సభ్యత్వ సమన్వయకర్తల సమావేశంలో రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు సామాన్య ప్రజలు, రైతుల సమస్యలను పరిష్కరించకపోగా రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయని, రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గపు చర్యల వెనుక మోదీ, కేసీఆర్‌లున్నారని ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జనగామ జిల్లాకు చెందిన దాదాపు 300 మంది ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులెదుర్కొంటున్న ధాన్యం కొనుగోళ్ల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేయకపోగా పక్కదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని అన్నారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో చనిపోయిన రైతు కుటుంబాలను అధికారంలో ఉన్నవారెవరూ కనీసం పరామర్శించలేదని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
తెలంగాణలో స్థానికులకు ఉద్యోగాలివ్వాలని ఇందిరా గాంధీ ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులను అమల్లోకి తెస్తే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 317 జీవోను తెచ్చి స్థానిక ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. బీజేపీ ఆ జీవోను రద్దు చేయించవచ్చని, కానీ తమ పార్టీ అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామని బీజేపీ నేతలు చెప్పడం దారుణమని పేర్కొన్నారు.
సభ్యత్వంలో వేగం పెంచండి
కాగా, కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని రేవంత్‌రెడ్డి సూచించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన అసెంబ్లీ నియోజకవర్గ సభ్యత్వ సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. గ్రామ స్థాయిలో, పోలింగ్ బూత్ స్థాయిలో సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment