడి కౌశిక్‌రెడ్డి, చల్మెడ లక్ష్మీనర్సింహారావు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు వివిధ సందర్భాల్లో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ, గట్టు రామచందర్‌రావు తదితరులు టీఆర్‌ఎస్‌ను వీడారు.
‘మరో పదేళ్లూ నేనే సీఎం’
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితాల నేపథ్యంలో.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారంటూ వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి 7న తెలంగాణభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక ప్రజాప్రతినిధులు, నేతలతో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆ ప్రచారానికి స్వయంగా చెక్ పెట్టారు.
‘‘శారీరకంగా, ఆలోచనాపరంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. మరో పదేళ్లూ నేనే సీఎంగా ఉంటా.. ఏదైనా ఉంటే అందరితో చెప్పి నిర్ణయం తీసుకుంటా. పార్టీలో ఎవరైనా సీఎం మారుతారంటూ కామెంట్లు చేస్తే తోలుతీస్తా. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే బయటికి పంపిస్తా’’అని స్పష్టం చేశారు.
‘ఈటల’ఎపిసోడ్‌తో కుదుపు
ఆవిర్భావం నాటి నుంచీ టీఆర్‌ఎస్‌లో కొనసాగి కీలక నేతగా ఎదిగిన ఈటల రాజేందర్ ఎపిసోడ్ టీఆర్‌ఎస్‌లో భారీ కుదుపునకు కారణమైంది. ‘గులాబీ జెండాకు మేమే ఓనర్లం’ అంటూ ఈటల చేసిన వ్యాఖ్య లు వివాదాస్పదమయ్యాయి. తర్వాత ఈటల, ఆయన కుటుంబ సభ్యులు భూఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీంతో కేసీఆర్ మే 1న ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించారు. జూన్‌లో ఈటల టీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో అప్రమత్తమైన కేసీఆర్ హుజూరాబాద్‌లో పార్టీ కేడర్ చేజారకుండా చర్యలు చేపట్టారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల 23,855 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో ఢీ
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీతో టీఆర్‌ఎస్ ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించింది. నవంబర్ 1న మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాలు చేశారు. తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలంటూ నవంబర్ 18న ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేశారు. భారత రైతాంగ సమస్యలపై పోరాటానికి టీఆర్‌ఎస్ నాయకత్వం వహిస్తుందని ప్రకటించారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ డిసెంబర్ 20న ఊరూరా చావుడప్పు కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాంగ్రెస్ ఊపొచ్చినా రూపురాలే..!
కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉండిపోయిన కాంగ్రెస్ పార్టీలో 2021 కొంత కదలిక తెచ్చింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ఏడాది జూలై 7న రేవంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ పక్షాన విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టి.. కేడర్‌లో కదలిక తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే సీనియర్ల సహాయ నిరాకరణ, అంతర్గత కలహాలు, సర్దుబాట్లతో కాంగ్రెస్ నావ ఎటూ కదలకుండా చిక్కుబడిపోయిందన్న అభిప్రాయాలు ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి గత ఏడేళ్లుగా ఎదురవుతున్న ఎన్నికల ఫలితాలే 2021లోనూ పునరావృతం అయ్యాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఆ పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డి ఓడిపోగా.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో నిర్లక్ష్యం గట్టిదెబ్బ తీసింది. ఇక్కడ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు 3 వేల ఓట్లు మాత్రమే రావడంతో కేడర్ నిరాశలో పడింది.
అంతకుముందు మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పరాజయం పాలైంది. అయితే ఇటీవలి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం.. తాము పోటీచేసిన రెండు చోట్లా తమకు ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించి ఊరట పొందింది.
ధర్నాలు, నిరసనలతో జనంలోకి..
2021లో కాంగ్రెస్ పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, గిరిజనులకు కూడా ఆ పథకాన్ని వర్తింపజేయాలనే డిమాండ్‌తో ఆగస్టు 9న ఇంద్రవెల్లి వేదికగా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా మోగించింది. ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ సెప్టెంబర్ 17న సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ వేదికగా భారీ సభ నిర్వహించింది. పోడు భూములపై అక్టోబర్ 5న భారీ రాస్తారోకో, 20 నియోజకవర్గాల్లోని పోడు రైతులతో ఆందోళన చేసింది.
అంతకుముందు సెప్టెంబర్ 22న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. సీపీఎం, సీపీఐ, టీజేఎస్, ఇంటిపార్టీ, న్యూడెమొక్రసీ పార్టీలతోపాటు పలు ప్రజా, కుల సంఘాలు కూడా ఆ ఆందోళనలో పాల్గొన్నాయి. ఇక నిరుద్యోగ, విద్యార్థి జంగ్ సైరన్ పేరుతో ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌ల కోసం అక్టోబర్ 2న ఎల్బీనగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహం వద్ద కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది.
తర్వాత ఒకట్రెండు యూనివర్సిటీల్లో ఇదే అంశంపై సదస్సులు నిర్వహించారు. అయితే డిసెంబర్ 9న రాహుల్‌గాంధీతో పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించాలనుకున్న సభ సాధ్యం కాలేదు. ఏడాది చివరిలో రాష్ట్ర రాజకీయాల్లో రచ్చరేపిన ధాన్యం కొనుగోళ్ల అంశంలోనూ కాంగ్రెస్ క్రియాశీలకంగానే వ్యవహరించింది. ఇందిరాపార్కు వేదికగా రెండ్రోజుల పాటు దీక్ష చేసిన ఆ పార్టీ నేతలు.. అటు బీజేపీకి, ఇటు టీఆర్‌ఎస్‌కు దీటుగానే కౌంటర్ ఇచ్చారు.
తప్పని అసమ్మతి, అలకలు
కాంగ్రెస్ పార్టీలో తరచూ కనిపించే అసమ్మతి, అలకలు 2021లోనూ ఎదురయ్యాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకాన్ని ఇష్టపడని పలువురు నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. ఆయా నేతలను రేవంత్ బుజ్జగించినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీనిపై చర్చించేందుకు టీపీసీసీ ముఖ్య నేతలను పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించాల్సి వచ్చింది. పార్టీ కోర్ కమిటీ స్థానంలో ఈ ఏడాది సెప్టెంబర్ 12న టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసి.. షబ్బీర్ అలీని కన్వీనర్‌గా నియమించింది.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలందరికీ అందులో స్థానం కల్పించింది. ఇక ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ ఏడాది ఎక్కువగా వార్తల్లో నిలిచారు. పీసీసీ అధ్యక్ష పదవి అడిగి వర్కింగ్ ప్రెసిడెంట్‌తో సరిపెట్టుకున్న ఆయన.. తనదైన శైలిలో రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. రేవంత్ పట్ల తన అభిప్రాయాన్ని బాహాటంగా చెప్తూ వచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సభ్యత్వ నమోదులో బిజీగా ఉంది.
బీజేపీ మరింత జోష్
2020 చివరిలో వచ్చిన గెలుపుతో 2021లోకి ప్రవేశించిన బీజేపీ.. అదే ఊపును కొనసాగించింది. జాతీయ నాయకత్వం మద్దతు ఓవైపు.. రాష్ట్రంలో సమకూరుతున్న బలం మరోవైపు ఆ పార్టీకి మరింత జోష్‌ను ఇచ్చాయి. అదే క్రమంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏడాది పొడవునా ఆందోళనలు, ఉద్యమాలు, వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలను లక్ష్యంగా చేసుకుంది.
సై అంటే సై అంటూ పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ జనంలోకి వెళ్లింది. ఆయా కార్యక్రమాలకు జాతీయ నేతలను రప్పించింది. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌తో టీఆర్‌ఎస్ సర్కార్‌పై ఒత్తిడి పెంచేందుకు, రాష్ట్రంలో మెజారిటీ వర్గం ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు బీజేపీ అగ్రనేత అమిత్‌షాతో నిర్మల్‌లో సభ నిర్వహించింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది.
బీజేపీ ఈ ఏడాది రాజకీయంగా పలు ఎత్తుపల్లాలు చవిచూసింది. మొదట్లో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఓటమి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడం, మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడం వంటి ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఆగస్టు చివరిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
సీఎం కేసీఆర్, మంత్రులపై బండి సంజయ్, ఇతర ముఖ్య నేతలు నేరుగా విమర్శలు, ఆరోపణలు సంధిస్తూ, సవాళ్లు విసురుతూ.. టీఆర్‌ఎస్ నాయకత్వం తప్పనిసరిగా స్పందించాల్సిన పరిస్థితులు కల్పించారు. తద్వారా జనంలో బీజేపీ వైపు దృష్టి మరలేలా చేయగలిగారు. ఇకముందు కూడా ఇదే ఊపు కొనసాగించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంది. 2022 ఏడాది మొదట్లోనే రెండో విడత పాదయాత్ర చేపట్టి.. పెట్రోల్‌పై రాష్ట్ర వ్యాట్ తగ్గింపు, దళితబంధు అమలు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంపు, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి అంశాలపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది.
హుజూరాబాద్ గెలుపు నుంచి..
టీఆర్‌ఎస్ నుంచి బయటికి వచ్చిన ఈటల రాజేందర్.. బీజేపీ తరఫున బరిలోకి దిగి హుజూరాబాద్‌లో విజయం సాధించడంతో ఆ పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. టీఆర్‌ఎస్ పెద్దలు సర్వశక్తులూ ఒడ్డినా, భారీగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసినా ఈటల విజయం సాధించడాన్ని అనుకూలంగా మల్చుకోవడంపై దృష్టిపెట్టింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే ప్రచారం మొదలుపెట్టింది. ఇందుకు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా అండదండలు అందించడంతో.. కొత్త కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించింది.
కిషన్‌రెడ్డికి కేబినెట్ హోదాతో..
కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న జి.కిషన్‌రెడ్డికి ఈ ఏడాది కేంద్ర కేబినెట్ మంత్రి హోదా లభించింది. పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను ఆయనకు అప్పగించారు. తెలంగాణ ఏర్పడ్డాక, అంతకు ముందు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ నేతలెవరికీ ఇలా కేంద్ర కేబినెట్ హోదా లభించలేదు. దీనిని బట్టి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో స్పష్టమైంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయజెండా ఎగరవేయాలనే లక్ష్యంతో బీజేపీ జాతీయ నాయకత్వం ముందుకు వెళుతోంది.
వైఎస్సార్‌టీపీ కొత్త ఆశలతో..
తెలంగాణలో ఈ ఏడాది మరో కొత్త పార్టీ తెరపైకి వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తానూ రంగంలో ఉన్నానంటూ ‘వైఎస్సార్‌టీపీ’పార్టీని స్థాపించారు. పార్టీని ప్రారంభించినప్పటి నుంచీ ఆమె ప్రజల్లోనే ఉంటూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. నిరుద్యోగ దీక్షలు, పాదయాత్రలు, రైతు ఆవేదన దీక్షలు నిర్వహిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, ఇతర బాధితుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చుతున్నారు.
తాను అండగా నిలుస్తానంటూ భరోసా ఇస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ పెద్దల తీరుపై గట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి ఆశించినమేర చేరికలు లేకపోయినా.. మెల్లగా ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment