సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు తాను కోవర్టునని, అందుకే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డినుద్దేశించి మాట్లాడుతున్నానని కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవంలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కోవర్టునయితే ఇటీవలి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన భార్య నిర్మలను పోటీ చేయించి టీఆర్‌ఎస్‌పై ఎందుకు కొట్లాడతానని ప్రశ్నించారు. రాష్ట్రంలో పార్టీ నాయకత్వాన్ని దారిలో పెట్టేందుకే మాట్లాడుతున్నానని, ఎవరికీ బానిసను కాదని, తననెవరూ కొనలేరని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇతరపార్టీల నేతలను కలిసినంత మాత్రాన వారి పార్టీ కండువాలు కప్పుకున్నట్టుగా మాట్లాడటం సరైంది కాదన్నారు. అదే నిజమైతే అసెంబ్లీలో మంత్రి కేటీఆర్, రేవంత్ ప్రేమికుల్లా చేతులు లాక్కుంటున్న ఫొటోలు మీడియాలో వచ్చాయని, వాటి సంగతేంటని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కేటీఆర్‌లు చేతిలో చేయివేసుకుని మాట్లాడుకునే ఫొటోలు దేనికి సంకేతమని వ్యాఖ్యానించారు.
ఇటీవల సంగారెడ్డిలో జరిగిన అధికారిక కార్యక్రమంలో తన నియోజకవర్గానికి నిధులివ్వాలని మంత్రి కేటీఆర్‌ను అడిగానని, ఇస్తారో ఇవ్వరో వాళ్ల ఇష్టమని అన్నారు. అందరిలా కేసీఆర్‌ను తాను తిట్టలేనని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడంటే బస్సు డ్రైవర్‌లాంటివాడని, అలాంటి డ్రైవర్ బస్సును సరిగా నడపడం లేదని చెప్పడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. అన్ని విషయాలు ఈ నెల 5న జరిగే పార్టీ సమావేశంలో మాట్లాడతానని జగ్గారెడ్డి తెలిపారు. అనుమానాలు అవసరం లేదని, తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment